A place where you need to follow for what happening in world cup

కాస్కో హరీష్‌…నీ ఆటలు, పప్పులు సాగవ్‌

0 5,317

ఆగస్ట్‌తో సిద్ధిపేటకు పట్టిన శనీశ్వ‘రావు’ల దరిద్రం పోతది
రుణమాఫీతో రైతులకు బ్యాంకుల నుండి విముక్తి
 కేసీఆర్‌, హరీష్‌రావుల నుండి ప్రజలకు స్వాతంత్య్రం
 సిద్ధిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా అతెలంగాణకు బిజెపి గాడిద గుడ్డు ఇచ్చింది
 సిద్ధిపేట కార్నర్‌ మీటింగ్‌లో కెసీఆర్‌, హరీష్‌ రావులపై సిఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌
అద్దంకి..తాను వేర్వేరు కాదన్న రేవంత్‌ రెడ్డి

కాస్కో హరీష్‌రావు…నీ ఆటలు, పప్పులు ఇక సాగవ్‌.. రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ చేశావ్‌ కదా…రాసిపెట్టుకో…కొమురవెల్లి మలన్న సాక్షిగా చెబుతున్నా…పంద్రాగస్టులోగా రైతులకు 2లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా..రెండు లక్షల రూపాయల రుణ మాఫీతో రైతులకు బ్యాంకుల నుండి విముక్తి పొందితే…ఆ రోజుతో సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలకు కెసిఆర్‌, హరీష్‌ రావుల నుండి స్వాతంత్య్రం లభిస్తుందని సిఎం, టిపిసిసి చీఫ్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ ఎంపి అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌కు మద్దతుగా సిద్ధిపేట పాత బస్టాండ్‌ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికిహరీష్‌ రావు రాజీనామా చేస్తానని అన్నాడని, రైతులకు ఏక కాలంలో రుణ మాఫీ చేయడం ఖాయమని, సవాల్‌ విసిరినట్లుగానే ఆయన రాజీనామా చేస్తే సిద్ధిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తానని అన్నారు.

దేశానికి ఆగస్టులో స్వాతంత్య్రం వొచ్చిందని, రైతు రుణమాఫీతో బ్యాంకుల నుండి విముక్తి జరిగితే, హరీష్‌రావు రాజీనామాతో ఆగస్టుతోనే ఈ ప్రాంతానికి కేసీఆర్‌, హరీష్‌రావుల నుండి స్వాతంత్య్రం వొస్తుందన్నారు. దీని కోసం సిద్ధంగా ఉండాలన్నారు.  రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత తనదేనని,  రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఇదే సిద్ధిపేటలోని పాత బస్టాండ్‌ వద్ద లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని అన్నారు. పార్టీ కోసం ఎంతో మంది రక్తం ధారబోశారని, భుజాలు కాసేలా జెండాలు మోశారనీ, జైలుకు వెళ్లారని అయినా కూడా కాంగ్రెస్‌ జెండాను వదలకుండా మోయడంతోనే కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని కష్టపడ్డ ప్రతి ఒక్కరినీ గుర్తిస్తామన్నారు. గత 45ఏళ్లుగా సిద్ధిపేట మామ, అల్లుళ్లు కేసీఆర్‌, హరీష్‌రావు శనిలా ప్రజలను పట్టి పీడిస్తున్నారని మండిపడ్డారు. ఎనుగుల్ని(కేసీఆర్‌) తినేటోడు పోయి పీనుగుల్ని(హరీష్‌రావు) తినోటోడిని సిద్ధిపేటలో తెచ్చి పెట్టాడన్నారు. ఎన్నో ఏళ్లుగా సిద్ధిపేటలో దొరల రాజ్యం, దౌర్జన్యాలు నడుస్తున్నాయనీ, బిసికి చెందిన నీలం మధుకు ఎంపిగా పోటీ చేసే అవకాశం కల్పించామని ఇప్పుడు దొరల గడీలను బద్దలు కొట్టే సమయం వొచ్చిందనీ, ఇప్పుడు దొరల గడీలను బద్దలు కొట్టకపోతే శాశ్వతంగా బానిసలుగానే ఉండాల్సి వొస్తుందన్నారు.

ప్రజలను పట్టి పీడిస్తున్న బ్రహ్మ రాక్షసి(హరీష్‌రావు)నుంచి విముక్తి చేసేందుకే సిద్ధిపేటకు వొచ్చానని చెప్పారు. ఆసిఫాబాద్‌ జన జాతరను ముగించుకుని సిద్ధిపేటకు హెలికాప్టర్‌ బయలుదేరే ముందు ఓ మిత్రుడు, మంత్రి సీతక్క ఓసారి ఆలోచన చేసి వెళ్లాలని, సిద్ధిపేటలో జనం రారని సూచించారని అయితే తాను మాత్రం సిద్ధిపేట గడ్డపై ఆనందం పంచుకోవాలని వొచ్చానని అన్నారు. ఇక్కడికి వేదిగా తరలివచ్చిన జనం చూస్తే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమని, మధు సిద్ధిపేటలో భారీ మెజారిటీ వొస్తుందన్న నమ్మకం కలిగిందని, ఈ నమ్మకంతోనే చెబుతున్నానని మెదక్‌ ఎంపిగా మధు లక్ష మెజారిటీతో గెలవడం తథ్యమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తరలివచ్చిన జనంను చూస్తుంటే ఒక్కొక్కడు కాదురా..ఒకేసారి వందమంది రండిరా అని సమాజానికి, బిఆర్‌ఎస్‌ నాయకులు సవాల్‌ విసిరారని చెప్పారు.  ఎన్నాళ్లు వీరి పెత్తనం, ఆధిపత్యం అని, ఓ సామాన్యుడికి ఎంపిగా పోటీ చేసే అవకాశమిచ్చామన్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఎవడు..ఎక్కడి నుండి వొచ్చాడు..ఈ ప్రాంతానికి ఏమైనా సంబంధామా..ఏమైనా చేశాడా..అంటూ ప్రశ్నించారు.

