- రూ. 600 కోట్లు అక్రమ చెల్లింపులు
- ఐఏఎస్ ల ప్రేక్షక పాత్ర
- బినామీ కాంట్రాక్టర్లకు ‘సహకారం’
- సంఘాలతో జాయింట్ అకౌంట్లు
- ఆదివాసీలను దగా చేసిన వైనం
- ‘పీసా’ చట్టానికి తూట్లు
- నిబంధలకు పాతర
రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ చట్టప్రకారం నిర్ణయాలు తీసుకోవలసిన కొందరు ఐఏఎస్ అధికారులు దారి తప్పారు. పీకల్లోతు ఇసుకలో కూరుకుపోయారు. ఆదివాసేతర బినామీ కాంట్రాక్టర్లకు పనులను అప్పగించి ఆదివాసీల పొట్టకొట్టారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో నిబంధలకు విరుద్ధంగా జరిగిన రూ. 600 కోట్ల అక్రమ చెల్లింపులకు సాక్షీభూతంగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో జరిగిన భారీ స్కామ్ లో వీరి పాత్ర గురించి చర్చ జరుగుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఈ భారీ స్కామ్ లో రెండు జిల్లాలకు కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులుగా పనిచేసిన 16 మంది ఐఏఎస్ లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రీచ్ లను బినామీ కాంట్రాక్టర్లు అప్పగించినట్టు స్పష్టమవుతోంది.
‘పీసా’ చట్టం ఏమి చెప్తోంది?
షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం చిన్నతరహా ఖనిజాలను స్థానిక ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించాలి. వీటిపై వచ్చే ఆదాయం పూర్తిగా ఆదివాసీలకే దక్కాలి. 1996 లో వచ్చిన కేంద్ర చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం యధాతథంగా ఆమోదించింది. పంచాయితీరాజ్ శాఖ జీవో నంబర్ 66 ద్వారా మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. గ్రామసభల ద్వారా అర్హత పొందిన సహకార సంఘాన్ని గుర్తించి ఇసుక తవ్వకాలను మైనింగ్ శాఖ కేటాయించాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీవో నంబర్ 38 ద్వారా కొత్త ఇసుక విధానం ప్రవేశపెట్టారు. జీవో నంబర్ 3 ద్వారా మార్గదర్శక సూత్రాలను జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన పనిచేసే జిల్లా స్థాయి ఇసుక కమిటీల సిఫారసుల మేరకు ఇసుక తవ్వకాలకు అవసరమైన ఈసీ, సీఎఫ్ఈ, సీఎఫ్ఓ వంటి అనుమతులను తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ తీసుకుంటుంది.
ఇసుక తవ్వకాలను, అమ్మకాలను ఆదివాసీ సహకార సంఘాలకు పూర్తిగా అప్పగించకుండా టీజీఎండీసీ ద్వారా ప్రభుత్వం వ్యాపారానికి తెర లేపింది. ఇక్కడే ఆదివాసీలకు అన్యాయం జరిగింది. ఆదివాసీ సహకార సంఘాలు రైజింగ్ కాంట్రాక్టర్లంటూ ఒక వింత పదాన్ని తగిలించింది. ఇసుక తవ్వకాలు, అమ్మకాలు వంటి అన్ని అనుమతులూ టీజీఎండీసీకే ఇచ్చారు. కేవలం గోదావరిలో ఇసుక తీయడం, స్టాక్ యార్డుకు తరలించడం, అక్కడ లోడింగ్ చేయడం వంటి పనులను మాత్రమే సహకార సంఘాలకు అప్పగించారు. ఒక క్యూబిక్ మీటర్ ఇసుకను రూ. 600 నుంచి రూ. 650 వరకూ ఆన్ లైన్ ద్వారా టీజీఎండీసీ విక్రయిస్తుండగా ఆదివాసీ సంఘాలకు కేవలం రూ. 220 చెల్లిస్తున్నది. దీనిలో ఇసుక తవ్వకాలు, రవాణా, లోడింగ్ కోసం రూ. 180 పోగా కేవలం రూ. 40 మాత్రమే ఆదివాసీలకు బోనస్ రూపంలో వస్తున్నది. పదేండ్ల క్రితం ఒక ఐఏఎస్ అధికారి చేసిన ఈ నిర్వాకంతో ఆదివాసీలకు నష్టం జరిగింది. పదేండ్లు గడచినా దీనిపై ఎటువంటి సమీక్ష జరగలేదు. ప్రభుత్వం చేసిన దగాతో యజమానులైన ఆదివాసీలు కూలీలుగా మారిపోయారు.
సహకార సంఘాలతో టీజీఎండీసీ ఒప్పందాలు..
