- ఇసుక మాఫియాకు అధికారుల అండ
- కలెక్టర్ పై రాజకీయ ఒత్తిడి
- పర్యావరణ నిబంధనలు గాలికి
- భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు
- టిప్పర్లతో యథేచ్ఛగా రవాణా
- పట్టపగలే కొనసాగుతున్న దందా
- సీరియల్ పేరుతో అక్రమ వసూళ్ళు
ములుగు జిల్లాలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఎవరెన్ని అడ్డదారులు తొక్కినా తమకు సంబంధం లేదని చెప్తున్న అధికార యంత్రాంగం కేవలం ప్రభుత్వానికి ఆదాయం వస్తే చాలని అంటున్నది. మీడియా సహా నిబంధనల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టించాలని ఒక ఉన్నతాధికారి కాంట్రాక్టర్లకు బహిరంగంగా చెప్పడంతో ఆయన అండదండలు చూసుకుని వారు స్వైర విహారం చేస్తున్నారు. గోదావరికి వరదలు తగ్గడంతో కొత్త ఇసుక రీచ్ లపై కన్నేసిన అనధికారిక కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన అధికార పార్టీ నేతలు ములుగు ఏజెన్సీపై దండయాత్ర ప్రారంభించారు. కొత్త రీచ్ లను దక్కించుకోవడానికి జిల్లా కలెక్టర్ పై ఒత్తిడి పెంచారు.
వెంకటాపురం రీచ్ లలో భారీగా అక్రమాలు
గత సంవత్సరమే అనుమతులు పొందిన వెంకటాపురం మండలంలోని నాలుగు ఇసుక రీచ్ లను ఇటీవల దక్కించుకున్న బినామీ కాంట్రాక్టర్లు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ముందుగా ప్రారంభించిన రామచంద్రాపురం, అబ్బాయిగూడెం ఇసుక రీచ్ లలో నేరుగా గోదావరిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి టిప్పర్ల ద్వారా డంపింగ్ యార్డుకు ఇసుకను తరలిస్తున్నారు. పర్యావరణ అనుమతుల్లోని నిబంధనల ప్రకారం మాన్యువల్ గా ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించవలసి ఉంది.
ఈ నిబంధనను ఎప్పడు పక్కన పెట్టారు. పర్యావరణ నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు, రవాణా జరిగేటట్లు చూడాల్సిన అధికార యంత్రాంగం కంచె చేను మేసిన చందాన అక్రమార్కులకు అండగా నిలబడింది. ‘పీసా’ చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక రీచ్ లను గ్రామ సభల ద్వారా ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ సహకార సంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. ఇసుక తవ్వకాలు, డంపింగ్ సహకార సంఘాలే చేపట్టాలని, ఎటువంటి థర్డ్ పార్టీ ఒప్పందాలు చేయవద్దని నిబంధనల్లో పేర్కొంటున్నారు. అయినప్పటికీ టీజీఎండీసీ కనుసన్నల్లోనే అనధికార కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. అనధికారిక బినామీ కాంట్రాక్టర్లతోనే టీజీఎండీసీ అధికారులు సమావేశాలు నిర్వహించడం అక్రమాలకు పరాకాష్ఠగా చెప్పవచ్చు.
మంత్రి పేరుతో చెలరేగిపోతున్న మాఫియా..
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక మంత్రి పేరుతో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది. నేరుగా కాంట్రాక్టర్లు మంత్రి క్యాంపు కార్యాలయం నుంచే వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడాలంటే జిల్లా కాంగ్రెస్ నాయకుడ్ని కలవమని మంత్రి స్వయంగా చెప్పారని కాంట్రాక్టర్లు ప్రచారం చేస్తున్నారు. ఆ నాయకుడు మంత్రి తరపున ఇసుక ప్రతినిధిగా వ్యవహరిస్తూ కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
గత సంవత్సరం సాంకేతిక కారణాలతో పర్యావరణ అనమతులను తిరస్కరించిన 25 ఇసుక రీచ్ లతో పాటూ కొత్తగా సర్వే చేసిన మరో 11 ఇసుక రీచ్ ల కోసం అధికార యంత్రాంగంపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. తన అనుయాయులకు 11 ఇసుక రీచ్ లను కట్టబెట్టడానికి ఒక ఎంపీ నేరుగా కలెక్టర్ కి ఫోన్ చేశారని కాంట్రాక్టర్లే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎంపీని సంతృప్తి పరచడానికి గోదావరి వరదల సమయంలోనే పడవలపై ఇసుక రీచ్ ల సర్వే కోసం వెళ్ళిన అధికారులు అభాసు పాలయ్యారు. గత్యంతరం లేక కలెక్టర్ వాటిని రద్దు చేశారు.
లారీల వద్ద అక్రమ వసూళ్ళు..
సీరియల్ పేరుతోనూ, ఓవర్ లోడింగ్ పేరుతోనూ ఇసుక రీచ్ ల వద్ద బినామీ కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారు. ఓవర్ లోడింగ్ చేస్తే ఒక బకెట్ కు సీరియల్ తో కలిపి రూ. 5,600 వసూలు చేస్తుండగా ఓవర్ లోడింగ్ కు ఇష్టపడని లారీ యజమానుల వద్ద నుంచి సీరియల్ పేరుతో రూ. 3,500 వసూలు చేస్తున్నారు. అక్రమ వసూళ్ళలో టీజీఎండీసీ అధికారులు, సిబ్బందికి కాంట్రాక్టర్లు వాటా ఇస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం వారికి లెక్క చేసి డబ్బులు ఇస్తున్నారు. ఇది బహిరంగ రహస్యంగా మారింది.
కాంగ్రెస్ బ్రదర్స్ హల్ చల్..
అధికార కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా పెత్తనం చేస్తున్న వెంకటాపురం మండలంలోని అన్నదమ్ములు ఇసుక రీచ్ లను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఒక బ్రదర్ రెండు ఇసుక రీచ్ లను బినామీ కాంట్రాక్టర్లకు అమ్ముకోవడం సంచలనం కలిగించింది. గతంలో 2004 నుంచి పదేండ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టులు, పైరవీలతో చెలరేగిపోయిన బ్రదర్స్ తీవ్ర విమర్శల పాలయ్యారు. వీరి ద్వారా వెంకటాపురం ప్రాంతానికి జరిగిన మేలు లేక పోగా అనతి కాలంలోనే వారు సంపన్నులుగా మారిపోయారు.