కలెక్టర్‌గా ప్రాజెక్టుల నిర్మాణాల పేరిట వేలాది ఎకరాల ఎకరాల భూములను బలవంతంగా గుంజుకున్నాడనీ, పేదల భూములను ప్రాజెక్టులలో పాతన వేసినవాడు కాదా.. బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థికి ఏం చూసి టికెట్‌ ఇచ్చారని రేవంత్‌ నిలదీశారు. నగదును చూసే కదా ఎంపి టికెట్‌ ఇచ్చిందన్నారు. అక్రమంగా కేసులు పెట్టి బలవంతంగా ఇండ్లను ఖాళీ చేయించి, బలవంతంగా భూములను గుంజుకున్నోడు బిఆర్‌ఎస్‌ అభ్యర్థి అని, అటువంటి అభ్యర్థిని గెలిపిస్తే విర్రవీగుతాడనీ, తలమీద కాలుపెట్టి తొక్కరా..అంటూ అడిగారు. నీలం మధుకు ధనం ఉందని, వారసత్వంగా టికెట్‌ ఇవ్వలేదన్నారు. 1980లో ఇందిరాగాంధీని గెలిపించి ప్రధానిని చేసిన చరిత్ర మెదక్‌దని, ఇందిరమ్మ మెదక్‌కు అనేక పరిశ్రమలు తీసుకువొచ్చిందని, మంచికి మారు పేరు మెదక్‌ ప్రజలు.. అనేక రాష్ట్రాల నుంచి వొచ్చిన వారికి ఇక్కడి వారు ఆశ్రయం ఇచ్చారన్నారు. ప్రజల కష్టాల్లో అండగా ఉండే మధు కావాలా..భూములను బలవంతంగా గుంజుకున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి కావాలా…ప్రజలు ఆలోచించాలన్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన నీలం మధు రూపంలో దొరల గడీలను బద్దలు కొట్టే అవకాశమొచ్చందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి తప్పకుంగా గుర్తింపు ఉంటుందనీ, పార్టీ సీనియర్‌ నాయకుడు అద్దంకి దయాకర్‌ తాను వేర్వేరు కాదనీ, తన పనిని ఆయనే సగం చేస్తాడన్నారు. అద్దంకి తప్పకుండా మంచి పదవీని ఇస్తామనీ, కష్టపడ్డ వారి త్యాగానికి తప్పకుండా గుర్తిస్తానని సిఎం అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రానికి సోనియా గాంధీ బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్‌కు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరి, యూనివర్సిటీలు, ఐటిఆర్‌, ఐఐటి, ఐఐఎం ఇస్తే బిజెపి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాడని సిఎం రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రిపై తనదైనశైలిలో విమర్శలు చేశారు. వొచ్చిన వంద రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశ్న్నామని, తెలంగాణకు వొచ్చి ప్రధాని మోదీ తనను తిట్టిపోయాడని, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని, తెలంగాణకు ఏమీ ఇవ్వని బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. ఈ మీటింగ్‌లో మంత్రి కొండా సురేఖ, టిజేఏసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఎంపి అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌, కాంగ్రెస్‌ ఇంఛార్జి పూజల హరికృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ కార్నర్‌ మీటింగ్‌లో  డిసిసిబి ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జగ్గారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, కాట శ్రీనివాస్‌గౌడ్‌,  సిద్దిపేట ఇంఛార్జి పూజల హరికృష్ణ, ఏఐసిసి నాయకుడు సురేష్‌,  నాయకులు అద్దంకి దయాకర్‌,  తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, గంప మహేందర్‌రావు, దేవులపల్లి యాదగిరి, దరిపల్లి చంద్రం, గూడూరు శ్రీనివాస్‌, చక్రధర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కార్నర్‌ మీటింగ్‌కు ముందు కొత్త బస్టాండ్‌ మీదుగా పాత బస్టాండ్‌ వరకు రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెలిప్యాడ్‌ వద్ద సిఎం రేవంత్‌కు ఘన స్వాగతం…
అసిఫాబాద్‌లో నిర్వహించిన జన జాతరకు హాజరైన సిఎం, టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి అక్కడి నుండి నేరుగా హెలికాప్టర్‌లో సిద్ధిపేటకు వొచ్చాడు. సిద్ధిపేట కలెక్టర్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగిన సిఎం రేవంత్‌రెడ్డికి జిల్లా ఇంఛార్జి మంత్రి కొండా సుర్నే, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపి అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌, డిసిసిబి ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌, పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, గంప మహేందర్‌రావు, గూడూరు శ్రీనివాస్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి రేవంత్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.