రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించిన దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రారంభోత్సవాలకు సభలకు ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగస్తులు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తున్నందున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. మొదటి 24 గంటలు ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో అనుమతి లేని వాల్ రైటింగ్స్, పోస్టర్స్ కటౌట్స్ వంటివి ఉంటే వెంటనే తొలగించి నివేదిక సమర్పించాలని కోరారు.
ఇతర పబ్లిక్ ఆస్తులపై ఉండే అనుమతి లేని పోస్టర్లు కటౌట్లు పోస్టర్ల వంటివి వెంటనే తొలగించాలని ప్రభుత్వ శాఖ అధికారులను సూచించారు. మండల ప్రజా పరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దారులు ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా 24 గంటల నివేదిక 48 గంటల నివేదిక 72 గంటల నివేదిక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నివేదించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుంచి ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి సెలవులు ఉండవని తెలియజేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో అనుమతి లేని పోస్టర్లు గోడల పై రాతలు క్యాలెండర్ల వంటివి తొలగించి 24 గంటల్లో జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన ఆర్.పి. యాక్ట్ కింద చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్టీవో పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.