ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ లాబీలో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో ఒక్క కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే.. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా మిగిలారు. ఈ మొత్తం వ్యవహారంలో కవిత పూర్తిగా ఇబ్బందుల్లో పడబోతున్నారా లేకపోతే.. కీలకమైన మార్పులు ఏమైనా జరగబోతున్నాయా అన్నది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారారు. ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఈయన కవిత తరపున బినామీగా వ్యవహరంచారని ఈడీ చెబుతోంది. ఆయన కూడా గతంలో తాను కవిత బినామీనేనని అంగీకరంచారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానన్నారు.
మళ్లీ ఇప్పుడు పూర్తిగా మనసు మార్చుకుని అప్రూవర్ గా మారారు. కవిత మద్యం బినామీ వ్యాపారం మొత్తం పిళ్లై పేరు మీదుగా సాగిందని ఈడీ, సీబీఐ చెబుతున్నాయి. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు. వారిద్దరూ సౌత్ లాబీ నుంచి కీలకం. ఇక కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ పేరుతో ఉన్న గ్రూపులో ఈడీ, సీబీఐ ఉదహరించిన వారంతా అప్రూవర్లుగా మారారు. వ్యాపారం చేసినట్లుగా చెబుతున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి కూడా చాలా రోజుల పాటు జైల్లో ఉండి.. బెయిల్ తెచ్చుకుని అప్రూవర్లుగా మారారు. అప్రూవర్లుగా మారడం అంటే.. తాము స్కాం చేశామని అంగీరించి.. నిజాలు చెప్పడమే. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి స్కాంకు పాల్పడ్డారో వారు చెబుతారు.
దాని ప్రకారం ఇతర నిందితులు మునిగిపోతారు. ఇక్కడ ఒక్క కల్వకుంట్ల కవిత మాత్రమే అప్రూవర్ కాలేదు. దీంతో ఆమె ఒక్కరినే అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారా అన్న అనుమానం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. కల్వకుంట్ల కవితను టార్గెట్ చేసుకుని ఈ అప్రూవర్ పిటిషన్లను అంగీకరిస్తూంటే మాత్రం.. తెలంగాణ ఎన్నికలకు ముందు సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. గతంలోనే ఢిల్లీ విచారణ సమయంలోనే ఈడీ కవితను అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ తర్వాత అరెస్టు లాంటివి.. తదుపరి విచారణలు లాంటివి ఏమీ చేయేలదు. మళ్లీ ఇప్పుడే కేసులో కదలిక వస్తోంది. ఎలాంటి పరిణామాలు జరిగినా రాజకీయంగా సంచలనం సృష్టించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.