కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని రైస్ మిల్లులపై జిల్లా సివిల్ సప్లై అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు ఎట్టకేలకు తనిఖీలు మొదలు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసి కేటాయించిన ధాన్యాన్ని కేటాయించారు. అట్టి ధాన్యాన్ని మరాడించి కస్టమ్ మిల్లింగ్ రైస్( సిఎంఆర్) బియ్యంగా అందించాల్సిన మిల్లర్లు ప్రభుత్వానికి కేటాయించకుండా అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ యేడాది ఖరీఫ్ వానాకాలంకు సంబంధించిన బాయిల్డ్ బియ్యాన్ని ప్రభుత్వాన్ని కేటాయించకుండా అక్రమంగా తమిళనాడు రాష్ట్రానికి ఓ ప్రైవేట్ దళారి ద్వారా జిల్లాలోని కొందరు మిల్లర్లు అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేష్ ఆద్వర్యంలోని బృదంతో అధికారులు కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్, అల్గునూర్, సదాశివపల్లిలో గల ఆరు రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా మిల్లుల్లోని రిజిస్టర్లు, రైతులకు చెల్లించిన బ్యాంకు చెక్కులు, మీటర్ రీడింగ్ తదిరత విషయాలను పరిశీలించిన అధికారులు ఆ మిల్లుల్లో సవ్యంగా ఉన్నట్లు గుర్తించారు. సిఎంఆర్ బియ్యంలో అవకతవకలు జరగలేదని, ఇతర ప్రాంతాలకు తరలించలేదని పేర్కొన్నారు. ఆరు మిల్లులు రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసిన వడ్లను మాత్రమే ఇతర ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రైస్ మిల్లుల్లో బృందాలతో కలిసి తనిఖీలు చేపడతామని డిఎస్ వో సురేష్ తెలిపారు.