తెలంగాణలోనూ బస్సు ఛార్జీల పెంపు ఖాయమంటూ కెటిఆర్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని తెలిపారు. ఉచితంగా ఇస్తామన్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
కర్ణాటకలో బస్సు టికెట్ ఛార్జీల్ని పెంచేందుకు కేఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తుందని, ప్రభుత్వ బస్సుల్లో ఛార్జీల పెంపు అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ ఛైర్మన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ ఇటీవల తెలిపారని, 15 నుంచి 20శాతం మేర ఛార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన చెప్పారు. ‘ఇంధనం, ఆటో విడిభాగాల ధరలు గణనీయంగా పెరిగాయని, 2019 నుంచి బస్సుల్లో టికెట్ ఛార్జీల్ని పెంచలేదని, 2020 నుంచి కేఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ జరగలేదని, అందువల్ల టికెట్ ధరలను పెంచడం తప్పడం లేదని, గత మూడు నెలల్లో కార్పొరేషన్‌కు రూ.295 కోట్ల నష్టం వాటిల్లిందని, 40 కొత్త ఓల్వో బస్సుల్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామని, ఇప్పటి వరకు 600 సాధారణ బస్సుల్ని కొనుగోలు చేశామని శ్రీనివాస్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో పేర్కొన్న నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్‌లో ఈ విధంగా పోస్ట్ చేశారు.