A place where you need to follow for what happening in world cup

17 చుట్టూ తెలంగాణ రాజకీయాలు

0 39

సెప్టెంబర్‌ 17వ తేదీ వస్తుందంటే చాలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడేక్కుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచి ఈ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విమోచం, విలీనం, విద్రోహం ఇలా రకరకాల పేర్లతో సెప్టెంబర్‌ 17 పొలిటిక్‌ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌గా మారుతుంటుంది. ఇక ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌ 17వ తేదీ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈసారి తెలంగాణ రాజకీయాల్లో ఏకంగా జాతీయ స్థాయిలో చర్చకు కేంద్ర బిందువు కానుంది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు పోటాపోటీన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు సమీపించడంతో సెప్టెంబ‌ర్ 17న ప్రత్యేక కార్యక్రమాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అగ్రనాయకుల సభలకు కాంగ్రెస్‌- బీజేపీ నేతలు ప్లాన్‌ చేయడంతో రాజకీయం వేడెక్కింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడటంతో సెప్టెంబ‌ర్ 17న బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలకు ప్లాన్‌ చేస్తున్నాయి.

ఈ నెల 16, 17 తేదీల్లో CWC సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ PCC సిద్ధమవుతోంది. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్‌ అగ్రనాయకులు, ప్రతినిధులు, ఇతర నాయకులు కలిపి దాదాపు 3 వందల మంది హాజరయ్యే అవకాశం ఉందని పీసీసీ అంచనా వేస్తోంది. ఆ స్థాయిలో ఏర్పాట్లపై PCC ఫోకస్ పెట్టింది.మరోవైపు సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు కమలం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం తమ తమ పోలింగ్ బూతుల్లో జాతీయ జెండా ఆవిష్కరించి.. సాయంత్రం సభకు వచ్చే విధంగా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ముగింపులో భాగంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.ఇదిలా ఉంటే మరోవైపు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ కూడా ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లు దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి కేసీఆర్‌ రూటు మార్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ల ఎత్తుగడలకు చెక్‌ పెట్టేలే సెప్టెంబర్‌ 16వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అదే రోజు భారీ బహిరంగ సభను నిర్వహించాలని చూస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్‌ 17 మరోసారి సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారనుంది.

ఐదు హామీలు ప్రకటించనున్న సోనియా
తెలంగాణ వచ్చేది కాంగ్రెస్సేనని, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయాలని, అందరు సమన్వయంతో మెలగాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ సూచిచారు. బుధవారం రాత్రి తాజ్‌కృష్ణా హోటల్‌లోని రేవంత్ రెడ్డి, మాణిక్‌రావ్‌ ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పలువురు నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలకు పలు సూచనలు, సలహాలు చేశారు. రాత్రి 10 గంటల దాకా జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 16వ తేదిన నిర్వహించనున్న సీడబ్య్లూసీ సమావేశాన్ని.. 17వ తేదిన జరిగే బహిరంగ సభలపై కూడా కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. అలాగే సీడబ్య్లూసీ సమావేశానికి పార్టీ జాతీయ నేతలందరు హాజరవుతున్న తరుణంలో దీన్ని సవాల్‌గా తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలతో సహా పలువురు నేతలు రానున్నారని అన్నారు. వీళ్లు 16,17వ తేదీల్లో హైదరాబాద్‌లోనే ఉంటారని, సభ నిర్వహణకు పార్టీ నేతలతో ఆహార, రవాణా, సమన్వయ తదితర కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపారు.

అయితే వీటికి నేతలు మధుయాస్కీ, మహేష్ గౌడ్ తదితరులు నాయకత్వం వహించాలని సూచించారు. సభకు ప్రతి మండలం నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు వచ్చేలా ప్లాన్‌ చేయాలన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే..5 హమీలపై గ్యారంటీ పత్రాన్ని బహిరంగ సభలో సోనియా గాంధీ విడుదల చేస్తారని అన్నారు. ఈ గ్యారంటీ హామీలను, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాలు చేయాలని సూచించారు. అందరి ఐక్యతతో విజయం సాధించవచ్చని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అలాగే సెప్టెంబర్ 18న పార్టీ జాతీయ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని, ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తారని అన్నారు.

మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా తాజ్‌కృష్ణ హోటల్‌లో.. వేణుగోపాల్, రేవంత్ సహా తదితర నేతలతో చర్చలు జరిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే వామపక్షాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈనెల 17న నిర్వహించనున్న బహిరంగ సభ కోసం మైదానం ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే సభకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ ఇవ్వాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసుకుంది తెలంగాణ కాంగ్రెస్‌. కానీ అదే రోజున బీజేపీ కార్యక్రమం ఉండటం వల్ల తమకు ఇస్తారో.. లేదోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చివరికి ఎల్బీ స్టేడియంలో సభను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.

Epaper

X