- విశ్రాంత అధికారికి పునరావాసం
- సాంప్రదాయానికి విరుద్ధంగా సీఎం నిర్ణయం
- బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు
- సీఎం సీపీఆర్వో నియామకంపై సర్వత్రా చర్చ
ముఖ్యమంత్రి సీపీఆర్వో నియామకం వివాదాస్పదంగా మారింది. మే నెలాఖరులో ఉద్యోగ విరమణ చేసిన నాన్ కేడర్ అధికారి గుర్రం మల్సూర్ ను ఈ పోస్టులో నియమించడం మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి అంటే కేవలం మీడియా సంబంధాలు చూసే అధికారి మాత్రమే. సీఎం అధికారిక కార్యక్రమాలు, పర్యటనలకు సంబంధించి వార్తలను తెలుగు, ఆంగ్ల మీడియాకు అందించడమే ఆయన పని. పాలనా వ్యవహారాలపై సీఎం ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేక కథనాలను అందించడం, సీఎం ఇమేజ్ పెంచే విధంగా స్థానిక మీడియాతో అవసరమైతే జాతీయ మీడియాతో వార్తలను రాయించడం సీపీఆర్వో విధిగా చెప్పవచ్చు. అందుకే సీనియర్ పాత్రికేయుడ్ని కానీ మీడియా వ్యవహారాలు చూసే పౌర సంబంధాల శాఖ అధికారిని కానీ సీఎం సీపీఆర్వోగా నియమించే సాంప్రదాయం గతంలో ఉండేది. ఎన్టీరామారావు మినహా గత నాలుగు దశాబ్దాల కాలంలో ముఖ్యమంత్రులందరూ ఇదే సాంప్రదాయాన్నికొనసాగించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాంప్రదాయానికి స్వస్తి చెప్పి సహకార శాఖలో అదనపు రిజిస్ట్రార్ గా ఉద్యోగ విరమణ చేసిన గుర్రం మల్సూర్ ను సీపీఆర్వోగా నియమించారు.
సీనియర్ జర్నలిస్టులకే అవకాశం..
ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా సీపీఆర్వోలుగా సీనియర్ జర్నలిస్టులను ఎక్కువ సార్లు నియమించారు. 1983 లో అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావు తన సన్నిహితుడైన లెక్చరర్ రామచంద్రరావును సీపీఆర్వోగా నియమించారు. మర్రి చెన్నారెడ్డి రెండు సార్లు సీఎంగా పనిచేయగా మొదటి సారి సమాచార అధికారి బండారు పర్వతాల రావును, రెండవ సారి రాజ్ భవన్ పీఆర్వోగా పనిచేసిన వనం జ్వాలా నరసింహారావును సీపీఆర్వోలుగా నియమించారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి వద్ద సీనియర్ జర్నలిస్టు రజా హుస్సేన్, కోట్ల విజయభాస్కర రెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య వద్ద జర్నలిస్టు ఎ.చంద్రశేఖరరెడ్డి సీపీఆర్వోగా పనిచేశారు.చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో సమాచార శాఖ అధికారి విజయ్ కుమార్ సీపీఆర్వోగా పనిచేయగా కిరణ్ కుమార్ రెడ్డి వద్ద సమాచార శాఖ అధికారి సత్యారావు సీపీఆర్వోగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వద్ద రెండు సార్లు సీపీఆర్వోగా వనం జ్వాలా నరసింహారావు పనిచేశారు.
ఎవరీ మల్సూర్?
ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ గుర్రం మల్సూర్ వెటర్నరీ సైన్స్ లో పట్టభద్రుడు. సహకార శాఖలో గ్రూప్ వన్ అధికారిగా ఎంపికై వివిధ స్థాయిల్లో పనిచేశారు. మాతృశాఖలో కాకుండా ఇతర శాఖల్లోని కీలక పోస్టుల్లో పనిచేయడమే ఈయన ప్రత్యేకత. ఆయన పనిచేసిన శాఖలు, పోస్టులు చూస్తే లాబీయింగ్ లో ఎంత దిట్టనో తెలిసిపోతుంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు పనిచేసిన పోస్టులలో కూడా మల్సూర్ పనిచేశారు. నీటి పారుదల శాఖలోని ఆయకట్టు అభివృద్ధి సంస్థ కమిషనర్ గా తెలంగాణ రాక పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో మల్సూర్ ను నియమించడం అప్పట్లో సంచలనమే అని చెప్పవచ్చు. ఈ నియామకాన్ని చీఫ్ ఇంజనీర్లు కూడా వ్యతిరేకించారు. రూ. 4,444 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో నాగార్జునసాగర్ కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టినప్పడు తెలంగాణ లోని సాగర్ ఎడమ కాల్వలకు రూ. 2,222 కోట్లు కేటాయించారు. ఆయకట్టు అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో పనులు జరిగాయి. ఈ పనుల కోసమే మల్సూర్ ను కమిషనర్ గా నియమించారు. అంతకు ముందు కాడా కమిషనర్లుగా సీనియర్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు పనిచేశారు.
సహకార శాఖ అధికారికి కీలకమైన బాధ్యతలను అప్పగించడంపై అప్పట్లో అధికార వర్గాల్లో చర్చ జరిగింది. నాగార్జునసాగర్ ఆధునీకరణ పనుల కాంట్రాక్టును దక్కించుకున్న ప్రస్తుత మంత్రి పొంగులేటి సహకారంతో మల్సూర్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ పోస్టులో ఆయన కొనసాగుతుండగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ‘కాడా’ కమిషర్ గా మల్సూర్ ను కొనసాగించారు. అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వద్ద చక్రం తిప్పిన పొంగులేటి, తుమ్మల మల్సూర్ ఆ ఉద్యోగంలో కొనసాగే విధంగా చేశారు.
అంతటితో ఆగకుండా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించిన గనుల శాఖ లోని తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ ఎండీగా కూడా మల్సూర్ ను నియమించారు. ఏక కాలంలో రెండు కీలక పోస్టుల్లో ఆయన కొనసాగడం విశేషం. ఐఏఎస్ అధికారులైన ప్రవీణ్ ప్రకాష్, ఎస్ఎస్ రావత్, డీస్ లోకేష్ కుమార్, ఇలంబర్తి వంటి వారు పనిచేసిన టీజీఎండీసీలో ఎండీగా మల్సూర్ ను నియమించడం కూడా సంచలనం కలిగించింది. ఈ పోస్టులో మల్సూర్ ఎనిమిదేండ్ల కాలం పనిచేసి రికార్డు సృష్టించారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మల్సూర్ కు ఏ మాత్రం సంబంధం లేని పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా నియమించారు. సహకార శాఖకు చెందిన అధికారికి ఇన్ని కీలక పోస్టులు కట్టబెట్టడం చూస్తే ఆయనకు రాజకీయ పలుకుబడి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
కంచె చేను మేసినట్లు..
విశ్రాంత అధికారులను మళ్ళీ నియమించవద్దని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే మల్సూర్ నియామకం జరగడం చూస్తే కంచె చేనుమేసినట్లు కనిపిస్తోంది. మే నెలాఖరులోనే మల్సూర్ సహకార శాఖలో రిటైర్ అయ్యారు. పాత పలుకుబడి ఉపయోగపడిందో లేక ఇంకెవరో చక్రం తిప్పారో తెలియదు కాని కీలకమైన సీపీఆర్వో పోస్టు మల్సూర్ ను వరించింది. మీడియా మేనేజ్ మెంట్ కు మల్సూరే తగిన అధికారి అని సీఎం భావించడం వెనుక ఏమి జరిగిందో తెలుసుకోవడం ఇప్పుడు మీడియా వంతైంది.