A place where you need to follow for what happening in world cup

బిజెపి, కాంగ్రెస్ చెప్పినట్టు కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో కాదు

  • బిఆర్ ఎస్,ఎంఐఎం చెప్పినట్టు కమలంబ స్టీరింగ్ అదాని చేతిలో కాదు
  • బిజెపి చెప్పినట్లు హస్తం స్టీరింగ్ కేసి ఆర్ చేతిలో కాదు

తెలంగాణ ఓటర్ల చేతిలో స్టీరింగ్

గత కొన్ని నెలలుగా తెలంగాణలో నడుస్తున్న టాపిక్ ఏ పార్టీ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందనేది.ఏ పార్టీని అంతర్గతంగా ఎవరు సడిపిస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని అధికార భారత రాష్ట్రసమితి ( బి ఆర్ ఎస్)కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ(బిజెపి), ఎంఐఎం తదితర పార్టీలన్నీ కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ విమర్శల ఘాటును పెంచుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో విమర్శలకు ఇంకా పదును పెడుతూ తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ‘మీ మీ పార్టీలను తెరవెనుకనుండి ఎవరో నడిపిస్తున్నారనే ఆరోపణలకు ఊతం ఇస్తున్నారు. స్టీరింగ్ విషయంలో ఒక పార్టీపై మరొకపార్టీ బురద చల్లుకోవడం బాగా ఎక్కువైంది. ఈ విమర్శలన్నీ పార్టీని నడిపించే స్టీరింగ్ అధ్యక్షులది కాదని, ఒక పార్టీ స్టీరింగ్ మరొక పార్టీ అధ్యక్షుడి వద్ద, లేదంటే కార్పోరేట్ శక్తుల వద్ద ఉందన్నది ఈ స్టీరింగ్ల సారాంశం.

రాజకీయాలు, కార్పోరేట్లు జంటమిత్రులే

వాస్తవానికి ఈ పార్టీలన్నింటిని కూడా దాదాపు కార్పోరేట్ శక్తులు నడిపిస్తాయనే వాదనలున్నాయి. అదాని బిజెపికి దగ్గరని, అంబానీ కాంగ్రెస్ కు దగ్గరని పలువురు పేర్కొంటుంటారు కూడా. అంతేకాకుండా ఆయా పార్టీల లోక్సభ ఎన్నికల ఖర్చును కూడా సదరు కార్పోరేట్ శక్తులు భరిస్తాయని గత కొన్నేళ్ళుగా జరుగుతున్న బహిరంగ విషయమే. అసలు కార్పోరేట్ మొత్తం దేశాన్ని నడిపిస్తుందనేది కమ్యూనిస్టుల వాదన. ఏదిఏమైనా విషయం ఎలాగున్నా కార్పోరేట్
సాయం లేనిది ఏ పార్టీకి కూడా మనుగడలేదన్న విషయం ఒప్పుకోవాల్సిందేనని మరికొందరి వాదనగా ఉంది. అలా దేశ, రాష్ట్ర రాజకీయాలలో కార్పోరేట్ శక్తులు అంత బలంగా నాటుకుని వేళ్ళూనాయని చెప్పవచ్చు. కావున రాజకీయాలకు, కార్పోరేట్లకు మధ్యన అందరికి తెలియని ఒకరకమైన బంధం,బంధుత్వం, స్నేహం ఉందనేది తేటతెల్లమవుతుంది.

