బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరి పేరు ప్రకటించడం, ఆయన ప్రణాళికాబద్ధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, అభివృద్ధి పనుల ప్రొసీడింగులు అందించడం, సోషల్ మీడియా వారియర్స్ కు శిక్షణ, గ్రామ గ్రామాన ఆత్మీయ సమావేశాల నిర్వహణతో స్టేషన్ ఘన్ పూర్ బిఆర్ఎస్ శ్రేణుల లో కొత్త జోష్ కనబడుతుంది.
” అభ్యర్థి ప్రకటన నుండే”
ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడమే కాకుండా ముచ్చటగా మూడోసారి సీఎం కావాలనే లక్ష్యంతో వివిధ రకాల సర్వేల అనంతరం అభ్యర్థుల ప్రకటన చేశారు. అందులో భాగంగానే 115 నియోజకవర్గాల నుండి ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను గత నెల 21న ప్రకటించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్యకు బదులు ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేరును ప్రకటించిన విషయం విధితమే. కడియం పేరును ప్రకటించడంతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు, కడియం వర్గీయులు భారీ ఎత్తున బాణసంచాలు పేల్చి సంబరాలు జరిపారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పథకాల అమలు, ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కలిసి రానున్నాయి.
” కడియం ఇంటికి క్యూ”
స్టేషన్ ఘన్ పూర్ టిఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి పేరు ప్రకటించిన మరుసటి రోజు నుండే నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువజన సంఘాలు, కుల సంఘాలు, ఎమ్మెల్యే రాజయ్య తో అతి సన్నితంగా ఉన్నవాళ్లు సైతం శ్రీహరిని కలిసి అభినందించడంతో పాటు ఎన్నికల్లో మద్దతును మీకే ప్రకటిస్తామంటూ ఆయన ఇంటికి క్యూ కట్టాయి.
” ఆత్మీయ సమ్మేళనాలతో “
గత నెల 21న అభ్యర్థిగా తన పేరు ప్రకటించడంతో 23వ తేదీన అభిమానులు, పార్టీ శ్రేణులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాగాల సంపత్ రెడ్డి లాంటి ముఖ్య నేతలతో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని నింపారు. అదే జోష్ తో మండల కేంద్రాలు పెద్ద గ్రామాలైన పల్లగుట్ట, తాటికొండ, ధర్మసాగర్, జఫర్గడ్, లింగాల గణపురం, చిల్పూర్ లాంటి గ్రామాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు జనాలు, కార్యకర్తలు భారీగా తరలి రావడం ఉత్సాహాన్ని నింపుతుంది.15 ఏళ్లుగా నియోజకవర్గానికి దూరంగా తనకు ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రతి గ్రామాల ఉన్న సమస్య తెలుసు వాటి పరిష్కారానికి మార్గము తెలుసు అంటూ మీకు తల వంపులు తేకుండా నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తా శ్రీహరి హామీ ఇవ్వడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక సోషల్ మీడియా వారియర్స్ తో నిర్వహించిన ఒకరోజు శిక్షణ శిబిరంలో కడియం శ్రీహరి మాట్లాడుతుండగా వారియర్స్ నినాదాలు, ఈలలు, కేకలతో చూపిన ఉత్సాహం టిఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది.