A place where you need to follow for what happening in world cup

తొందరపడి ముందే కూస్తున్న ఇసుక కోయిలలు..

0 28,927

  • ములుగు ఏజెన్సీలో గ్రామ సభల జాతర
  • టీఎస్ఎండీసీ పీఓ అత్యుత్సాహం
  • కలెక్టర్ కు మైనింగ్ ఏడీకి చెప్పకుండానే
  • ఐటీడీఏ పీఓకు లేఖలు
  • ఈసీలు రాకుండానే తొందర 
  • కాసుల వేటలో నలుగురు అధికారులు
  • ఇసుక కాంట్రాక్టర్ల సేవలో తరిస్తున్న వైనం
  • వానాకాలం ముందున్నా ఆగని ఆగడాలు
  • దళారుల ప్రమేయంతోనే సమావేశాలు
  • కలెక్టర్ కు ఫిర్యాదుల వెల్లువ

‘‘త్వరగా గ్రామ సభలు పూర్తి చేసి మాకు అగ్రిమెంట్ చేయిస్తే ఒక్కొక్క రీచ్ కి రూ. 50 లక్షలు ఇస్తాం.’’ స్థానిక ఇసుక దళారులకు ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లు ఇస్తున్న బంపర్ ఆఫర్. ఇది కేవలం లక్ష  క్యూబిక్ మీటర్లకు మాత్రమే. ఇదే మంచి తరుణం అనుకున్న దళారులు అవినీతి పరులైన కొందరు అధికారులను ఆశ్రయించి గ్రామసభలకు తేదీలను నిర్ణయించేశారు. ఈ తతంగమంతా నడిపించడానికి టీఎస్ఎండీసీ కి చెందిన ఒక అధికారి కేంద్ర బిందువుగా మారి పోయారు.  ములుగు ఏజెన్సీలో జరుగుతున్న ఇసుక గ్రామసభల జాతర వెనుక అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. 

రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ లో ఉన్న ములుగు జిల్లాలో ఇసుక తవ్వకాలను ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించడానికి ‘పీసా’ చట్టం ప్రకారం గ్రామసభల అనుమతి అవసరం. నిబంధలకు విరుద్ధంగా బినామీ కాంట్రాక్టర్లు రంగ ప్రవేశం చేసి సహకార సంఘాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. జిల్లాలో అత్యంత అవినీతి పరుడిగా పేరుగాంచిన ఒక అధికారి సహకారంతో తమకు అనుకూలమైన గ్రామాల్లో ఇసుక సహకార సంఘాలను నమోదు చేయించుకున్నారు. గ్రామసభలు నిర్వహించి సహకార సంఘాన్ని ఎంపిక చేస్తే ఇసుక రీచ్ లను అమ్ముకోవచ్చనే దురుద్ధేశంతో రంగంలోకి దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క వెంకటాపురం మండలంలోనే 35 ఇసుక రీచ్ లను ప్రతిపాదించడంతో కాంట్రాక్టర్లు ఈ మండలంపై కన్నేశారు. దళారులు అధికారులను పట్టుకుని భారీగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 

ఇటీవల ప్రతిపాదించిన 35 ఇసుక రీచ్ లలో దాదాపు 20 రీచ్ లకు పర్యావరణ అనుమతులు వస్తుఇన్నాయని సమాచారం అందడంతో ముందస్తు ఏర్పాట్లలో దళారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన పర్యావరణ కమిటీల సమావేశంలో కొన్ని ఇసుక రీచ్ లకు పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి ఆమోదం లభించింది. వెబ్ సైట్ లో ఈ సమాచారం చూసిన దళారులు వెంటనే ఒక అధికారి వద్దకు వెళ్ళి గ్రామసభలు నిర్వహించాలని కోరారు. ఇతర శాఖ నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన ఆ అధికారి సంబంధిత మైనింగ్ శాఖ అధికారిని సంప్రదించ కుండా 18 ఇసుక రీచ్ లకు గ్రామసభలు నిర్వహించాలని ఐటీడీఏ పీఓ కు లేఖ రాశారు. గ్రామసభల నిర్వహణ కోసం అంతకు ముందు అనుసరిస్తున్న పద్ధతికి విరుద్ధంగా కొందరు అధికారులు వ్యవహరించారు. 

గ్రామ సభలు ఎప్పుడు నిర్వహించాలి?

ఇసుక రీచ్ లకు పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి ఉత్తర్వులను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి టీఎస్ఎండీసీ కేంద్ర కార్యాలయానికి తెలియచేస్తారు. ఈ వివరాలను టీఎస్ఎండీసీ అధికారులు సంబంధిత మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కు పంపుతారు. ఇసుక జీవో 38 ప్రకారం ప్రభుత్వం తరపున మైనింగ్ శాఖ ఏడీ ప్రతి ఇసుక రీచ్ ని టీఎస్ఎండీసికి కేటాయిస్తూ అగ్రిమెంట్లు చేస్తారు. జిల్లా ఇసుక కమిటీ మెంబర్ సెక్రటరీగానూ కన్వీనర్ గానూ కూడా ఏడీనే వ్యవహరిస్తారు. టీఎస్ఎండీసీ తో అగ్రిమెంట్లు పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సంస్థ పీఓ పాత్ర మొదలవుతుంది. జిల్లా ఇసుక కమిటీ చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ తో సంప్రదించిన తర్వాత లేదా జిల్లా ఇసుక కమిటీలో చర్చించిన తర్వాత గ్రామసభలు నిర్వహించడానికి మైనింగ్ శాఖ ఏడీ ఐటీడీఏ కు లేఖ రాస్తారు. గతంలో ఇదే విధంగా జరిగేది. గత నెల రోజులుగా ఈ ప్రొసీజర్ ను పక్కన పెట్టి అవినీతి పరులైన నలుగురు అధికారులు కలెక్టర్ కు తెలియకుండానే గ్రామసభల హడావుడి మొదలు పెట్టారు.  టీఎస్ఎండీసీ అధికారి, ఐటీడీఏకు చెందిన ముగ్గురు, మండల అధికారి, ఒక జిల్లా అధికారి కలిసి గ్రామసభల పేరుతో భారీ అవినీతికి తెర లేపారు. గ్రామ సభల ప్రక్రియ పూర్తి చేయడానికి వీరంతా కలిసి ఒక్కొక్క రీచ్ కి రూ. 5 లక్షలు వసూలు చేస్తున్నారు.  ఇటీవల ప్రతిపాదించిన కొత్త రీచ్ లను వర్షాకాల తర్వాతే ప్రారంభించడానికి అనుమతిస్తారు. అయినప్పటికీ నాలుగు నెలల ముందుగానే గ్రామసభల పేరుతో రచ్చ చేయడం వెనుక దళారులు కాంట్రాక్టర్ల స్వార్థంతో పాటు అధికారులు లంచగొండి వ్యవహారమే ప్రధాన కారణమని తెలుస్తున్నది. గ్రామసభల వ్యవహారంపై తుడుందెబ్బ నాయకులు కలెక్టర్ కు, ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. మరో వైపు గ్రామసభలకు తేదీలు కూడా ఇవ్వడంతో ఆదివాసీ గ్రామల్లో అలజడి ప్రారంభమైంది. సాధారణ ఎన్నకలను మించిన వాతావరణం నెలకొని ఉంది. కొన్ని రీచ్ ల కోసం ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు పోటీ పడడమే దీనికి కారణం. 

Leave A Reply

Your email address will not be published.