స్టీరింగ్ విషయంలో శృతిమించుతున్న విమర్శలు

గత కొన్ని నెలలుగా స్టీరింగ్ చుట్టూనే తెలంగాణ రాజకీయాలు  తిరుగుతున్నాయి. బిజెపి స్టీరింగ్ అదాని చేతిలో ఉందని బి ఆర్ ఎస్ ఆరోపణలు చేస్తుండగా, అందుకు ప్రతిగా బిజెపి బి ఆర్ ఎస్ స్టీరింగ్ ఎం ఐఎంపార్టీ చేతిలో ఉందని ప్రత్యారోపణ చేశారు. అంతేగాకుండా బిజెపి, బి ఆర్ ఎస్లు ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపించగా బి ఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బి జెపి ఆరోపించింది.కాంగ్రెస్ స్టీరింగ్ బి ఆర్ ఎస్ అధినేత చేతుల్లో ఉందని బిజెపి చెబుతుంది.వైఎస్సారీపీ కూడా బి ఆర్ ఎస్ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందని ఆరోపించింది.ఈ పార్టీలన్నీ కూడా ఒకతానులో ముక్కలేనని, అందరూ ఒక్కటేనని, బహుజనుల కోసం పోరాడేది తామొక్కరమేనని బి ఎస్పీ చెబుతుంది. ఇలా ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం ప్రస్తుతం తెలంగాణలో ఒక ఫ్యాషన్ గా మారింది.

తెలంగాణ ఓటర్ల చేతిలోనే అసలైన స్టీరింగ్ వాస్తవానికి తెలంగాణ ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. స్వాతంత్య్ర ఉద్యమకాలం నుండే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు తెలంగాణ ప్రజల చైతన్యాన్ని, పోరాటపటిమను వెల్లడి చేస్తాయి. అయితే నేడు బూర్జువా రాజకీయాలుగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏదేని ఒక పార్టీని వెనుకనుంచి నడిపే కొన్ని అదృశ్య శక్తులుంటాయి,అయితే తెలివిగల తెలంగాణ ప్రాంత ఓటర్లు మాత్రం ఆయా రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజలు తెలివితక్కువవారని, ఆయా ఓటర్ల మెదడు, శరీరం తమ ఆధీనంలోనే ఉంటాయనుకుంటే అది పొరబాటే అవుతుంది. ఎక్కడ కర్రుకాల్చి, కీలేరిగి వాత పెట్టాలో తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా మరే రాష్ట్ర ప్రజలకు తెలిసి ఉండదేమో.

అందునే ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీలు  విమర్శించుకున్నట్టుగా ఎవరి చేతిలో ఎవరి స్టీరింగ్ లేదని, అన్ని పార్టీల స్టీరింగ్ లూ తెలంగాణ ప్రజల(ఓటర్ల) చేతిలో ఉన్నాయని, ఓటర్లుగా తాము స్టీరింగ్ ఈసారి ఏ పార్టీకి తిప్పితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ దిశగా ఇప్పటికే స్టీరింగ్ ఏ పార్టీవైపు తిప్పాలో తెలంగాణ ప్రజలు ఆలోచించుకుని సంసిద్ధులై ఉన్నారని ఆయా రాజకీయ పార్టీలు ఎంత త్వరగా గ్రహిస్తే అంతమంచిది. మరీ తెలంగాణ ప్రజలను అంత తెలివితక్కువవారిగా, తాయిలాలకు మోసపోయేవారిగా, ఎటు గాలి వీస్తే అటు ఊగుతారన్నట్టుగా రాష్ట్రంలోని పార్టీలు గాలివాటంగా అనుకోవడం హాస్యాస్పదం.

ఎవరిని ఎక్కడ ఉంచాలో, గద్దెపై ఎక్కించాలో, దించాలో తెలియని అమాయక, అయోమయ స్థితిలో తెలంగాణ ప్రజలున్నారని అనుకోవడానికి వీలులేదు. ఆయా రాజకీయ పార్టీల స్టీరింగ్ల గొడవ ఎలా ఉన్నా అసలైన అన్ని పార్టీల స్టీరింగ్లు మాత్రం తెలంగాణ ఓటర్ల చేతిలో ఉన్నాయి. ఈ సారి ఆ స్టీరింగ్ ఏపార్టీవైపు తిరుగుతుందో, ఏ పార్టీకి అనుకూలంగా తిప్పడానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారో ఎన్నికల ఓటింగ్ జరిగే నవంబరు 30 తదుపరి, లెక్కింపు జరిగే డిసెంబర్ 3వ తేదీన మాత్రమే వెల్లడికానుంది.

Leave A Reply

Your email address will not be published.