A place where you need to follow for what happening in world cup

రాహువు మింగిన గ్రామసభ..

  • పీసా కార్యదర్శి సంతకం మాయం
  • పేజీనే చింపి వేసిన వైనం
  • తీర్మానాన్ని మార్చిన ఎంపీడీఓ
  • నలుగురు అధికారుల సహకారం
  • పీఓ తీరుపైనా అభ్యంతరం
  • పోరాటం తీవ్ర తరం చేస్తున్న చొక్కాల ఆదివాసులు

ఆదివాసుల పొట్టకొట్టే మరో చర్యకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఒక కాంట్రాక్టర్ వద్ద భారీగా ముడుపులు పుచ్చుకున్న అధికార యంత్రాంగం రికార్డులను తారు మారు చేసే సాహసానికి వడి గట్టింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి మంజూరైన ఇసుక రీచ్ కి సంబంధించిన అన్ని అనుమతులూ వచ్చి ఆరు నెలలు దాటింది. పీసా చట్టం ప్రకారం ఆదివాసీ సహకార సంఘానికి ఇసుక తవ్వకాలు అప్పగించవలసి ఉంది. సహకార సంఘం ఎంపిక కోసం మార్చి 4 వ తేదీన చొక్కాల గ్రామంలో గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామసభకు ప్రత్యేక అధికారిగా ఉన్న వ్యవసాయ అధికారి అధ్యక్షత వహించగా పీసా ఉపాధ్యక్షుడు, పీసా కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామ కార్యదర్శి, పోలీసు సర్కిల్ ఇనస్పెక్టర్ తదితరులు హాజరయ్యారు. గ్రామ సభకు 110 మంది ఆదివాసీలు హాజరు కాగా ఇసుక రీచ్ కోసం సహకార సంఘాన్ని ఎంపిక చేయడానికి ఓటింగ్ నిర్వహించారు.

నిబంధనల ప్రకారం చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లో పాల్గొన్న 110 మందిలో 89 మంది శ్రీ దుర్గాదేవి సహకార సంఘానికి అనుకూలంగా ఓటు వేయగా మిగిలిన 21 మంది మేడారం సమ్మక్క సొపైటీకి అనుకూలంగా ఓటు వేశారు. తీర్మానాల పుస్తకంలో తీర్మానం రాసి గ్రామసభ సభ్యులందరికీ చదివి వినిపించారు. తీర్మానం కింద కూడా పీసా కార్యదర్శి, తదితర అధికారులందరూ సంతకం చేశారు. వీటిని ఆదివాసీ యువకులు వీడియో తీశారు.

శకుని మామ మాయాజాలం..

ఓటింగ్ లో ఓడిపోయిన సహకార సంఘానికి పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టర్ రంగ ప్రవేశం చేయడంతో అసలు కథ మొదలైంది. శకుని మామగా మారిన ఎంపీడీఓ పాచికలు వేయడం మొదలు పెట్టారు. తీర్మానం సకాలంలో ఐటీడీఏ పీఓ కి పంపక పోవడంతో పాటు తీర్మానాన్ని మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆదివాసీల నిర్ణయాన్ని అపహాస్యం చేసే విధంగా దొంగ నాటకానికి తెర తీశారు. ఐటీడీఏ లోని మరొక మాయలోడు దీనికి సహకరించాడు. చొక్కాల గ్రామసభ తీర్మానం 16 వ నంబర్ పేజీలో నమోదు చేయగా ఈ పేజీని చింపి వేయాలని కార్యదర్శిని ఆదేశించాడు. ఈ పని కోసం కార్యదర్శికి భారీగా ముడుపులు ముట్టాయి. 16 వ నంబర్ పేజీని చింపి వేసి 18 వ పేజీలో మరొక తీర్మానాన్ని ఎంపీడీఓ రాయించాడు.

దొంగ తీర్మానంపై కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంపీఓ తదితరులు కూడా సంతకం పెట్టి ఇరుకున పడ్డారు. మార్చిన తీర్మానం బయటికి రావడంతో అసలు విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ తీర్మానంలో తన సంతకం లేక పోవడంతో పీసా కార్యదర్శి అభ్యంతరం తెలిపాడు. తాను 16 వ నంబర్ పేజీలోని తీర్మానంపై సంతకం పెట్టానని, దీనిని వీడియో ఆధారం ఉందని తెలిపాడు. 89 మంది ఆదివాసీల నిర్ణయాన్ని అపహాస్యం చేసే విధంగా రికార్డును తారుమారు చేసిన అధికారుల తీరుపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం గ్రామసభకు సంబంధించిన వీడియో రికార్డింగ్ ను వారు బయట పెట్టారు.

