A place where you need to follow for what happening in world cup

ఒక్క మండలం..32 ఇసుక రీచ్ లు…

Sustainable Sand Mining Rules

  • సర్వే చేయించుకున్న దళారులు
  • మార్గదర్శకాలకు తిలోదకాలు
  • అనుమతులు రాకుండానే అమ్మకాలు
  • ములుగు జిల్లాలో మాఫియా స్వైర విహారం

అది మారుమూల ఏజెన్సీ మండలం. రోజూ పదుల సంఖ్యలో హైదరాబాద్, ఇతర నగరాల నుంచి కార్లు వస్తుంటాయి. ఇక్కడ ఏమి జరుగుతున్నదో స్థానిక ఆదివాసీలకు అర్థం కాదు. రూ. కోట్లలో బేరసారాలు జరుగుతుంటాయి. సాయంత్రానికి నోట్లు చేతులు మారుతుంటాయి. ఆరా తీస్తే ఇసుక రీచ్ ల వ్యవహారమని తెలుస్తుంది. ఇసుక మాఫియాకు అడ్డాగా మారిన ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో నెలకొన్న పరిస్థితి ఇది. ఇంకా అనుమతులు కూడా రాని ఇసుక రీచ్ లను ముందుగానే అమ్మకాలు కొనసాగిస్తున్న దళారుల ఆగడాలకు కొందరు అవినీతి పరులైన అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి.

చిన్న మండలంలో 32 ఇసుక రీచ్ ల కోసం సర్వే చేయడం ద్వారా కొత్త రికార్డుకు వారు తెరలేపారు. వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే ఇసుక రీచ్ ల కోసం దళారులు చేసే ముందస్తు హడావుడి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. ఏజెన్సీ ప్రాంతంలో ‘పీసా’చట్టం అమల్లో ఉండడంతో ఇసుక రీచ్ లను ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయిస్తున్నది. వీటి నిర్వహణ మాత్రం బినామీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నది. అందుకే ఈ రీచ్ లను దక్కించు కోవడానికి కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు.

తమకు ఇసుక రీచ్ కావాలంటూ ఆదివాసులతో దరఖాస్తు పెట్టిస్తున్న దళారులు అధికారులపై ఒత్తిడి తెచ్చి
సర్వే చేయించుకుంటున్నారు. ఇరిగేషన్, రెవిన్యూ, భూగర్భ జలాలు, సహకార శాఖల అధికారులకు లంచాలు ఇచ్చి తమకు కావలసిన చోట రీచ్ లు మంజూరయ్యే విధంగా పనులు చక్కబెడుతున్నారు. ఒక్కొక్క రీచ్ కోసం రూ. 5 లక్షల వరకూ ఖర్చు పెట్టి అనుమతులు వచ్చే విధంగా చూసుకుంటున్నారు. అనుమతులు వచ్చిన తర్వాత వీటిని రూ. 30 నుంచి 50 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు.

వెంకటాపురం పైనే ఎందుకు మోజు?

గోదావరి తీరంలోని వెంకటాపురం మండలం పైనే ఇసుక మాఫియా మక్కువ చూపడం వెనుక ఆసక్తి కరమైన అంశాలున్నాయి. ఇసుక మేటలు అధికంగా ఉండే భద్రాద్రి జిల్లాలోని మణుగూరు, పినపాక, చర్ల మండలాలు పూర్తిగానూ, దుమ్ముగూడెం మండలంలోని సగం ప్రాంతం సీతారామప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఉండటంతో అక్కడ వచ్చే సంవత్సరం ఇసుక రీచ్ లకు అనుమతులు వచ్చేఅవకాశం లేదు. ములుగు జిల్లాలో గోదావరి తీర ప్రాంతంలో ఉన్న కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వాజేడు మండలాలు పూర్తిగాను, మంగపేటలోని మూడవ వంతు ప్రాంతం ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉండడంతో అక్కడ కూడా ఇసుక రీచ్ లు మంజూరు చేసే అవకాశం లేదు.

వెంకటాపురం మండలంలో కూడా పాలెం వాగు వరకూ ఈఎస్ జడ్ పరిథిలోనే ఉన్నది. కేవలం పాత్రాపురం నుంచి ఏకన్నగూడెం వరకూ గలం కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతంలో ఇసుక రీచ్ లను మంజూరు చేసే అవకాశం ఉన్నది. ఫలితంగా అందరి దృష్టీ ఈ ప్రాంతంపై పడింది. దళారులు, రాజకీయ నేతల ఒత్తిడితో వెంకటాపురం మండలంలో గత రెండు నెలలుగా ఇసుక రీచ్ ల సర్వే ప్రహసనం కొనసాగుతున్నది. గత సంవత్సరం మంజూరై ఈ సంవత్సరం వరకూ ఇసుక రీచ్ లు నడిచిన పంచాయితీల పరిథిలోనే మళ్ళీ పెద్ద సంఖ్యలో ఇసుక రీచ్ లను సర్వే చేయడం విశేషం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక్క వెంకటాపురం మండలంలోనే 32 ఇసుక రీచ్ ల కోసం సర్వే పూర్తి చేసి అనుమతుల ప్రక్రియను జిల్లా యంత్రాంగం కొనసాగిస్తున్నది.

