ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో దుర్గా నవరాత్రుల సందర్భంగా ఏర్పరిచిన దుర్గామాత విగ్రహాల శోభాయాత్ర మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యంగా బీబీనగర్ లోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత శోబాయాత్ర కన్నుల పండువగా సాగింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో విగ్రహాన్ని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకుపోయారు. వేలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య, విచిత్ర వేషధారణలు, బాణసంచా కాల్పులు, భారీ డప్పుల మోతల సందడిలో అమ్మవారిని ఘనంగా గ్రామంలో ఊరేగించారు.
వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మండపంలో కొలువైన అమ్మవారిని నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే, భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖరరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోళి పింగల్ రెడ్డి కూడా తన పుట్టినరోజు సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని అక్కడ అన్నప్రసాద వితరణ చేశారు. నిమజ్జనోత్సవానికి దుర్గామాత ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది.