- బీఆర్ఎస్ నేతల సంప్రదింపులు
- నియోజకవర్గంలో హాట్ టాపిక్
మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. ములుగు జిల్లా సమ్మక్క సారక్క తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన దామోదర్ రెండున్నర దశాబ్దాలకు పైగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. హరిభూషణ్ మరణం తర్వాత మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా పార్టీ ఎంపిక చేసింది. అజ్ఞాతవాస కాలంలో ఎక్కువ కాలం దండకారణ్యంలోని భద్రాచలం నియోజకవర్గం సరిహద్దు ప్రాంతంలోనే గడిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలతో ఆయనకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.
అటవీ గ్రామాలపైన పూర్తి పట్టు సాధించారు. దామోదర్ ను భద్రాచలం బరిలోకి దింపితే విజయం ఖాయమని భావిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ముందుగా ములుగు జిల్లాకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికే పలుమార్లు దామోదర్ తో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే విషయంలో దామోదర్ ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ముందుగా తనతో పాటూ అజ్ఞాతం వీడిన పలువురు నేతలతో మాట్లాడుతూనే నియోజకవర్గంలోని తన పాత మిత్రుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దామోదర్ చేరిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ కానీ, దామోదర్ కానీ ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచి దామోదర్ ను బరిలోకి దింపితే బాగుంటుందని ముందుగా బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే దామోదర్ సమీప బంధువు బడే నాగజ్యోతి ఇప్పటికే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో నాగజ్యోతి సీతక్కపై పోటీచేసి పరాజయం పాలయ్యారు. ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. నాగజ్యోతికి మళ్ళీ అవకాశం ఇస్తే దామోదర్ మద్దతు కూడా ఆమెకి లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మరో వైపు భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ కు ఎంతో కీలకమైనది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలిని తట్టుకుని భద్రాచలం నియోజకవర్గంలో గులాబీ పార్టీ గెలిచింది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లలో కేవలం భద్రాచలంలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది.

ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పార్టీ ఫిరాయించడంతో మరో అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభమైంది. స్థానికంగా కొందరు నేతలు సీటు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ వీరిలో ఒక్కరు కూడా ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు పోటీ ఇవ్వలేరని బీఆర్ఎస్ సేకరించిన అంతర్గత సమాచారం ద్వారా స్పష్టమైంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ అభివృద్థి సంస్థ చైర్మన్ పొడెం వీరయ్య పార్టీ మారతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ పొడెం వీరయ్య ములుగు జిల్లాకు చెందిన వారు కావడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ములుగు నియోజకవర్గానికి పరిశీలించాలని కొందరు నేతలు పార్టీ నాయకత్వానికి సూచించారు. కొత్త అభ్యర్థి అయితేనే భద్రాచలంలో విజయం సాధిస్తారనే అభిప్రాయాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటీవల తనను కలిసిన స్థానిక నేతలతో అన్నట్లు తెలిసింది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంవైపు అడుగులు వేస్తారా?
దాదాపు 28 సంవత్సరాల పాటూ మావోయిస్టు పార్టీలో పనిచేసిన దామోదర్ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. భూటకపు ఎన్నికలను బహిష్కరించాలంటూ ఎన్నోసార్లు మావోయిస్టు పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వారి పిలుపుకు మొదట్లో కొంత స్పందన వచ్చినప్పటికీ కాలగమనంలో అది కేవలం నినాదంగానే మిగిలిపోయింది. మావోయిస్టుల స్థావరమైన దండకారణ్యంలో కూడా పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. తమ మాట ప్రజలు వినరని పార్టీకి అర్థమైంది. కొన్ని సందర్భాల్లో తమకు అనుకూలమైన నేతను గెలిపించుకోవడానికి మావోయిస్టు పార్టీ వ్యూహాత్మకంగా కొందరికి మద్ధతు పలికింది. 2018 ఎన్నికల్లో భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పొడెం వీరయ్య మావోయిస్టుల మద్దతుతోటే విజయం సాధించారు.

మావోయిస్టు అగ్రనేతల నిర్ణయంపై ఉత్కంఠ..
అజ్ఞాతం వీడి ఇటీవల బయటికి వచ్చిన మావోయిస్టు అగ్రనేతల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దామోదర్ నిర్ణయం కూడా దీనిలో ఒక భాగమేనని చెప్పవచ్చు. పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి వంటి వారితో కలసి అజ్ఞాతం వీడిన దామోదర్ వారితో కలసి సమాలోచనలు జరుపుతున్నారు. వీరి ముందు అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. మావోయిస్టు పార్టీ పై నిషేధం తొలగిస్తే అదే పార్టీ పేరుతో ఎన్నికల బరిలోకి దిగుతారనే అభిప్రాయం ఉంది. కానీ నిషేధం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకునే వాతావరణం కనిపించడం లేదు. అజ్ఞాతం వీడిన మావోయిస్టు నేతలందరూ కలిసి మరొక విప్లవ పార్టీ పెట్టడం మరొక ప్రత్యామ్నాయం. దీనిపై వారి ముందు అనేక ప్రతిపాదనలు ఉన్నాయి.
అసలు ఎన్నికల్లో పోటీ చేయాలా లేక మౌనంగా ఉండిపోవాలా అనేది కూడా వారి ముందున్న మరొక ప్రశ్న. ఇవేమీ జరగక పోతే ఎవరిదారి వారు చూసుకోవడమే మేలని కూడా అనుకుంటున్నారు. ప్రజా జీవితంతో పెనవేసుకున్న బంధాన్ని తెంచుకుని ఉద్యోగాలో వ్యాపారాలో చేసుకునే పరిస్థితి వారికి లేదు. ఎందుకంటే ఐదారు రాష్ట్రాల్ని వణికించి నేతలకు వెన్నులో వణుకు పుట్టించిన చరిత్ర వారిది. రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు సమయం ఉన్నందున ఈ లోగా మావోయిస్టు అగ్రనేతలు ఎటువైపు అడుగులు వేస్తారో తెలుస్తుంది. ఇక దామోదర్ విషయానికి వస్తే ఆయన నిర్ణయాన్ని ఆయనే ప్రకటించాల్సి ఉంది.