- మైనింగ్ అధికారి వసూళ్ళ పర్వం
- డ్రైవర్ నే దళారిగా పెట్టుకున్న వైనం
- కారు డీజిల్ కి కూడా కక్కూర్తి
- తాను వస్తే పార్టీ చేయాలంటూ హుకుం
- ఇసుక కాంట్రాక్టర్ల బెంబేలు
అక్రమాలను అరికట్టి నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలు జరిగేలా చూడాల్సిన ఒక అధికారి అవినీతి పరాకాష్ఠకు చేరింది. ములుగు జిల్లాలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న
ఆ అధికారి పేరు చెప్తేనే ఇసుక కాంట్రాక్టర్లు భయభ్రాంతులవుతున్నారు. ఆయన కాలు కదిపితే కాసులు రాలాల్సిందే. ఇసుక ర్యాంపులు చూడడానికి వస్తే జేబులు నింపి పంపాల్సిందే. ఇసుక తవ్వకాలు, రవాణాలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేస్తే మైనింగ్ అధికారికి పంట పండినట్లే. గతంలో పనిచేసిన కాలంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని శాఖా పరమైన దర్యాప్తు జరుగుతుండగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన అధికారికి ములుగు జిల్లాకు కూడా అదనపు బాధ్యతలను అప్పగించారు.
రెండు జిల్లాల్లో ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా సదరు అధికారి మార్చుకున్నాడు. బాధ్యతలు స్వీకరించిన కొద్ది కాలంలోనే వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇసుక రీచ్ ల సర్వే కోసం భారీగా వసూళ్ళకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్క ఇసుక రీచ్ కి మూడు నుంచి ఐదు లక్షల వరకూ వసూలు చేశాడని ఆ శాఖకి సంబంధించిన అధికారులే బాహాటంగా చెప్తున్నారు. రెండేండ్ల కాలంలో 70 ఇసుక రీచ్ ల కోసం సర్వే చేసి భారీగా ముడుపులు తీసుకున్నాడు. జిల్లా కలెక్టర్ కి కూడా తెలియకుండా లెక్కకు మించిన ఇసుక రీచ్ లను సర్వే చేసి ఉన్నతాధికారులతో చివాట్లు తిన్నాడు. సర్వే సమయంలోనూ, అనుమతుల సమయంలోనూ తీసుకున్న ముడుపులు చాలనట్లు రీచ్ లు నడుస్తున్నప్పుడు కూడా వసూళ్ళ పర్వానికి తెర లేపాడు.

మంగపేట మండలంలోని పట్టా భూముల్లో గతంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తును నీరు కార్చడంలో ఈ అధికారి పాత్ర గురించి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
అయినప్పటికీ ప్రభుత్వం దర్యాప్తు జరిపించలేదు. ఇటీవల ములుగు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇసుక రీచ్ లు ప్రారంభించడంతో రెండవ సారి వసూళ్ళు మొదలు పెట్టాడు. మంగపేట మండలానికి చెందిన ఒక ఇసుక కాంట్రాక్టర్ ను, సొంత కారు డ్రైవర్ ను దళారులుగా పెట్టుకుని వసూళ్ళు చేస్తున్నాడు. సార్ వస్తున్నారని, పార్టీ ఏర్పాటు చేయాలని, డబ్బు సిద్ధం చేసుకోవాలని దళారుల నుంచి కాంట్రాక్టర్లకు ఫోన్ వెళ్తుంది. కొందరు కాంట్రాక్టర్లు ఫోన్ సంభాషణలను కూడా రికార్డు చేసినట్లు తెలిసింది. పరాకాష్ఠకు చేరిన అధికారి అవినీతి వ్యవహారంపై ఏసీబీ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాలతో దర్యాప్తు చేయిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కాంట్రాక్టర్లు అంటున్నారు.