- కార్యకర్తల్లో నూతనోత్సాహం..
- భూపాలపల్లిలో ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్..
భూపాలపల్లి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన జోష్ పెంచింది. స్థానికంగా బహిరంగసభలో బీఆర్ఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రసంగం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపినట్లు అయింది. గతంలో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్ అప్పట్లోనే గండ్ర వెంకటరమణారెడ్డి టికెట్ ఇవ్వడం జరుగుతుందని భరోసా కల్పించి, అదే మాట ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం మరో మారు జిల్లా కేంద్రా నికి విచ్చేసిన కేటీఆర్ ఎన్నికల కోడ్ వచ్చేలోపే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిస్తూనే, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 14 ఏళ్లలో చేసిన అభివృద్ధిని క్షుణ్ణంగా వివరించారు. అప్పటి పరిస్థితులు నేటి పరిస్థితులు అర్థం చేసుకొని ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగం ఆధ్యాంతం కార్యకర్తలను, నాయకులను నిద్రలేపినట్లు అయింది. దీంతో కేటీఆర్ భూపాలపల్లి పర్యటనలతో నాయకులు, కార్యకర్తలు నూతన ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తమ సాయశక్తుల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రజల దృష్టికి తీసుకెళ్లి పార్టీ గెలుపునకు కృషి చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. – మాజీ స్పీకర్ సహకారం కోరిన గండ్ర.. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తనవంతు సహకారాన్ని అందించాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. సోమవారం జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు. కాగా సభ వేదికపై మాట్లాడుతున్న గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ స్పీకర్ స్థానిక మాజీ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారిని ఉద్దేశించి మాట్లాడారు. గత కొంతకాలంగా మధుసూదనాచారికి టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికే అభ్యర్థిత్వం ఖరారు కావడంతో మధుసూదనాచారి వర్గీయులకు కొంత అసంతృప్తి నెలకొంది.
ఈ క్రమంలో సభ వేదికలో మధుసూదనాచారి సహకారం అందించాలని గతంలో జరిగినవి ఏదున్నా మర్చిపోయి తన గెలుపునకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు. దీంతో మధుసూదనచారి కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండడం జరిగుతుందని, తప్పకుండా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని భరోసా ఇవ్వడంతో స్థానిక బీఆర్ఎస్ లో వర్గాలకు తావు లేకుండా పోయింది. రెండు వర్గాలు గండ్ర వెంకటరమణారెడ్డికే సపోర్టుగా నిలవడంతో పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయింది. అన్ని వర్గాలను, అసంతృప్తి వాదులను కలుపుకుపోయేందుకు గండ్ర వెంకటరమణారెడ్డి కృషి చేస్తూ తన గెలుపుకు బాటలను సుగుమం చేసుకోవడం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. – గుడాడ్ పల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దంపతుల పూజలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కేటీఆర్ నింపిన ఉత్సాహంతో ప్రచారంలో దూకుడు పెంచారు.
సెంటిమెంట్ కలిసొచ్చే ఉద్దేశ్యంతో భూపాలపల్లి మండలం గుడాడ్ పల్లిని తాజా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులతో సరదాగా మాట్లాడారు. గతంలో గుడాడ్ పల్లి గ్రామంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించింది. ఇప్పుడు కూడా గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో ఇవ్వాలని గండ్ర దంపతులు కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీ అభిమాని ఇంట్లో వారితో కలిసి భోజనం చేశారు. గుడాడ్ పల్లి నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన గండ్ర దంపతులను ప్రత్యేకంగా సన్మానించిన కల్లెపు శోభ రఘుపతిరావు దంపతులు వస్త్రాలు బహుకరించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించి, బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పథకాలపై వివరించారు.