గుంటూరు, జూలై 26:కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవిపై నమోదైన కేసు విషయంలో ఆయనకు భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టేసింది. 2014 ఎన్నికల సమయంలో గుంటూరు నగరంలో మెగాస్టార్ చిరంజీవిపై కేసు నమోదైంది. అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఓ రాజకీయ సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ కేసు పెట్టారు. నిర్ణీత టైంలోపు మీటింగ్ పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని ఆయనపై కేసు నమోదు అయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న చిరంజీవిపై కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కొన్నాళ్ల క్రితం ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం చిరంజీవిపై నమోదైన కేసును కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.ఇటు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విషయంలో ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు ఇటీవల కోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. న్యాయ స్థానం వారికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ గత వారం తీర్పును వెల్లడించింది. హైదరాబాద్ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ ఈ సంచలన తీర్పును వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై గతంలో వారు చేసిన ఆరోపణలకు సంబంధించి దాఖలైన పరువు నష్టం దావాపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది.జీవిత, రాజశేఖర్ దంపతులు 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మెగా స్టార్ గా తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి, ప్రజల కోసం బ్లడ్ బ్యాంకుతో పాటు ఐ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి రక్తం అందివ్వాలనే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. అప్పట్లో ఈ బ్లడ్ బ్యాంకుకు సినీ అభిమానులు మద్దతు తెలిపారు. ఎన్నో వేల మంది రక్త దానం చేశారు. ఆపదలో ఉన్న వారికి రక్త సాయం చేయాలని ఆకాంక్షించారు. అయితే, జీవిత, రాజశేఖర్ దంపతులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ బ్లడ్ బ్యాంక్ పేరుతో సినీ అభిమానుల రక్తాన్ని సేకరించి, డబ్బులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వాళ్లు ఏకంగా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి తీవ్ర విమర్శలు చేశారు.
అప్పట్లో ఈ ఆరోపణలు సంచలనం కలిగించాయి. చిరంజీవి రక్త నిధికి చాలా మంది రక్తం ఇచ్చేందుకు వెనుకాడారు.జీవిత, రాజశేఖర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద తీవ్ర ఆరోపణలు చేయడం పట్ల సినీ నిర్మాత, చిరంజీవి బావమరిది అయిన అల్లు అరవింద్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు జీవిత, రాజశేఖర్ దంపతుల వ్యాఖ్యలపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. వారిపై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి గొప్ప మనసుతో చేస్తున్న మంచి కార్యక్రమం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కేసు ఫైల్ చేశారు. 2011 నుంచి కొనసాగుతున్న ఈ కేసు విచారణ, తాజాగా ముగింపు దశకు వచ్చింది. మంగళవారం(జులై 18)నాడు ఈ కేసులో తుది తీర్పు వెల్లడి అయ్యింది. జీవిత రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించడంతో అప్పీల్‌కు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు జీవిత, రాజశేఖర్ దంపతులకు న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది.