అవగాహనా రాహిత్యంతో కెటిఆర్ సభను తప్పుదోవ
రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ఘనత కెసిఆర్‌ది
విషయాన్ని వొదిలి గాలిమాటలు…
బిజెపితో బిఆర్‌ఎస్ చీకటి ఒప్పందాలు
బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం
అసెంబ్లీలో తీర్మానంపై చర్చ సందర్భంగా కెసిఆర్, కెటిఆర్‌లపై సిఎం రేవంత్ ఫైర్
బిజెపితో పదేళ్లు అంటకాగి అన్యాయం చేశారని విమర్శలు
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కుల గురించి సభలో చర్చ జరుగుతున్నప్పుడు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, పదేళ్లు సీఎం అని చెప్పుకునే ప్రతిపక్ష నేత, మాజీ సిఎం కెసిఆర్ ఎక్కడ దాక్కున్నారని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సభలో కనిపిస్తే ప్రధాని మోదీ ఏమనుకుంటారో అనే భయంతో కేసీఆర్ ఎక్కడో దాక్కున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ శాసనసభలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అవగాహనా రాహిత్యంతో కేటీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సిఎం రేవంత్ అన్నారు. కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు.
ప్రతిపక్ష సభ్యులు వివాదాల జోలికి వెళ్లకుండా స్జబెక్ట్‌పై మాట్లాడాలని సూచించారు. సభలో ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభను కేటీఆర్ తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాలివాటం మాటలను సభలో మాట్లాడుతున్నారని..ఇప్పటికైనా ప్రతిపక్షం తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. దిల్లీ వెళ్లి చీకటి ఒప్పందాలు చేసుకున్నారని..సభలో ఆ చీకటి ఒప్పందాల గురించి చెప్తారా..లేదా బడ్జెట్‌పై ఇంకేమైనా వాళ్ల అభిప్రాయం చెబుతారో తెలుసుకోవడానికి చర్చను ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు కేటీఆర్ పేమెంట్‌కోటా అనుకున్నానని.. కానీ ఇప్పుడే ఆయన అబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అని తేలిందన్నారు. తమ నాన్న తమకు చదువు లేకపోయినా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. తాము స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగామన్నారు. జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశానని.. తాను తండ్రిని అడ్డుపెట్టుకుని మంత్రి అవ్వలేదన్నారు. అవతలి వారిని కించపర్చాలనే ఉద్దేశంతో అహంకార పూరితంగా మాట్లాడటం సరికాదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేంద్రంలోని మోదీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు మద్దతు తెలిపారన్నారు. జిఎస్టీ, రైతు చట్టాలపై కేంద్రంలో బీజేపీకి కేసీఆర్ మద్దతు తెలిపారన్నారు. తెలంగాణను అప్పులలోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
మోదీతో పదేళ్లపాటు స్నేహం చేసిన కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్‌ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ తెలంగాణ హక్కుల కోసం మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారని.. లేదంటే ప్రజలు బీఆర్‌ఎస్ నాయకులను క్షమించబోరన్నారు. ఎన్నో రకాల జబ్బులు ఉన్నా వ్యక్తి..ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి, తనకు పెళ్లికి పిల్ల కావాలని అడిగినట్లు బీఆర్‌ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి పాపాలు పొగొట్టుకోవడానికి తీర్థయాత్రలు చేసినట్లు బీఆర్‌ఎస్ పరిస్థితి ఉందన్నారు. తండ్రి పేరు చెప్పుకొని తాను మంత్రిని కాలేదని, కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యానని, కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా అనుకున్నానని, అయితే అంతకంటే దారుణమని అన్నారు. తాను పేమెంట్ కోటాలో సీఎంను కాలేదని, మొన్న బిఆర్‌ఎస్ నేతలు దిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వొచ్చారని వ్యాఖ్యానించారు.
తమకేవిూ అక్కర్లేదని, ప్రధాని ప్రేమ చాలని చెప్పిన మనిషి కేసీఆర్ అని విమర్శించారు. విద్యుత్‌పై రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక విధానమే లేదని, రూ.7లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లిపోయారని, బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, గత ప్రభుత్వ పరిపాలనలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, వారేం చేశారో చూశాకే ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. బిఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో వొచ్చిన సీట్లు లోక్‌సభ ఎన్నికల్లో రాలేదని, లోక్‌సభలో గుండుసున్నా దక్కినా తీరు మారకుంటే ఎలా..అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మాట్లాడాలని కోరుతున్నానని సీఎం అన్నారు. ఇక తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ పవర్ సర్కిల్‌ను ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని, ఎవరో పత్రికల్లో రాసిన గాలి మాటలను పట్టుకుని సభలో మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తూ.. కేటీఆర్ సభతోపాటు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ వాళ్లలా ఏది పడితే అది చేసేవాళ్లం కాదని, సింగరేణి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధమని భట్టి స్పష్టం చేశారు.
ts news live, union budjet 2024, revanth reddy, congress party, BRS, kcr, ts assembly