ఇటీవల సర్వే చేసిన ఇసుక రీచ్ లు ..

ఎదిర గ్రామ పంచాయితీ పరిథిలోని ఏకన్నగూడెం, ఒంటి చింతలగూడెం, ఎదిర 1,2,3,4, సూరవీడు గ్రామ పంచాయితీ పరిథిలోని సూరవీడు, సూరవీడు కాలనీ, రామానుజపురం, విజయపురి కాలని, కొండాపురం 1, కొండాపురం 2, ఆలుబాక గ్రామ పంచాయితీ పరిథిలోని ఆలుబాక, బందగూడెం, రామన్నగూడెం, బోదాపురం పంచాయితీ పరిథిలోని బోదాపురం, బోదాపురం కాలనీ, మొర్రవాని గూడెం గ్రామ పంచాయితీ పరిథిలోని మొర్రవాని గూడెం, అబ్బాయిగూడెం రామచంద్రాపురం 3,4, ఇప్పగూడెం, పూజారిగూడెం, అంకన్నగూడెం 1,2, వీరభద్రవరం గ్రామపంచాయితీ పరిథిలోని వీరభద్రవరం 3,4, పాత్రాపురం గ్రామ పంచాయితీ పరిథిలోని పాలెం, నర్సిరెడ్డిగూడెం, ఉప్పేడు వీరాపురం గ్రామ పంచాయితీ పరిథిలోని కోయ బెస్తగూడెం, మంగవాయి..

మార్గదర్శకాలకు విరుద్ధంగా సర్వే…

దీపక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత ఇసుక తవ్వకాల కోసం 2016, 2020 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం Sustainable Sand Mining Rules పేరుతో మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. వీటి ప్రకారం ప్రతి జిల్లాలో ఇసుక తవ్వకాల కోసం నదుల వారీగా ప్రణాళికలు తయారు చేయాలి. ప్రతి ఏటా ఇసుక మేటలను పరిగణలోకి తీసుకుని క్లస్టర్లను గుర్తించాలి. నదులు కోతకు గురికాకుండాను. ప్రవాహ గతి మారకుండానూ జాగ్రత్తలు తీసుకోవాలి. వెంకటాపురం మండలంలో 32 రీచ్ లను సర్వే చేసిన యంత్రాంగం ఇవేమీ పట్టించకోలేదు. రాజకీయ నేతలు, దళారులు, కాంట్రాక్టర్లు కోరిన విధంగా పక్క పక్కనే పెద్ద సంఖ్యలో రీచ్ లను సిఫారసు చేశారు.

పొంచి ఉన్న వరద ముప్పు…

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాల్లో కూడా వరద ముప్పు తప్పదని ఇంజినీర్లు అంచనా వేశారు. గత సంవత్సరం వచ్చిన వరదలకే భారీ నష్టం వాటిల్లింది. లెక్కకు మించిన ఇసుక రీచ్ లను ఈ ప్రాంతంలో మంజూరు చేస్తే రహదారుల కోసం గట్లకు గండి కొడతారు. ఫలితంగా కోత పెరిగిపోయి వరద ముప్పు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఇది పర్యావరణ పెను ముప్పుగా మానే అవకాశం ఉన్నది. వెంకటాపురం, వాజేడు మండలాల్లో గోదావరి తీర ప్రాంతంలోని సారవంతమైన భూముల్లో మిర్చి వంటి వాణిజ్య పంటలకు పండిస్తారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ ఇసుక రీచ్ లను మంజూరు చేస్తే లారీల రాక పోకలతో పంటలకు తీవ్ర నష్టం కలుగే ప్రమాదం ఉన్నది. ఈ విషయంలో ఇప్పటికే మొర్రవానిగూడెం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కేవలం 15 అడుగుల రహదారి కూడా లేని ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో రీచ్ ల కోసం సర్వే చేయడం వివాదాస్పదంగా మారింది. వెంకటాపురం వాజేడు ప్రధాన రహదారి ఇసుక లారీలతో పూర్తిగా దెబ్బతింది.

దీనికి తోడు లారీల కదలికలతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వెంకటాపురం వంటి పెద్ద గ్రామం నుంచి వెళ్తున్న లారీలతో వస్తున్న, దుమ్ము ధూళితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పర్యావరణ సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా పర్యావరణ అనుమతులను ఇచ్చి పర్యావరణ కమిటీలు కొత్త వివాదాలకు తెర లేపుతున్నారు. రాజకీయ నేతలు, దళారుల ఒత్తిడితో సర్వే చేసిన ఇసుక రీచ్ లను రద్దు పరచి ప్రతి పంచాయితీకి ఒక్క రీచ్ మాత్రమే మంజూరు చేస్తే పర్యావరణ ముప్పును కొంత వరకైనా తగ్గించే అవకాశం ఉన్నది.

కొండూరి రమేష్ బాబు

Leave A Reply

Your email address will not be published.