A place where you need to follow for what happening in world cup

వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు

  • వైఎస్సార్ హయాంలో రెండు సార్లు టికెట్ ఆశించి భంగపడ్డానన్న ఆర్కే
  • అయినా వైఎస్ ను, కాంగ్రెస్ ను ఒక్క మాట కూడా అనలేదని వ్యాఖ్య
  • జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరానని వెల్లడి
  • ఎమ్మల్యేగా రెండు సార్లు అవకాశం ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ఆర్కే
  • అన్ని విషయాలపై తర్వాత మాట్లాడతానని వ్యాఖ్య

వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2019 వరకు… 2019 నుంచి ఇప్పటి వరకు నీతి, నిజాయతీగా ఎమ్మెల్యేగా పని చేశానని… ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేశానని ఆయన చెప్పారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెపుతున్నానని చెప్పారు.

ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ… కఠినమైన నిర్ణయం తీసుకోవాలనిపించి రెండు నిర్ణయాలను తీసుకున్నానని చెప్పారు. మంగళగిరి ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలనేది ఒక నిర్ణయం కాగా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలనేది రెండో నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను కూడా ఆయన మీడియాకు చూపించారు.

రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో అందజేశానని… తన రాజీనామాను నేరుగా ఇద్దామని స్పీకర్ కార్యాలయానికి వెళ్లాలని… అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఓఎస్డీకి లేఖను అందజేశానని ఆర్కే తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరానని చెప్పారు. 1995 నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్ గా పని చేసుకుంటూ వచ్చానని.. వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద పని చేస్తూ 2004లో సత్తెనపల్లి టికెట్ ఆశించి భంగపడ్డానని, 2009లో పెదకూరపాడు సీటును ఆశించి మళ్లీ భంగపడ్డానని చెప్పారు. అయినప్పటికీ వైఎస్సార్ ను కానీ, కాంగ్రెస్ ను కానీ ఒక్కమాట కూడా అనలేదని తెలిపారు.

ఆ తర్వాత వైసీపీని జగన్ స్థాపించారని, ఆయన ఆహ్వానం మేరకు వైసీపీలో చేరానని ఆర్కే చెప్పారు. ఎమ్మెల్యేగా తనకు జగన్ రెండు సార్లు అవకాశం కల్పించారని… ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. తన వ్యక్తిగత కారణాలవల్ల ఈరోజు శానససభ సభ్యత్వానికి, వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు. రాజీనామా చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు బదులుగా… త్వరలోనే అన్ని విషయాలపై మాట్లాడతానని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.