ఐటీడీఏ పీఓ వింత వైఖరి..

గ్రామసభ సమావేశం పూర్తయిన వెంటనే తీర్మానం పంపకుండా కుట్రలకు పాల్పడిన అధికార యంత్రాంగంపై ఎటువంటి చర్యలు తీసుకోక పోగా వారిని సమర్థించినట్లు వ్యవహరించిన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వైఖరి కూడా ప్రశ్నార్థకంగా మారింది. చొక్కాల ఆదివాసీలు అనేక మార్లు కలిసి తీర్మానం కాపీని, వీడియో వివరాలను సమర్పించినా ఆయన పట్టించుకోలేదు. ఎంపీడీఓ తో పాటు ఐటీడీఏ లోని అవినీతి అధికారి చెప్పిన విషయాలనే పదే పదే చెప్తూ కాలయాపన చేశారు. కనీసం రికార్డులను సేకరించలేదు. తీర్మానం చింపి వేసిన వ్యవహారంపై కనీసం దర్యాప్తునకు ఆదేశించలేదు. దీనితో పీవో వింత వైఖరి పట్ల ఆదివాసీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకటరావును కలిసి పూర్తి వివరాలను తెలియచేశారు. తనకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే ను కూడా పక్కదారి పట్టించే విధంగా పీవో వ్యవహరించడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవో వ్యవహారాన్ని మంత్రి పొంగులేటికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. తీర్మానం చింపి వేసిన అధికారులను సస్పెండ్ చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చొక్కాల ఆదివాసీలు‘రేలా న్యూస్’ కి తెలిపారు.

పీసా కార్యదర్శి వద్దే రికార్డులు..

పీసా చట్టం ప్రకారం పీసా గ్రామసభల రికార్డులన్నీ పీసా కార్యదర్శి వద్దే ఉండాలి. దీనికి విరుద్ధంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నది. సర్పంచ్ లేనప్పుడు పీసా గ్రామసభలకు పీసా ఉపాధ్యక్షుడే అధ్యక్షత వహించాలి. కానీ అధికారులే అధ్యక్షత వహిస్తున్నారు. ఇది పీసా స్ఫూర్తికి, ఆదివాసీల స్వయం నిర్ణయాధికారానికి విరుద్ధం. ఈ చిన్న లాజిక్ కూడా ఐఏఎస్ అధికారులకు అర్థం కావడం లేదంటే ఆదివాసీల పట్ల వారికి ఎంత నిబద్థత ఉందో అర్థం చేసుకోవచ్చు.

బాక్సైట్ గ్రామ సభలు..సుప్రీం కోర్టు..

పీసా చట్టం ప్రకారం గ్రామసభలు ఏ విధంగా నిర్వహించాలో ఒడిషాలోని బాక్సైట్ కోసం నిర్వహించిన గ్రామ సభల గురించి అందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఒడిషా లోని నియాంగిరి కొండ ప్రాంతంలో అపారమైన బాక్సైట్ నిల్వలను ‘పోస్కో వేదాంత’ కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాక్సైట్ తవ్వకాలకు పీసా చట్టం ప్రకారం గ్రామసభల ఆమోదం అవసరమైంది. అధికార యంత్రాంగం 18 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించింది. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. చొక్కాలలో చేసినట్లే అధికార యంత్రాంగం తీర్మానాలను మార్చివేసి అనుకూలంగా తీర్మానాలు రాసుకుంది.

ఇది గమనించిన ఆదివాసీలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గ్రామసభలను మళ్ళీ నిర్వహించాలని, అధికార యంత్రాంగం గ్రామసభలకు దూరంగా ఉండాలని ఈ కేసును విచారించిన జస్టిస్ సదాశివం ఆదేశించారు. జిల్లా జడ్జి ఆధ్యర్యంలో గ్రామసభలను నిర్వహించి సీల్డ్ కవర్లలో తీర్మానాలను సుప్రీం కోర్టుకు సమర్చించాలని కూడా ఆదేశించారు. జిల్లా జడ్జి ఆధ్యర్యంలో 18 గ్రామసభలను మళ్ళీ నిర్వహించగా అన్ని గ్రామసభలు ఏకగ్రీవంగా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయి. వీటిని పరిశీలించిన సుప్రీం కోర్టు బాక్సైట్ తవ్వకాలను నిలిపివేసింది. గ్రామసభలను కేవలం ఆదివాసీల పెద్దలే నిర్వహించుకోవాలి. అధికారులు కేవలం పరిశీలకులుగా ఉండాలి. కొందరు బ్యూరోకాట్ల తెలివి ఏ విధంగా ఉంటుందో చెప్పే చిన్న కథను ఈ సందర్భంగా పాఠకుల కోసం రాస్తున్నాను.

కలెక్టర్..ఒక గొల్ల కురుమ కథ…

ఒక కుగ్రామంలో ఊరి చివర వృద్ధుడైన ఒక గొల్ల కురుమ గొర్రెలను మేపుకొంటున్నాడు. ఎండ తీవ్రతతో పెద్ద చెట్టు కిందకి గొర్రెలను మళ్ళించి తానూ సేద తీరుతున్నాడు. అంతలో రోడ్డుపై కొన్ని కార్లు వస్తున్నాయి. ఒక కారు ఆగడంతో అన్ని కార్లు ఆగాయి. ముందు కారు లోంచి ఒక అధికారి దిగాడు. ఆయనతో పాటు వచ్చిన మంది మార్బలం కూడా దిగారు. చెట్టు కింద కూర్చొన్న గొల్ల కురుమను అధికారి పిలిచాడు. ఓ పెద్దాయనా.. నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు యాదయ్య సార్ అని సమాధానం ఇచ్చాడు. ఈ గొర్రెలన్నీ నీవేనా అని అధికారి అడిగాడు. అందుకు యాదయ్య అవును సార్ అన్నాడు. మొత్తం ఎన్ని గొర్రెలు ఉంటాయని అధికారి అడిగాడు. అందుకు యాదయ్య సమాధానం ఇస్తూ ప్రతి రోజూ లెక్క పెట్టను సార్. కొన్ని గొర్రెలను జంతువులు చంపుతుంటాయి. కొన్ని గొర్రెలు ఈనుతుంటాయి. మంద పెరుగుతూనే ఉంటుందని చెప్పాడు. ఇక్కడ మొత్తం ఎన్ని గొర్రెలున్నాయో లెక్క పెట్టకుండా చెప్పమంటావా అని అధికారి అడిగాడు. బాంఛన్ దొరా..మీరు చదువున్న వాళ్ళు అన్నాడు యాదయ్య. వెంటనే ఆ అధికారి తన పిఏ ను పిలిచి జీపీఎస్ మిషన్ తెమ్మన్నాడు.గొర్రెల వద్ద అక్షాంక్ష, రేఖాంశాలను ( లాంగిట్యూడ్, లేటిట్యూడ్) కొలిచి మొత్తం 196 గొర్రెలున్నాయని చెప్పాడు. కాదు సార్.. నా అంచనా ప్రకారం 185 గొర్రెలే ఉంటాయని యాదయ్య అన్నాడు. అధికారులు లెక్క పెట్టి యాదయ్య చెప్పిన సంఖ్య కరెక్టేనని అంటారు. యాదయ్య వెంటనే ఒక ప్రశ్న అడిగాడు.

అయ్యా.. గొర్రెలకు రక్షణ కోసం కాపలాగా ఆరు కుక్కలను కూడా పెంచుతున్నాను. అవి కూడా మందలోనే ఉన్నాయి. నీ మిషన్ లో కుక్కలు కనిపించవా అని అమయాకంగా అడిగాడు. అందుకు విస్తుపోయిన అధికారి మౌనంగా ఉండి పోయాడు. మిషన్ లెక్క తప్పింది. కలెక్టర్ మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ తర్వాత అధికారి పిఏ యాదయ్య వద్దకు వచ్చి సార్ కి ఒక గొర్రె పిల్ల కావాలంట పెంచుకుంటాడంట అన్నాడు. అందుకు డబ్బులు కూడా ఇస్తాడంట అన్నాడు. పెద్ద సార్ వద్ద నేను డబ్బులు తీసుకుంటానా అని యాదయ్య అంటాడు. సార్ కి నచ్చిన గొర్రె పిల్లను తీసుకోమని చెప్పాడు. అధికారి మంద వద్దకు వచ్చి ఒక పిల్లను తీసుకుని కారులో పెట్ట మంటాడు. యాదయ్య అధికారి వద్దకు వచ్చి సార్ మీరు కారులో పెట్టమన్నది గొర్రె పిల్ల కాదు..కుక్క పిల్ల అంటాడు. అధికారి అవాక్కయి యాదయ్య ఇచ్చిన గొర్రె పిల్లను తీసుకుని అక్కడి నుంచి బయలు దేరతాడు. వచ్చిన అధికారి జిల్లా కలెక్టర్ అని తెలిసిన యాదయ్య ఎంతో పరవశించిపోతాడు. బ్యూరోకాట్ల తెలివి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ చిన్న కథ ప్రాచుర్యంలో ఉన్నది.

 

Leave A Reply

Your email address will not be published.