ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేసిన కెసిఆర్ ప్రభుత్వం
రూ. 94 వేల కోట్లు ఖర్చు…సాగులోకి 93 వేల ఎకరాలు
నాణ్యతా లోపం వల్లే పిల్లర్లు కుంగినట్లు ఎన్‌డిఎస్‌ఏ స్పష్టం
దేశ చరిత్రలోనే కెసిఆర్ ఘోర తప్పిదం
‘మేడిగడ్డ’ పూర్తి స్థాయిలో నింపితే 44 గ్రామాలు, భద్రాచలంకు ప్రమాదం
ప్రాజెక్టుల సందర్శన పేర బిఆర్‌ఎస్ విహార యాత్రలు
బిఆర్‌ఎస్ వ్యాఖ్యలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మండిపాటు
కమీషన్లకు కక్కుర్తిపడి గత ప్రభుత్వంలో పెద్దలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపేశారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జటసౌధలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.94 వేల కోట్లు ఖర్చు చేస్తే కేవలం 93 వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగులోకి వొచ్చిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ. 38,500 కోట్ల నుంచి రూ.80 వేల కోట్లకు పెంచారని, కానీ కాగ్ లెక్కల ప్రకారం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.1.47 లక్షలు కావాలని తెలిపారు. కాళేశ్వరం నిర్వహణ ఖర్చు కూడా చాలా ఎక్కువని, ప్రజాజెక్టులోని అన్ని పంపులను పూర్తి స్థాయిలో నడపాలంటే కరెంటు బిల్లే రూ. 10 వేల కోట్ల దాకా అవుతుందని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్టు పూర్తయి అన్ని మోటార్లు నడిస్తే ఈ వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ప్రాజెక్టుపై అధిక వడ్డీతో తీసుకున్న రుణాలతో ఏడాదికి రూ. 15 వేల కోట్ల దాకా ఖర్చు చేయాల్సి వొస్తుందని వివరించారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్ర చేసిందని బిఆర్‌ఎస్ చేసిన ఆరోపణపై ఉత్తమ్ మండపడ్డారు. మేడిగడ్డ మొదలైనప్పుడు , కూలినప్పుడు కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. మేడిగడ్డలో పిల్లర్లు 6 అడుగులు లోపలికి కుంగయని, నాసిరకంగా నిర్మించడం కారణంగానే బ్యారేజీ కుంగిందని కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటయిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బ్యారేజ్ కుంగింది అక్టోబర్ 21న అయితే తమ ప్రభుత్వం డిసెంబర్‌లో ఏర్పాటయిందని అన్నారు. మేడిగడ్డ వద్ద ఎవరో బాంబులు పెట్టారని ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేశారని అన్నారు.
ఇంతఘనం బ్యారేజ్ కుంగినా కెసిఆర్ కనీసం నోరు మెదపలేదని అన్నారు. ఎన్‌ఎస్‌డిఏ సలహాలు, సూచనల మేరకే మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ గేట్లు తెరిచామని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రెండు రోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తామని, ఆ నీటిని మిడ్ మానేరుకు తరలిస్తామని ఉత్తమ్ తెలిపారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటిని పంపింగ్ చేయాలని బిఆర్‌ఎస్ చెబుతుందని, అలా చేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే సమీపంలోని 44 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదముందని, భద్రాచలం కూడా పూర్తిగా కొట్టుకు పోతుందని ఉత్తమ్ అన్నారు.
మేడిగడ్డ కుంగినప్పుడు బిఆర్‌ఎస్ ప్రభుత్వమే నీళ్లను కిందకు వొదిలిందని, ఇప్పుడేమో మేడిగడ్డ నుంచి నీటిని పంపింగ్ చేయాలని కోరుతుందని విమర్శించారు. డిపిఆర్‌లోని అంశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, అసలు సెంట్రల్ డిజైన్ సంస్థ ప్రకారం నిర్మాణం జరుగలేదని, ఒక వ్యక్తి ఆలోచనల ప్రకారం కాళేశ్వరం న్మించారని మంత్రి ఉత్తమ్ మండపడ్డారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఇంత ఘోర తప్పిదం ఎవరూ చేసి ఉండరని, ఈ విషయంలో ప్రజలకు కెసిఆర్, కెటిఆర్ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమండ్ చేశారు. ఇప్పుడు అదే బిఆర్‌ఎస్ నేతలు ప్రాజెక్టుల పేరు మీద విహార యాత్రలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు.