A place where you need to follow for what happening in world cup

సీతమ్మసాగర్ గుండె కోత..

  • పూర్తి కాని బ్యారేజీకి పూడిక
  • రెండున్నర కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతులు
  • రూ. 1,500 కోట్ల ఆదాయం కోసం అడ్డదారులు
  • చక్రం తిప్పిన ఇసుక మాఫియా

శిథిల సౌథంలో కాసుల వేట..1

సీతమ్మసాగర్ బ్యారేజీ ఇప్పుడు ఇసుకాసురుల కల్పతరువుగా మారింది. పర్యావరణ అనుమతులు లేకుండా గోదావరి నదిపై చేపట్టిన ఈ బ్యారేజీ నిర్మాణాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ రేండేండ్ల క్రితం నిలిపివేసింది. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు లక్షల ఎకరాలకు సాగునీరందించలేని పరిస్థితి ఏర్పడింది. చట్టపరమైన అనుమతులను తీసుకుని త్వరిత గతిన బ్యారేజీ పనులను పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకుండా తాత్సారం చేస్తున్నది. సందట్లో సడేమియా అన్నట్లుగా కొందరు ఉన్నతాధికారులు బ్యారేజీ వెనుక భాగంలో భారీగా ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. ముఖ్యమంత్రి అనుమతితోనే ఇదంతా చేసినట్లు వివిధ శాఖల అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇసుక ద్వారా రాష్ట్ర ఖజానా నింపుతానని ఒక అధికారి చేస్తున్న హడావుడిలో భాగంగానే ఇదంతా జరుగుతోంది.

గోదావరి నదిపై ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే పర్యావరణ అనుమతులు తీసుకోవాలనే నిబంధన ఉంది. పర్యావరణ అనుమతులు తీసుకోవడానికి కనీసం ఆరు నెలల కాలం పడుతోంది. అంతే కాకుండా పర్యావరణ అనుమతులు తీసుకుంటే గోదావరి నదిపై భారీ యంత్రాలు వినియోగించకుండా మాన్యువల్ గా ఇసుక తవ్వకాలు చేపట్టవలసి ఉంటుంది. ఇదంతా చేసే ఓపిక రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ప్రాజెక్టుల్లో పూడిక తీస్తే పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పూడిక పేరుతో గోదావరిపై భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల కింద పూడిక పేరుతో కోట్లాది రూపాయల విలువ చేసే ఇసుక తవ్వకాలను చేపట్టి అస్మదీయులకు కాంట్రాక్టు పనులను అప్పగించింది.పర్యావరణ, జీవన విధ్వంసానికి పాల్పడి విమర్శల పాలయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుని అప్రతిష్ఠ కొని తెచ్చుకుంటున్నది.

అన్నారంలో విఫల యత్నం..

సాంకేతిక లోపాలతో నీరు నింపని అన్నారం బ్యారేజీ వెనుక భాగంలో గోదావరి, మానేరు నదులపై రెండున్నర కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని కొందరు అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ఎటువంటి మరమ్మత్తులు చేయకుండా గత రెండేండ్లుగా నీరు నింపక పోవడంతో రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద భారీగా ఇసుక తవ్వకాలు చేపడితే బ్యారేజీకి మరింత నష్టం కలుగుతుందని నీటిపారుదల శాఖకు చెందిన కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్ట వద్దని వారు సూచించారు. మానేరుపై ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని కొందరు రైతులు వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ఈ కారణాలతో అక్కడ ఇసుక తవ్వకాల విషయంలో ప్రభుత్వం ముందుకు అడుగులు వేయలేదు.

సీతమ్మసాగర్ కు సీన్ చైంజ్..

అన్నారంలో ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సీన్ సీతమ్మసాగర్ కు మారింది. పూడిక పేరుతో సీతమ్మసాగర్ లో ఇసుక తవ్వకాలు చేపట్టాలను ఇసుక మాఫియా ఐదేండ్లుగా చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. గతంలోనే రెండు సార్లు సర్వే చేసి మూల పడేసిన ఫైల్ కు బూజు దులిపి మళ్ళీ సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీతమ్మసాగర్ బ్యారేజీ పూర్తియితే ఏడాది పొడవునా బ్యాక్ వాటర్ ఉంటుంది. ప్రస్తుతానికి బ్యారేజీ పనులు నిలిచి పోవడం ఇసుక మాఫియాకు కలసి వచ్చింది.

ఒక రాష్ట్ర మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో సీతమ్మసాగర్ పూడిక పేరుతో ఇసుక తవ్వకాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 16 వ తేదీన ప్రొసీడింగ్ నంబర్ 4124 ద్వారా జిల్లా ఇసుక కమిటీ చైర్మన్ హోదాలో అనుమతుల నిచ్చారు. నీటి పారుదల శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి భారీగా ఇసుక తవ్వకాలకు సిఫారసు చేయించుకున్నారు. సీతమ్మసాగర్ బ్యారేజీకి ఎడమ వైపున చర్ల మండలంలో 77,36,674 క్యూబిక్ మీటర్లు, బ్యారేజీకి కుడి వైపున మణుగూరు మండలంలో 1,46,05,660 క్యూబిక్ మీటర్లు ఇసుక తవ్వకాలకు అనుమతుల నిచ్చారు. దీని కంటే ముందే చర్ల మండలంలో 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు అనుమతుల నిచ్చారు.

పూర్తి కాని బ్యారేజీకి పూడిక?

సీతమ్మసాగర్ బ్యారేజీ పూర్తి కాక ముందే అక్కడ పూడిక పేరుతో ఇసుక తవ్వకాలకు అనుమతుల నివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. గోదావరి నదికి సహజ ప్రవాహం ఉన్నప్పడు ఇసుక ఒకే ప్రదేశంలో మేటలు వేసే అవకాశం లేదు. కేవలం సాంకేతిక కారణాలతో దొడ్డి దారిలో ఇసుక తవ్వకాల కోసం పూడిక పేరును వినియోగించుకోవడాన్ని పర్యావరణ వాదులు తప్పు పడుతున్నారు. ఎటువంటి అధ్యయనం లేకుండా విచక్షణా రహితంగా ఇసుక తవ్వకాలు చేపడితే నదీ గమనంలో మార్పులు వస్తాయని, తీర ప్రాంతం కోతకు గురవుతుందని గతంలోనే భూభౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయినప్పటికీ కేవలం కాసుల వేటలో ప్రభుత్వానికి ఇవన్నీ చెవికి సోకినట్లు లేదు.

Leave A Reply

Your email address will not be published.