A place where you need to follow for what happening in world cup

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా

0 34
  • స్కిల్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
  • అత్యున్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు
  • నేడు విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్
  • హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం
  • అఫిడవిట్ సమర్పించేందుకు సమయం కావాలన్న సీఐడీ తరఫు న్యాయవాది రోహత్గీ

టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఇవాళ జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

దీనిపై రోహాత్గీ స్పందిస్తూ, అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. మరోవైపు, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ, తాము మొత్తం వివరాలతో సిద్ధంగా ఉన్నామని సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు.

ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ కూడా వాదనలు వినిపించారు.

బెయిల్ కోసం వెళ్లకుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని ఏపీ సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని అన్నారు. 2018లో 17ఏ సవరణ జరిగిందని, స్కిల్ నేరం అంతకుముందే జరిగిందని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. వందల కోట్ల అవినీతి జరిగిందని రోహత్గీ పేర్కొన్నారు.

జస్టిస్ బేలా త్రివేది స్పందిస్తూ… అవినీతి సంగతి తర్వాత, ముందు 17ఏ గురించి చెప్పండి అని ప్రశ్నించారు. సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? లేక అన్ని కేసులకు వర్తిస్తుందా? అని అడిగారు. అన్ని కేసులకు వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సాల్వే బదులిచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే స్పష్టం చేశారు.

మరో న్యాయవాది మను సింఘ్వీ 17ఏ అంశంపై వాదనలు వినిపించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు సీఐడీ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయిందని మను సింఘ్వీ కోర్టుకు వివరించారు.

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని జస్టిస్ అనిరుధ్ బోస్ ఆరా తీశారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందని అడిగారు. 2021 డిసెంబరు 9న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చంద్రబాబు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. ఒకదాని వెంట ఒకటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధార్థ లూథ్రా కలుగజేసుకుంటూ, ఈ కేసులో చంద్రబాబును సుదీర్ఘకాలం జైల్లో ఉంచాలన్న కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Epaper

X