A place where you need to follow for what happening in world cup

ద్రోహులెవరు?

  • అగ్రనేతలే టార్గెట్ గా కోవర్టు ఆపరేషన్
  • పక్కా సమాచారంతోనే నంబాల ఆచూకీ
  • ఇంటి దొంగల కోసం వేట

వరుస ఎన్ కౌంటర్లతో విలవిల్లాడుతున్న మావోయిస్టు పార్టీ వీటి వెనుక ఉన్న వ్యక్తులను కనిపెట్టే పనిలో పడిందా? పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు అగ్రనేతల సమాచారాన్ని పోలీసులకు చేర వేసిన ద్రోహులు ఎవరో పార్టీకి తెలిసిపోయిందా? ఇంటి దొంగల పనిపట్టే పనిలో మావోయిస్టులు బిజీగా ఉన్నారా? కోవర్టుల విషయంలో ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తారా? వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ..

 

దట్టమైన అడవుల మధ్య ఉంటూ పటిష్ఠమైన సమాచార వ్యవస్థ కలిగి మూడెంచెల భద్రత కలిగిన మావోయిస్టు అగ్రనేతలను కనిపెట్టడం అంత సులువైన పనికాదు. దండకారణ్యంలో చెట్టూ, పుట్ట, వాగూ వంక తెలిసి ఆదివాసీల రక్షణ కవచంలో నాలుగున్నర దశాబ్దాలుగా విప్లవోద్యమం నడుపుతున్న అగ్రనేతలు ఒకరికొకరుగా నేలకొరిగిపోవడాన్ని కేవలం భద్రతా బలగాల విజయంగా చెప్పలేము. అంతర్గత శత్రువుల సహకారం లేకుండా ఇది జరిగే పని కాదని ఎవరైనా ఊహించగలుగుతారు.

మరి ఈ వెన్నుపోటు దారులను పార్టీ గుర్తించిందా అనేది ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ. పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్ కౌంటర్లో చనిపోవడం ఇదే మొదటి సారి. మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించక ముందు ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య అనారోగ్య కారణాలతో 30 ఏండ్ల క్రితమే లొంగిపోయారు. ఆ తర్వాత దాదాపు 24 సంవత్సరాలు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి పనిచేశారు. అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగి ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉంటున్నారు.

గణపతి స్థానంలో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ 2017 లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ ఛార్జి గానూ, పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ పనిచేసిన నంబాల గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన వారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థులను దెబ్బతీయడానికి అంబుష్ వేయడంలోనూ, చాక చక్యంగా తప్పించు కోవడంలోనూ దిట్టగా పార్టీ నేతలే అంటారు.

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శికి 100 కి పైగా అంగరక్షకులు ఉంటారు. మూడంచెల భద్రాతా వ్యవస్థ ఉంటుంది. పది కిలోమీటర్ల దూరం నుంచే పహారా ఉంటుంది. మూడు వైపుల నుంచీ శత్రువు చుట్టుముట్టినా తప్పించుకునే ఏర్పాటు ఉంటుంది. అగ్రనేత ఉంటున్న ప్రదేశం గురించి స్పష్టమైన సమాచారం ఉంటే తప్ప అక్కడికి చేరుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నంబాల ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందరూ ఊహించిన విధంగానే ఇది కోవర్టు ఆపరేషన్ అనే విషయం మావోయిస్టు పార్టీ కూడా నిర్ధారించింది. అగ్రనేతల ఆచూకీ కూడా పార్టీలో అందరికీ తెలియదు. పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ నేతలతో పాటూ వ్యక్తిగత కొరియర్లకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది.వీరిలో ఎవరో కోవర్టులుగా మారి పోలీసు బలగాలకు సమాచారం అందించారని స్పష్టమవుతోంది. ఈ ఆపరేషన్ ఒక్క రోజులో జరిగేది కూడా కాదు. చాలా కాలంగా పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగిన అంతర్గత శత్రువులు చేసిన పనిగా తెలుస్తోంది. ఇన్ఫార్మర్లను వెతికే పనిలో పార్టీ నేతలు నిమగ్నమై ఉన్నారు. నంబాల ఎన్ కౌంటర్ తో సంబంధం ఉందని భావిస్తున్న నారాయణపూర్ జిల్లాలో ఇద్దరు ఇన్ఫార్మర్లను ఇటీవల మావోయిస్టులు హత్య చేశారు.

