A place where you need to follow for what happening in world cup

మిథున్ రెడ్డిని ఓసారి ఢిల్లీలో కలిశాను… ఓ విషయాన్ని చాలా అందంగా చెప్పాడు!: పవన్ కల్యాణ్

0 319

రాజంపేటలో కూటమి అభ్యర్థిగా లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి కోసం జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారానికి వచ్చారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తావన తెచ్చారు. సారా వ్యాపారాలు చేసే మిథున్ రెడ్డి నేను పోటీ చేసే పిఠాపురం వచ్చి నన్ను ఓడిస్తాడంట అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఓసారి తాను ఢిల్లీలో మిథున్ రెడ్డిని కలిశానని, ఆ సందర్భంగా అతడు ఒకటే చెప్పాడని వెల్లడించారు. “మేం మా జిల్లాకు ఎవరినీ రానివ్వం… మా జిల్లాకు ఎవరొచ్చినా ఎదుర్కొని తొక్కేస్తాం అని ఆ పెద్దమనిషి చాలా అందంగా చెప్పాడు” అని పవన్ వివరించారు.

“ఇక్కడ యువత చాలామంది ఉన్నారు. మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు? సలసలమని కాగే రక్తం మీది! గొలుసులు తెంచుకునే కండబలం మీది! మరి గుండెబలం ఎందుకు లేదు మీకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని కొట్టే గుండెబలం ఉందా, లేదా?” అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయం అని తెలియడంతో జగన్ 70 మంది అభ్యర్థులను మార్చాడని, ఆ విధంగా అభ్యర్థిని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిదని వెల్లడించారు. ఇక్కడ వైసీపీ గెలిచే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని పాతాళానికి తొక్కేస్తున్నాం… కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

“ఈ జిల్లాలో సంపద అంతా కేవలం ముగ్గురు వ్యక్తుల చేతుల్లో ఉండిపోయింది. పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు, పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి చేతుల్లోనే సంపద ఉంది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన దుర్ఘటనే వైసీపీ ఇసుక దోపిడీకి నిదర్శనం. ఇష్టానుసారం ఇసుక దోచేసి డ్యాం గేట్లు తెగిపోతున్నా పట్టించుకోలేదు. తద్వారా 39 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. 9 ఊళ్లు కొట్టుకుపోయాయి. డ్యాం నిండిపోయిందని లస్కర్ రామయ్య చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన హెచ్చరికతో మిగతా ప్రజల ప్రాణాలు నిలబడ్డాయి. లస్కర్ రామయ్యకు జనసేన తరఫున రూ.2 లక్షలు ఇచ్చాం” అని పవన్ కల్యాణ్ వివరించారు. కూటమి తరఫున రాజంపేట లోక్ సభ స్థానం నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని పవన్ పిలుపునిచ్చారు.
Pawan Kalyan, Mithun Reddy, Rajampet, Janasena, YSRCP, Kiran Kumar Reddy, BJP, Annamayya District

Leave A Reply

Your email address will not be published.