ఇసుక తవ్వకాల కోసం చట్టబద్ధమైన అనుమతులు వచ్చిన తర్వాత మైనింగ్ శాఖ ఎస్ 1 పేరుతో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థతో ఇసుక రీచ్ ఒప్పందాలను చేసుకుంటోంది. దీని తర్వాత టీజీఎండీసీ ఆదివాసీ సహకార సంఘానికి అగ్రిమెంట్ చేస్తోంది. ఈ ఒప్పంద పత్రంలో కీలకమైన అంశాలను పొందుపరచారు. ఆదివాసీ సహకార సంఘాలు మాత్రమే ఇసుక తవ్వకాలు, రవాణా, లోడింగ్ పనులు చేయాలి. ఎటువంటి థర్ఢ్ పార్టీ అగ్రిమెంట్లు చేయకూడదు. ఎవరైనా అటువంటి అగ్రిమెంట్లు చేసినా, ఇసుక తవ్వకాలను ఎవరికైనా అప్పగించినా టీజీఎండీసీ అగ్రిమెంట్ రద్దవుతుంది. చెల్లింపులను కూడా నిలిపివేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తామాని కూడా అందులో పేర్కొన్నారు. జీఎస్టీ, తదితర పన్నులను సహకార సంఘమే చెల్లించాలి. ఈ అంశాలను బేఖాతర్ చేస్తూ ఆదివాసీ సహకార సంఘాలు మూడవ పార్టీ అయిన గిరిజనేతర కాంట్రాక్టర్లకు ఇసుక తవ్వకాలను అప్పగిస్తున్నాయి.
ఈ తతంగమంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నది. జీవో నంబర్ 38, 3 ప్రకారం ఏజెన్సీ ఇసుక రీచ్ ల నిర్వహణ, పర్యవేక్షణ అధికారాలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులకు అప్పగించారు. అవసరమైతే ప్రత్యేకమైన మార్గదర్శకాలను జారీ చేసే అధికారం కూడా వీరికి సంక్రమించింది. అయినప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల కలెక్టర్లు కానీ, ప్రాజెక్టు అధికారులు కానీ వీటి గురించి పట్టించుకోరు. కోట్లాది రూపాయల పనులను అనధికారిక బినామీ కాంట్రాక్టర్లు చేస్తున్నా వీరు చర్యలు తీసుకోరు. ఫిర్యాదులు వచ్చినా మౌనమే వీరి సమాధానం. టీఎస్ఎండీసీ చేసిన అగ్రిమెంట్లు కానీ, సహకార సంఘాలు కాంట్రాక్టర్లకు చేస్తున్న అనధికారిక ఒప్పంద పత్రాలను కానీ వీరు చదవరు. వీరి ధృతరాష్ట్ర పాత్ర వెనుక రాజకీయ కారణాలు ఒత్తిడులు ఉండవచ్చు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో గత పదేండ్లుగా 8 మంది కలెక్టర్లు, 8 మంది ఐటీడీఏ పీఓలు పనిచేశారు. వీరంతా బినామీ కాంట్రాక్టర్ల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదు.
జాయింట్ అకౌంట్ల కథ..
ఆదివాసీ ఇసుక సహకార సంఘాలు 1964 సహకార చట్టం, 1995 పరస్పర సహాయ సహకార చట్టం కింద నమోదయ్యాయి. చట్టంలోని నిబంధనలతో పాటూ బైలాస్ ప్రకారం ఇవి పనిచేస్తాయి. సహకార సంఘం అధ్యక్షురాలు, కోశాధికారి పేరుతో బ్యాంకు అకౌంట్లు నిర్వహిస్తారు. సహకార సంఘంలో సభ్యులు కాని వారు ఆర్థిక లావాదేవీలు చేయడానికి వీలు లేదు. సహకార సంఘాల వ్యవహారాల్లో తలదూర్చవద్దని హై కోర్టు అనేక మార్లు హెచ్చరించింది. ఈ చిన్న లాజిక్ కూడా ఐఏఎస్ లకు తెలియక పోవడం విశేషం. ఆదివాసీ ఇసుక సహకార సంఘాలకు ఐటీడీఏ పీఓలు జాయింట్ అకౌంట్లు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. నిబంధలకు విరుద్ధంగా జాయింట్ అకౌంట్ నిర్వహిస్తున్న పీఓలు అనధికారిక బినామీ కాంట్రాక్టర్లకు చెల్లింపుల విషయంలో నోరు మెదపడం లేదు.
2016, 17 వరకూ బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చిన చెక్కులపై నేరుగా సంతకాలు పెట్టిన ప్రాజెక్టు అధికారులు భారీ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఇది వివాదాస్పదం కావడంతో రెండు అకౌంట్ల విధానం పేరుతో మరొక వివాదానికి తెర లేపారు. సహకార సంఘం అధ్యక్షురాలితో కలిపి ఒక జాయింట్ అకౌంట్,సంఘం అధ్యక్షురాలు, కోశాధికారి పేరుతో మరొక అకౌంట్ తెరుస్తున్నారు. బినామీ కాంట్రాక్టర్లకు రెండవ అకౌంట్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ మతలబు ఎవరికీ అర్థం కాదు. బినామీ కాంట్రాక్టర్లకురూ. 180 ఎందుకు చెల్లిస్తున్నారని కలెక్టర్లు కానీ, పీవో లు కానీ అడగరు. కోట్లాది రూపాయల చెల్లింపులు జరుగుతున్నప్పుడు అవి ప్రొసీజర్ ప్రకారం ఉన్నాయో లేదో చూడరు. బిడ్డింగ్ విధానం అమలు చేస్తే రూ. 180 పనిని ఎవరైనా రూ. 150 కే కోట్ చేయవచ్చు. ఈ విధంగా చేస్తే రూ. 30 లక్షలు సహకార సంఘం సభ్యులకు దక్కుతాయి. ఈ మాత్రం అవగాహన కూడా అధికారులకు లేదా?
2012 లో టెండర్ విధానం..
పీసా చట్టం స్ఫూర్తి దెబ్బతినకుండానే ఇద్దరు ఐఏఎస్ అధికారులు తమ విచక్షణాధికారాలు వినియోగించి ఆదివాసీలకు మేలు చేశారు. 2012 లో భద్రాచలం ఐటీడీఏ పరిథిలోని గొమ్ముకొత్తగూడెం, భద్రాచలం, గొమ్ముగూడెం, మొర్రవానిగూడెం, మరికాల ఇసుక సొసైటీలకు కాంట్రాక్టర్లను నామినేటెడ్ పద్దతిలో కాకుండా టెండర్ విధానం ద్వారా ఎంపిక చేశారు. అప్పటీ ప్రాజెక్టు అధికారి వీరపాండ్యన్, సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్త ఇసుక తవ్వకాలు, లోడింగ్ రవాణా కోసం సహకార సంఘాల పేరుతో టెండర్లు నిర్వహించారు. తద్వారా తక్కువ కోట్ చేసిన వారికే పనులు అప్పగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత చట్టాలు మారినా అధికారులు తీరులో మార్పు రాలేదు. బినామీ కాంట్రాక్టర్లు స్వైర విహారం చేస్తున్నా చూసీ చూడ నట్టు పోవడమే వీరి పని.
ఆకునూరి మురళి విఫలయత్నం..
తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ గా నియమితులైన విశ్రాంత ఐఏఎస్ అధికారి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కాలంలో బినామీ కాంట్రాక్టర్లపై కన్నెర్ర చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తతంగమంతా ఆయనకు అర్థమైంది. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామంలో గ్రామసభను ఏర్పాటు చేసి జిల్లా ఇసుక కమిటీ సమావేశాన్ని అక్కడే నిర్వహించారు. సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, బినామీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించవద్దని ఆదేశించారు. తెలంగాణ ఖనిజాభవృద్థి సంస్థ ద్వారా కౌంటర్ గ్యారంటీ ఇప్పిస్తామని బ్యాంకు మేనేజర్లను కూడా ఒప్పించారు. ఇది కార్యరూపం దాల్చే లోగానే ఆయన బదిలీ అయ్యారు. భద్రాచలం పీవో గా పనిచేసిన వీపీ గౌతమ్ కూడా ఇటువంటి ప్రయత్నమే చేశారు. బినామీ కాంట్రాక్టర్ల చెక్కులపై సంతకాలు పెట్టడానికి ఆయన నిరాకరించారు. ఐఏఎస్ లు చేయవలసిన పని ఇదే కదా..
బినామీలకు రూ. 600 కోట్లు..
నిబంధలకు విరుద్ధంగా బినామీ కాంట్రాక్టర్లకు గత పదేండ్ల కాలంలో రూ. 600 కోట్లు చెల్లింపులు జరిగాయి. ఇంత పెద్ద స్కామ్ ఐఏఎస్ అధికారులకు తెలిసే జరిగింది. కాంట్రాక్టర్లు దాదాపు రూ. 100 కోట్ల జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారు. ఇప్పుడు సహకార సంఘాలకు నోటీసులు వస్తున్నాయి. పర్యవేక్షణ లోపం, నిష్క్రియా పరతత్వం, పరోక్ష సహకారం, కాలయాపన కూడా అవినీతి నిరోధక చట్టం ప్రకారం అవినీతి కిందకే వస్తుంది. సహకార సంఘాల కమిషనర్ కానీ, సీబీఐ లేదా విజిలెన్స్ దర్యాప్తు జరిగితే ఈ అవినీతిలో ఎవరి పాత్ర ఎంతో తేలుతుంది.