A place where you need to follow for what happening in world cup

చాణుక్య ప్రదర్శనతో… పార్టీలకు గులాబీ ఉక్కపోత

0 98

‘ప్రత్యర్థులను బలహీనపరచడం మన విజయానికి కీలక మెట్టు అవుతుంద’ని రాజనీతి శాస్త్రం చెబుతోంది. ఈ శాస్త్రాన్ని కాచివడబోసిన కేసీఆర్ 2014 నుంచి ఇలాంటి వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నారు. దాంతో తన దరిదాపుల్లో ఎవరూ లేకుండా చేసుకోగలిగారు. అలాగే తనకు సమఉజ్జీగా మరొకరు తయారవకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మరికొందరు కాంగ్రెస్ ముఖ్యులకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల విసిరారు. ఇప్పటివరకు కేసీఆర్ గాలానికి చిక్కని రాజకీయ నాయకులంటూ లేరు. అంత అద్భుతమైన ఎత్తుగడలతో ఆ ‘గాలం’ ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి శిష్యుడు, భువనగిరి డీసీసీ అధ్యక్షుడు, అర్ధబలం పుష్కలంగా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముందుగా కేసీఆర్ గాలానికి చిక్కారు. మరికొందరు కూడా అదే దారిలో ఉన్నారు. పొత్తుల ప్రతిష్టంభనకు కారణం ఏమిటి? తెలంగాణలో కేసీఆర్ వ్యూహాలకు ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతోంది. నిజానికి ఏ రాజకీయ పార్టీ అయినా బలపడాలన్నా, బలహీనపడాలన్నా ఆ పార్టీ విధానాలు, ప్రజల మద్దతు, ఇతరత్రా కారణాలను బట్టి ఉంటుంది.

కానీ తెలంగాణలో అలా లేదు.ఏ పార్టీ సైజు ఎంత ఉండాలి? ఏ పార్టీ ఎంత ఎత్తు వరకు మాత్రమే ఉండాలి? ఆ పార్టీలు ఎప్పుడు ఎలాంటి వైఖరి తీసుకోవాలి? ప్రతిపక్షాల పోరాటాలు ఏ రూపాల్లో ఉండాలి? ఆ పోరాటాలను అవి ఎంత దూరం తీసుకువెళ్లి ముగింపు పలకాలి? వంటి అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారు. ఏ పార్టీ ఏ సమయంలో ఎలా పుంజుకోవాలో, ఏ సమయంలో అది చితికిపోవాలో ఆయనే నిర్ణయిస్తారు. ఇది అతిశయోక్తి కాదు. గడిచిన తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాజకీయాలను, రాజకీయ పార్టీల బలాబలాలను దగ్గరగా చూస్తున్న వారికి తప్ప మిగతావాళ్లకు అర్ధం కాదు అలాంటి చాణక్య ప్రదర్శనలో కేసీఆర్ దిట్ట 2014 తర్వాత టిడిపిని తుడిచిపెట్టే ఆపరేషన్ పూర్తయ్యింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే వ్యూహాలకు కేసీఆర్ పదునుపెట్టారు. కొంత మందిని నాటి టిఆర్ఎస్ లోకి లాగేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలకు గాలం వేసిన టిఆర్ఎస్ విజయవంతమైంది. ఈటల రాజేందర్ బహిష్కరణ, బీజేపీ నుంచి హుజురాబాద్ లో మళ్ళీ గెలవడం, గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ అనూహ్య పెర్ఫార్మెన్స్ కేసీఆర్ కు ముందే తెలుసు.

ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కేసీఆర్ రహస్యంగా ‘ఆపరేషన్’ చేసినట్టు అప్పట్లో ఊహాగానాలు వెలువడ్డాయి. అందులో నిజమెంతో తెలియదు కానీ.. కేసీఆర్ అలాంటి చాణక్యాన్ని ప్రదర్శించడంలో దిట్ట. ఎవరు ఏ పార్టీలో చేరాలో, చేరితే ఏమి చేయాలో, మళ్ళీ వారు పార్టీ మారాలంటే ఏ పార్టీలో చేరాలి?వంటి వ్యవహారాలను కేసీఆర్ పర్యవేక్షిస్తారన్న ప్రచారం కూడా ఉంది. మునుగోడు ఉపఎన్నికకు ముందు వరకు తెలంగాణ ‘రణస్థలి’లో బిఆర్ఎస్ కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాగలదని ఒక ‘వాతావరణం’ఏర్పడింది. అందుకు కేసీఆరే కారణం. ఆ వాతావరణం ఏర్పాటుకు గాను కేసీఆర్ రచించిన వ్యూహాలు ఫలించినవి. అయితే ఆయన అంచనాలను దాటి బీజేపీ ముందుకు దూసుకుపోతున్నట్టు పసిగట్టిన వెంటనే దానిని కట్టడి చేయడంలో భాగంగానే ‘నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు’ వెలుగులోకి తీసుకు వచ్చి బీజేపీని నైతికంగా దెబ్బతీయగలిగారు. బీజేపీ సైజు పెరుగుతుండడం వల్ల దాన్నీ కత్తిరించేందుకు కేసీఆర్ ప్రయత్నించారు.

అక్కడి నుంచి క్రమంగా బీజేపీ ప్రయాణం ఎత్తు, పల్లాలతో సాగుతున్నది.ఆ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు ఊపందుకున్నవి. ఇది కేసీఆర్ పుణ్యమేనని బీజేపీ అనుమానం. బిజెపిలో అంతర్గత కలహాలు,అయోమయ వాతావరణానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరో పార్టీ నాయకుడు ప్రయత్నిస్తే బీజేపీలో కలకలం ఎట్లా చెలరేగుతుంది? బండి సంజయ్ మార్పు, కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి చేబట్టడం వెనుక బీజేపీ నిర్ణయమేనా? ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరు? బీజేపీ ‘లోపలి విషయాలు’ తెలిసిన వారికి మాత్రమే అర్ధమవుతాయి. దీన్ని బట్టి బిజెపి ఎంత డొల్లగా ఉన్నదో తేటతెల్లమవుతున్నది. ఇక కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ మారింది.కాంగ్రెస్ లో ఉత్సాహం, ఉత్తేజం కనిపిస్తున్నవి. కర్ణాటక ఎన్నికలలో అనుసరించిన ‘మోడల్’ను తెలంగాణలో అమలు చేయడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరచూ బెంగళూరు వెళ్లి అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ దగ్గర ‘షార్ట్ టర్మ్ కోచింగ్’ తీసుకొని వస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ‘చిన్నాభిన్నం’చేసే పనిలో ఉన్నారు.

ఆయన ప్రసంగాలు కాంగ్రెస్ ను కేంద్రబిందువుగా చేసుకునే సాగుతున్నవి. విభజనకు ముందే అధ్యయనం తెలంగాణ పునర్నిర్మాణం లేదా తెలంగాణ పునరేకీకరణ అని పేర్లు పెట్టినా అంతిమంగా ‘ప్రతిపక్ష ముక్త్ తెలంగాణ’ కావాలన్నది కేసీఆర్ అభిలాష. ‘ఒక రాష్ట్రం – ఒకే పార్టీ’ అనే సిద్ధాంతమూ అమలు చేయాలని అనుకుంటూ ఉండవచ్చు. తెలంగాణ అవతరించకముందే ఇక్కడి ప్రజల ప్రాథమిక అవసరాలు ఏమిటో, రాజకీయ పార్టీలు.. అందులోని నాయకుల అవసరాలు, ‘బలహీనతలు ‘పూర్తిగా అధ్యయనం చేసిన, అవపోసన పట్టిన రాజనీతి ‘ప్రొఫెసర్’ కేసీఆర్. అసలు రాజనీతి ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసిన కోదండరామ్ తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించినా ఆ పార్టీ పుంజుకోలేకపోయింది. తనకు విధేయులైన వాళ్లకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో, తనకు గిట్టని వాళ్ళను ఎలా అణచివేయాలో బిఆర్ఎస్ నిర్మాతకు తెలిసినంతగా దేశంలో మరే రాజకీయ నాయకునికి తెలియకపోవచ్చు. సాధారణంగా కాంగ్రెస్ బలహీన పడిన చోట బీజేపీ లేదా ప్రాంతీయ పార్టీలు బలపడుతుంటాయి. కాంగ్రెస్ నిర్వీర్యమైన ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడలేకపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ పూర్తిగా బలం పుంజుకుంది. జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీలను జగన్ తుడిచిపెట్టేశారు. తెలుగుదేశం ప్రాంతీయపార్టీ కనుక బతికి బట్టకడుతోంది.

ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్యనే పోటీ కేంద్రీకృతమైంది. టిడిపితో మరో ప్రాంతీయపార్టీ జనసేన జట్టు కట్టబోతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ‘కేసీఆర్ స్కూల్ ఆఫ్ థాట్ కు చెందిన నాయకుడే’! కేసీఆర్, జగన్ ఇద్దరి సిలబస్ ఒక్కటే! కాకపోతే జగన్ విద్యార్థి దశలో ఉంటే కేసీఆర్ ప్రిన్సిపాల్ దశ దాటేశారు. తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను ప్రాంతీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి. ఒడిశా, ఏపీ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, జగన్ బీజేపీకి స్నేహపూర్వకంగా లేదా తటస్థంగా మెలుగుతున్నారు. మమతా బెనర్జీ, కేసీఆర్, స్టాలిన్, నితీష్ కుమార్ తదితరులు బీజేపీకి ప్రత్యర్థులుగా అవతరించారు. కేసీఆర్ బిఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీని ఏర్పాటు చేసినా ఆయన రాజకీయ లక్ష్యం తెలంగాణయే. తెలంగాణలో మూడోసారి గెలించేందుకు మాత్రమే ఆయన జాతీయ నినాదం వాడుకుంటున్నారని చాలా తక్కువమందికి అర్ధమైంది. ప్రాంతీయ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ‘తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ’ ని ఎన్నటికీ వదులుకోరు. అందుకే తమ పార్టీ పేరు మార్పు జరిగిందే తప్ప ‘డిఎన్ఏ మారలేద’ని మంత్రి కేటీఆర్ ఇటీవలి కాలంలో తరచూ చెబుతున్నారు. బిఆర్ఎస్ పేరు వల్ల రాజకీయంగా నష్టం కలగకూడదని కేసీఆర్, కేటీఆర్ ప్రణాళిక.

జాతీయ స్థాయిలో తన ప్రత్యర్థి బీజేపీ కనుక ఆయన ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. విజయవంతమైన ప్రతి వ్యక్తికీ శత్రువుల గుంపు ఒకటి ఉండి తీరవలసిందేనని చరిత్ర చెబుతున్నది. శత్రువులు లేని వ్యక్తికి ఆత్మవిశ్వాసం, ధైర్యం.. రెండూ ఉండవు. కాలంతో పాటు కొట్టుకొనిపోయే సామాన్య మనుషుల మందలో అతనొకడుగా మిగిలిపోతాడు. ఒకప్పుడు కమ్యూనిష్టు పార్టీలను ‘తోకపార్టీలు’ అన్న కేసీఆరే వాళ్ళతో చేతులు కలపగలిగారంటే అది ‘కామ్రేడ్ల’ గొప్పతనం కాదు. కేసీఆర్ ఎత్తుగడ. మునుగోడు ఉపఎన్నికలో గెలవడమే ఆనాడు కేసీఆర్ టార్గెట్. కనుక ఉభయ కమ్యూనిస్టులతో మంతనాలు జరిపారు. ‘ఇచ్చిపుచ్చుకున్నారు’. కేసీఆర్ తో కమ్యూనిస్టుల పొత్తు గురించిన ‘భవిష్యత్తు చిత్రపటం’ అందరికీ లీలగా కనిపించింది. కానీ మునుగోడు ఫలితం అనంతరం సిపిఐ,సిపిఎంలు డైలమాలో పడ్డాయి. వారిని కేసీఆర్ డోలాయమానంలో పడేశారు. కర్ణాటక ఫలితాలతో కామ్రేడ్లు కాంగ్రెస్ – బిఆర్ఎస్ మధ్య ఊగిసలాడుతున్నవి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం రెండు పార్టీలకూ లక్ష్యం. కామ్రేడ్లు ఎవరితో పొత్తు పెట్టుకోదలచినా ఈ ‘సానుకూలత’ ఉన్నది. కానీ కామ్రేడ్ల లెక్కలు వేరు. అసెంబ్లీలో,శాసనమండలిలో కాలు మోపాలని ఆశిస్తున్నారు. అదే ఎజండాతో పనిచేస్తున్న ‘కామ్రేడ్లు’.. ఎవరిద్వారా తమ ఆకాంక్ష నెరవేరుతుందో అటువైపే కమ్యూనిస్టులు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.