తెలంగాణకి చెందిన మరో కేంద్ర కమిటి సభ్యుడు గాజర్ల రవి ఎన్ కౌంటర్ కూడా పక్కా సమాచారంతోనే జరిగినట్లు పార్టీ భావిస్తున్నది. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య అరుణ కూడా మృతి చెందారు. చలపతి ఎన్ కౌంటర్ సందర్భంగా లభించిన సమాచారం మేరకే గాజర్ల రవి కదలికలను కనిపెట్టినట్లు మావోయిస్టు పార్టీ నేతలు భావిస్తున్నారు. గాజర్ల రవి లొంగి పోవడానికి వచ్చిన సందర్భంలో ఈ సంఘటన జరిగిందని మీడియా కథనాలు వచ్చినప్పటికీ వీటిని పార్టీ ధృవీకరించలేదు. గాజర్ల రవి సమాచారాన్ని పోలీసులకు అందచేసిన వారి ఆచూకీ కోసం మావోయిస్టులు అన్వేషిస్తున్నట్లు సమాచారం.

మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగిన మడివి హిడ్మాను కూడా పోలీసు ఇన్ఫార్మర్లు వెంబడిస్తున్నారు. ఆదివాసీ నేత కావడం, పటిష్ఠమైన సమాచార వ్యవస్థ కలిగి ఉండడం వంటి కారణాలతో హిడ్మా ప్రత్యర్థుల ఎత్తులను ఎప్పటికప్పడు తిప్పి కొడుతున్నాడు. హిడ్మాకు బంధువైన మాజీ మావోయిస్టు మడకం భీమా ను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ లో చేర్చుకుని గాలింపు చర్యలకు పోలీసు అధికారులు వినియోగిస్తున్నారు. హిడ్మా కదలికలు, ఎత్తుగడలు భీమాకు పూర్తిగా తెలియడంతో హిడ్మా ఆచూకీ త్వరలో తెలుస్తుందనే ధీమాతో పోలీసు అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

మావోయిస్టు పార్టీలోనే ఉంటూ ద్రోహులగా మారిన వ్యక్తుల చరిత్ర ఈనాటిది కాదు. పోలీసుల వ్యూహంలో చిక్కి కోవర్టులుగా మారి కీలక వ్యక్తుల సమాచారాన్ని అందించడం మూడు దశాబ్దాల క్రితమే మొదలయ్యింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి నల్లా ఆదిరెడ్డితో పాటు పార్టీ నేతలు ఎర్రం సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ ల ఎన్ కౌంటర్ అప్పట్లో సంచలనం సృష్టించింది. 1999 డిసెంబర్ 2 న అప్పటి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం లోని కొయ్యూరు వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో వీరు ముగ్గురూ మృతి చెందినట్లు పోలీసుల కథనం. కానీ బెంగుళూరు నుంచి వారిని తీసుకువచ్చి కొయ్యూరు లో చంపినట్లు పార్టీ ప్రకటించింది. బెంగుళూరు లో డెన్ కీపర్ గా పనిచేసిన గోవిందరెడ్డి కోవర్టుగా మారి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన ఆధారంగా ‘ద్రోహి’ సినిమా కూడా వచ్చింది. కోవర్టులుగా మారిన జడల నాగరాజు, కత్తుల సమ్మయ్య, నయీం వంటి వారు పార్టీకి ఎంతో నష్టం చేశారు. వీరు పోలీసులతో దోస్తీ కట్టి సెటిల్మెంట్లకు పాల్పడ్డారు.

పార్టీలోని అంతర్గత కలహాలతో కూడా కోవర్టులు పెరిగాయనే వాదన వినిపిస్తున్నది. పార్టీలో తెలుగు రాష్ట్రాల నేతల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేని చత్తీస్ గఢ్ నేతలు కొందరు ప్లీనరీ సమావేశాల్లో విమర్శించడంతో అసమ్మతి నేతల వ్యవహార శైలిపై పార్టీ దృస్టి సారించింది. మడివి హిడ్మా కూడా వీరిలో ఒకరు. పార్టీకి తెలియకుండా కొన్ని పనులు చేయడం, సమిష్ఠి నిర్ణయాలతో ముందుకు పోకుండా వ్యక్తిగత హీరోయిజం ప్రదర్శించడం కూడా చర్చకు దారితీసింది. ఫలితంగా హిడ్మా అనుచరుల కదలికలపై పార్టీ నాయకత్వం నిఘా పెట్టినట్లు తెలిసింది.

అసలు కోవర్టులంటే ఎవరు? ఒక శిభిరంలో పనిచేస్తూ ప్రత్యర్థి శిభిరానికి సమాచారం అందించడం లేదా సహకరించడం చేసే వారిని కోవర్టులంటారు. కమ్యూనిస్టుల పదజాలంలో చెప్పాలంటే వీరు విప్లవ ద్రోహులు. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి వారు ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచీ అనేక దేశాల్లో ఇటువంటి ద్రోహులు కీలక పాత్ర పోషించారు. వెన్నుపోటు దారులను, విప్లవ ప్రతీఘాత శక్తులని రెనగేడ్లు అని అంటారు.

Leave A Reply

Your email address will not be published.