హైదరాబాద్, ఆగస్టు 1:గవర్నర్ అమోదం లభించని బిల్లుల విషయంలో ముందుకే వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుల్ని ప్రవేశపెట్టి వాటిని మళ్లీ గవర్నర్ అమోదం కోసం పంపాలని మంత్రి మండలిలో నిర్ణయించారు.గవర్నర్ అమోదం పొందని బిల్లులపై ముందుకే వెళ్లాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ శాసనసభతో పాటు శాసన మండలి అమోదించిన బిల్లులను పలు కారణాలతో గవర్నర్ తమిళ సై తిప్పి పంపారు. శాసన సభ అమోదించిన బిల్లుల్ని పాస్ చేయకుండా గవర్నర్ వద్దే అట్టి పెట్టుకోవడంపై గతంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఈ వ్యవహారంలో చివరి నిమిషంలో గవర్నర్ పెండింగ్ బిల్లులను అమోదించి మరికొన్నింటిపై న్యాయసమీక్షకు పంపుతున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు బిల్లులు అసలు గవర్నర్ కార్యాలయానికి రాలేదని వివరణ ఇచ్చారు. ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటే గవర్నర్ కార్యాలయం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో కొన్నింటిని అమోదించకుండా అలాగే అట్టిపెట్టుకోవడంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉంది.
ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రుచించలేదు. నిర్ణీత వ్యవధిలోగా బిల్లులు గవర్నర్ అమోదం పొందకపోవడంతో చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో రెండింటిని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రి మండలిలో సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి మండలి సోమవారం ఆమోదించింది. తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల చైర్మన్లు, మేయర్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్దేశించిన గడువును మూడేండ్ల నుంచి నాలుగేళ్లకు పెంచాలనే బిల్లుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.ఇప్పటికే శాసన సభ, మండలి ఆమోదించిన ఈ రెండు బిల్లులను చాలా కాలం క్రితమే గవర్నర్ ఆమోదం కోసం పంపారు.
అయినా వాటికి మోక్షం లభించకపోవడంతో మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తిరస్కరించడంపై మంత్రిమండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.రాజ్యాంగాన్ని, చట్టసభలను అపహాస్యం చేసేలా గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని మంత్రి మండలి సమావేశంలో విమర్శించినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాల నిర్ణయాలను అవమానించేలా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని తెలంగాణ మంత్రి మండలి పేర్కొంది. గవర్నర్ తిప్పి పంపిన పురపాలక, పంచాయతీరాజ్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ బిల్లులను మళ్లీ శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించి పంపుదాం. రెండోసారి పంపిన బిల్లులను విధిగా గవర్నర్ ఆమోదించాల్సి ఉందని మంత్రిమండలి సమావేశంలో సీఎం పేర్కొన్నారు.