హైదరాబాద్, ఆగస్టు 3:హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిర్వహించే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు ఉండటం, సెప్టెంబర్‌లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్టులోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… శాసనసభ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ ఏడాదికి సంబంధించి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావటంతో… అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం…. ఏమైనా ప్రకటనలు చేస్తుందా అన్న చర్చ మొదలైంది.ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఎన్నికలకు ముందు జరగనున్న ఈ చివరి అసెంబ్లీ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు స్పీకర్.
రాష్ట్ర శాసనసభ పనితీరు అద్భుతంగా ఉన్నదని ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. ఈ ఘనత అధికార యంత్రాంగం సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయాల్సిన అవసరమున్నదన్నారు. మనమందరం ప్రజలకు జవాబుదారీ అని స్పీకర్ పేర్కొన్నారు.