తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు
సీతమ్మసాగర్ పూడిక పేరుతో గోదావరిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, చర్ల మండలాల్లో పూడిక పేరుతో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆదివాసీ నాయకుడు మర్మం నరసింహారావు చెన్నై లోని ఎన్టీటీ దక్షిణాది రాష్ట్రాల బెంచ్ లో వేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ ప్రారంభమైంది. పర్యావరణ అనుమతులు లేకుండా పూడిక పేరుతో దొడ్డిదారిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.

రెండు మండలాల పరిధిలో రెండు కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం 2025 లో అప్పటి భద్రాద్రి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనర్ సవాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర జలవనరుల శాఖ, పర్యావరణ శాఖ కార్యదర్శులకు ఎన్జీటీ నోటీసులను జారీ చేసింది.
179224039414181109236ad36b0a1bbbcకేసు విచారణను ఈ నెల 28 కి వాయిదా వేస్తూ ఈ లోగా ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్టీటీ ఆదేశించింది. ఎటువంటి సాంకేతిక అధ్యయనం చేయకపోవడమే కాక ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీని నియమించకుండా పూడిక పేరుతో ఇసుక తవ్వకాలను చేపట్టి పర్యావరణ నిబంధలను రాష్ట్ర ప్రభుత్వం అతిక్రమించిందని పిటిషనర్ ఆరోపించారు. పూడిక పేరుతో తవ్విన ఇసుకను పూర్తిగా వాణిజ్య పరమైన అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్నదని, ఆన్ లైన్ విక్రయాల ద్వారా కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వస్తున్నాయని తెలిపారు. నిబంధలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. పిటిషనర్ తరపున న్యాయవాది శివాంగ్ సింగ్ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి ఆన్ లైన్ విధానంలో విచారణకు హాజరయ్యారు.