డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు
హోమ్ శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లు కేటాయింపు
రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పేట్రేగిపోతున్న గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇటీవల సినీ పరిశ్రమకు కూడా కీలక సూచనలు సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్ లోనూ దీన్ని ప్రధానంగా ప్రస్తావించారు. యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడి, శాంతి భద్రతల కోసం హోం శాఖకు బడ్జెట్ లో రూ.9,564 కోట్లు కేటాయించింది. మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరం. యువత దీని బారినపడితే దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను ఈ మహమ్మారి బారి నుంచి కాపాడేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నాం.
డ్రగ్స్ రవాణా, వినియోగం చేస్తూ పట్టుబడితే వారిని ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. తెలంగాణ మాదకద్రవ్య నిరోధక సంస్థకు తగిన సౌకర్యాలు కల్పించి దాన్ని బలోపేతం చేశాం. విద్యాసంస్థల్లో వీటి కట్టడికి యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి.. 4,137 మంది విద్యార్థులను యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా నియమించాం. మాదక ద్రవ్యాల వల్ల జరిగే హానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నాం. వీటికి సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హావిూ ఇస్తున్నామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడిరచారు. మరోవైపు నానాటికీ పెరుగుతున్న సైబర్ నేరాలపైనా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ విషయాన్ని కూడా మంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్టాభ్రివృద్ధికి శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో అవసరం. అభద్రతా వాతావరణంలో పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించవు. ఈ మధ్య వైట్ కాలర్, సైబర్ నేరాలు పోలీసు వ్యవస్థకు సవాల్‌గా మారుతున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగానికి అవసరమైన వాహనాలు అందించాం. ఆధునిక నేర పరిశోధనలో పోలీసులకు శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో సైబర్ కైమ్ర్ ఫిర్యాదులను నమోదు చేసే అవకాశం కల్పించాం. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు చేసేలా వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబరుపై విస్తృత ప్రచారం చేస్తున్నాం. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేలా శిక్షణా తరగతులు నిర్వహించాం అని మంత్రి భట్టి వివరించారు.