తిరుపతి, జూలై 31:గత నెల రోజుల నుంచి దేశ వ్యాప్తంగా సామాన్యులకు భయపెడుతున్న అంశాల్లో టమాటా ఒకటి. వంటింటి సరుకు అయిన టమాటా రికార్డు ధరలు పలుకుతోంది. ఇప్పటికే కొందరు వంటకాలలో టమాటాను తగ్గించగా, కొందరు ఏకంగా టమాటా కొనడం మానేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో టమాటా రికార్డు ధర పలికింది. కిలో టమాటా ధర ఏకంగా రూ.196 నుంచి రూ.200కు చేరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఏపీ, తెలంగాణలో కొందరు రైతులు నెల రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు సంపాదించారు.అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో రోజురోజుకూ టమాటా రికార్డు ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ మార్కెట్లో నాణ్యమైన సరుకు కేజీకి రూ.168 పలకడం తెలిసిందే. తాజాగా శనివారం మార్కెట్లో కిలో టమాటా ధర ఏకంగా రూ.196 పలికింది. కొన్ని రోజుల కిందట నిపుణులు అంచనా వేసిన ధరలను టమాటా రీచ్ అయింది.
దేశంలో ఇతర రాష్ట్రాల్లో టమాటా రూ.250 నుంచి రూ.300 చేరే అవకాశం ఉందని జులై తొలి వారంలో మార్కెట్ నిపుణుల అంచనా వేశారు. ధర దిగుతుందని ఆశలు పెంచుకున్న ఏపీ వాసులకు నిరాశే ఎదురైంది. రూ.170 కి చేరిన కేజీ టమాటా ధర తగ్గుతుందని భావించగా.. అనూహ్యంగా శనివారం రూ.200 వరకు పలికి టమాటా రైతులకు లాభాల పంట పండించింది. సామాన్యూలకు మాత్రం కరెంట్ షాక్ కొట్టినంత పనవుతోంది. మదనపల్లె మార్కెట్‌కు 253 టన్నుల టమాటా వచ్చింది. ఇది చాలా తక్కువ మొత్తం సరుకు అని వ్యాపారులు తెలిపారు.
ఈ క్రమంలో నాణ్యమైన టమాటా రకం మదనపల్లె మార్కెట్లో రూ.160 నుంచి రూ.196, ఆ తరువాత క్వాలిటీ టమాటా రూ.130 నుంచి రూ.160 వరకు రేటు పలికింది. రైతులు విక్రయించే 25 కేజీల టమాటా బాక్స్ ధర రూ.4500 నుంచి రూ. 4,900 మధ్య ఉందని మార్కెట్ వాళ్లు చెబుతున్నారు. దక్షిణాది నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు మదనపల్లె మార్కెట్ నుంచి ఎగుమతి అవుతుంది. కర్ణాటకలోని మార్కెట్ లో సైతం టమాటా మంట ఇంకా తగ్గడం లేదు. ఆ ప్రభావం మదనపల్లె మార్కెట్ పై సైతం కనిపిస్తోంది. మార్కెట్ కు ఎక్కువ సరుకు రాకపోతే కేజీ టమాటా ధర రూ.200 నుంచి రూ.220 -రూ.250 చేరడం పెద్ద సమస్య కాదని తెలుస్తోంది.