కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ వేశారు. అలాగే తిరువనంత పురం నుంచి కాంగ్రెస్ ప్రస్తుత ఎంపి శశిథరూర్ కూడా నామినేషన్ వేశారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ సందర్భంగా ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు. వయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా అన్నే రాజా, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. అంతకుముందు వయనాడ్లో రాహుల్ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగేంత వరకూ తాను, ‘ఇండియా’ కూటమి సభ్యులంతా అవిశ్రాంత పోరాటం సాగిస్తామని రాహుల్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. భరతమాత వాణిని అణిచివేసే విద్వేష, అవినీతి, అన్యాయ శక్తులపై జరుపుతున్న పోరాటం ఈ ఎన్నికలని అన్నారు. నామినేషన్ వేయడానికి ముందు వయనాడ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిపే పోరాటం ఈ ఎన్నికలని అన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై, రాజ్యాంగంపై దాడి జరుపుతున్న శక్తులెవరో ప్రజలందరికీ తెలుసునని బీజేపీపై విమర్శలు గుప్పించారు. హ్యూమన్-యానిమల్ కాన్ప్లిక్ట్తో సహా వయనాడ్ ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, వయనాడ్ సమస్యలను ఇప్పటికే దేశం, ప్రపంచం దృష్టికి తెచ్చానని అన్నారు. మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని, సీఎంకు లేఖలు సైతం రాశానని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ సమస్య అక్కడ్నించి ముందుకు కదలలేదన్నారు. అటు దిల్లీ, ఇటు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడితే అన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయని సూచించారు.