A place where you need to follow for what happening in world cup

ఇసుక అక్రమ రవాణా వెనుక గు‘లాబీ’

  • ఎమ్మెల్యే మంత్రి ఒక ఉన్నతాధికారి పేరుతో చెలరేగిపోతున్న మాఫియా
  • చర్లలో ఆంధ్రా కాంట్రాక్టర్ల హల్ చల్
  • పర్యావరణ నిబంధనలు బేఖాతర్
  • భారీ యంత్రాలతో డంపింగ్
  • టిప్పర్లతో స్టాక్ యార్డుకు రవాణా
  • సీఎం ఆదేశాలు గాలికి

ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు వారి చెవికి సోకినట్లు లేదు. అధికారుల సాక్షిగా అక్రమ రవాణా జరుగుతున్నది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పడు చెలరేగిపోయిన ఇసుక మాఫియా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ హవా కొనసాగిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం దీనికి సాక్షీభూతంగా నిలిచింది. అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం లోని ఒక ఉన్నతాధికారి పేరు చెప్పి పట్టపగలే అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకే జిల్లా స్థాయి అధికారులకు ఎన్ని ఫిర్యాదులు అందినా వారు నోరు మెదపడం లేదని తెలుస్తోంది.

గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాగా పేరొందిన నేతలే ప్రస్తుత ప్రభుత్వంలో కూడా పెత్తనం కొనసాగించడం వెనుక అవినీతే అసలు కారణమని స్పష్టమవుతున్నది. గులాబీ పార్టీలో గెలిచిన ఒక నాయకుడు పార్టీ ఫిరాయించిన తర్వాత గులాబీ ఇసుక కాంట్రాక్టర్లంతా ఆయన పంచన చేరి భారీగా పర్సెంటేజీల ఆశ చూపించి దొడ్డి దారిన ఎనిమిది ఇసుక రీచ్ లను కైవసం చేసుకున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు కూడా గులాబీ నేత ఏర్పాటు చేసిన సిండికేట్ లో చేరి రెండు ఇసుక రీచ్ లను దక్కించుకున్నారు. వీరిలో ఒకరు బీజేపీ నాయకుడు కాగా మరొకరు సినీ నటుడు మురళీమోహన్ బంధువునని చెప్పుకుంటున్నారు. మరో ఇద్దరు కాంట్రాక్టర్లు మంత్రి పేరుతో హడావుడి చేస్తున్నారు.

షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక రీచ్ లను గిరిజన సహకార సంఘాలకు కేటాయించాలి. ఈ మేరకు తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ ఇసుక తవ్వకాలు, రవాణా, లారీల్లో లోడింగ్ పనులను గిరిజన సహకార సంఘాలకు కేటాయించింది. వారికి కేటాయించిన ఇసుక రీచ్ లను వారే నిర్వహించాలని, థర్ఢ్ పార్టీ ఒప్పందాలు చేయవద్దని కూడా టీజీఎండీసీ నిబంధనల్లో పేర్కొన్నది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా బినామీ కాంట్రాక్టర్లు రంగ ప్రవేశం చేస్తున్నారు. బినామీ కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు, టీజీఎండీసీ సహకరించడంతో వారు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు.

8 రీచ్ లో భారీగా అక్రమాలు..

చర్ల మండలంలోని గొల్లగూడెం, జీపీ పల్లి, బీఎస్ రామయ్యనగర్, వీరాపురం, గొమ్ముగూడెం, మొగళ్లపల్లి, కుదునూరు, తేగడ పంచాయితీ పరిథిలో ఇసుక రీచ్ లు మంజూరయ్యాయి. ఇసుక తవ్వకాలను మనుషులతో (మాన్యువల్) గా చేయాలని, డంపింగ్ యార్డు వరకూ ట్రాక్టర్లతో తరలించాలని పర్యావరణ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఈ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, రవాణా భారీ యంత్రాలతో చేస్తున్నారు. గతంలో రాత్రి వేళల్లో అక్రమ రవాణా చేసే వారు. ఇప్పడు పట్టపగలే తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఇసుక తవ్వకాలను భారీ యంత్రాలతో చేసకునేందుకు సచివాలయంలోని ఒక ఉన్నతాధికారి తమకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, అందువల్లే కలెక్టర్, టీజీఎండీసీ, మైనింగ్ అధికారులు తమ జోలికి రావడం లేదని బినామీ కాంట్రాక్టర్లు ప్రచారం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఆదివాసీ సంఘాలు ఫిర్యాదు చేసినా, మీడియాలో కథనాలు వచ్చినా అధికార యంత్రాంగం పట్టించుకోక పోవడం చూస్తే కాంట్రాక్టర్లు చేస్తున్న ప్రచారం నిజమేనని స్పష్టమవుతోంది.

కరకట్ట విధ్వంసం..

సీతారామ ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో వివిధ గ్రామాలను గోదావరి వరదల నుంచి రక్షించడానికి కరకట్ట నిర్మాణం జరిగింది. పర్ణశాల నుంచి సుబ్బంపేట వరకూ గల 22 కిలోమీటర్ల దూరంలో కరకట్ట నిర్మాణం జరిగింది. కరకట్టపై ఇసుక టిప్పర్లు తిరగకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఇసుక మాఫియా కట్టపై టిప్పర్లు తిప్పడమే కాక ఇసుక డంపింగ్ కూడా చేయడం చర్చనీయాంశమైంది. రూ. 400 కోట్ల వ్యయంతో నిర్మించిన కరకట్ట విధ్వంసం జరుగుతుంటే నీటిపారుదల శాఖ అధికారులు మౌనం వహించడం వెనుక అవినీతే కారణమని తెలుస్తున్నది. చర్ల ప్రాంతంలో పనిచేస్తున్న ఒక డీఈ తో పాటు భద్రాచలం కేంద్రంగా పనిచేస్తున్న నీటిపారుదల శాఖ ఉన్నతాధికారి హస్తం కూడా దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. కరకట్ట పనులు ఇంకా కొన్ని ప్రదేశాల్లో పూర్తి కాక పోవడంతో వరద ముప్పు పొంచి ఉంది. దీనికి తోడు ఇసుక కాంట్రాక్టర్ల విధ్వంసంతో కట్ట మరింత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.

Leave A Reply

Your email address will not be published.