- ఇసుక మాఫియాకు అధికారుల వత్తాసు
- రాజకీయ ఒత్తిడులతో సైలెంట్
- విమర్శల పాలవుతున్న భద్రాద్రి ములుగు జిల్లాల కలెక్టర్లు
- ఇసుక తవ్వకాలకు భారీ యంత్రాలు
- పర్యావరణ నిబంధనలు బేఖాతర్
చట్టాలను పరిరక్షించడం, కోర్టు తీర్పులకు అనుగుణంగా వ్యవహరించడం ఐఏఎస్ అధికారుల కర్తవ్యం. కానీ రాష్ట్రంలోని ఇద్దరు కలెక్టర్ల తీరు విమర్శలకు తావిస్తోంది. అటు ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిథిలోని కంచె గచ్చిభూముల వ్యవహారంలో పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన ఐఏఎస్ అధికారులకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా అది మిగిలిన అధికారుల చెవికి సోకినట్లు లేదు.
పర్యావరణ అనుమతుల నిబంధనలకు విరుద్ధంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ఇసుక రీచ్ లలో కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేపట్టినా వారికి అనుకూలంగా జిల్లా కలెక్టర్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇసుక తవ్వకాలు, రవాణాలో పారదర్శకత పాటించాలని, ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖ నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అనేక మార్లు హెచ్చరించినా అధికారుల తీరులో మార్పు రాక పోవడం విశేషం.

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ఇసుక రీచ్ లను గిరిజన సహకార సంఘాల ద్వారా రాష్ట్ర ఖనిజాభివృద్థి సంస్థ నిర్వహిస్తోంది. గిరిజన సహకార సంఘాలకు కేటాయించిన ఇసుక రీచ్ లలో బినామీ కాంట్రాక్టర్లు అక్రమంగా ప్రవేశించి ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలకు తెరలేపారు. పర్యావరణ అనుమతుల్లోని నిబంధనల ప్రకారం గోదావరి నదిపై ఇసుక తవ్వకాలను మనుషుల ద్వారా చేపట్టి, స్టాక్ యార్డుల వరకూ ట్రాక్టర్ల ద్వారా రవాణా చేయాలి.
ఈ నిబంధనకు విరుద్ధంగా భారీ జేసీబీలు, టిప్పర్లను వినియోగిస్తూ కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. ఆదివాసీలు భారీగా ఆదాయం కోల్పోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోనూ, ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, మంగపేట మండలాల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు రవాణా జరుగుతున్నాయి. గతంలో కొంత మంది కాంట్రాక్టర్లు అర్థ రాత్రి వేళల్లో అక్రమ రవాణా చేసేవారు. కానీ ఇప్పుడు పట్ట పగలే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఫిర్యాదులపై స్పందించని కలెక్టర్లు..
జిల్లా ఇసుక కమిటీలకు చైర్మన్ లుగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్లు నిబంధనల ప్రకారం రీచ్ లు నిర్వహించేలా చూడాలి. అయినప్పటికీ ఇసుక వ్యవహారాలను పర్యవేక్షించకుండా మౌనం వహిస్తున్నారు. ఆదివాసీ సంఘాలు, పర్యావరణ వేత్తలు ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మీడియాలో కథనాలకు కూడా స్పందించడం లేదు. కలెక్టర్ల మౌనం వెనుక ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేల రాజకీయ ఒత్తిడి కారణమని తెలుస్తున్నది.

రీచ్ లను నిర్వహిస్తున్న టీజీఎండీసీ అధికారులు, సిబ్బందికి కాంట్రాక్టర్లు భారీగా ముడుపులు చెల్లిస్తున్నారని తెలుస్తున్నది. పట్టపగలే కాంట్రాక్టర్లు అక్రమ రవాణా చేయడానికి టీజీఎండీసీ అధికారుల ప్రోత్సాహమే కారణమని స్పష్టమవుతున్నది. రెవిన్యూ, పోలీస్, విజిలెన్స్ అధికారులకు భారీగా లంచాలిచ్చి తమ జోలికి ఎవరూ రాకుండా కాంట్రాక్టర్ల సిండికేట్ చక్రం తిప్పుతున్నది. జిల్లా కలెక్టర్లు సహా అన్ని శాఖల అధికారులు ఇసుక మాఫియాతో అంటకాగడంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల ముఖ్యమంత్రికి నివేదిక పంపినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చర్యల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.