A place where you need to follow for what happening in world cup

కాంగ్రెస్ లో అంతా సీక్రెట్…

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కసరత్తులో వేగం పెంచింది. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో పూర్తి గోప్యత పాటిస్తోంది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ నివేదిక సోమవారం స్క్రీనింగ్ కమిటీ ముందుకు చేరనుంది. గాంధీభవన్‌లో ఉదయం 11 నుంచి పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ వ్యక్తిగతంగా సమావేశం అయింది. సాయంత్రం వరకు ఈ ముఖాముఖి సమావేశాలు కొనసాగాయి. కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితానే ఫైనల్. తర్వాత మంగళవారం గాంధీ భవన్‌లో పీఈసీలో లేని మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో స్క్రీనింగ్‌ కమిటీ భేటీ కానుంది. పీఈసీ, ఇతర సీనియర్ నేతల అభిప్రాయం మేరకు 6 తేదీన అభ్యర్థుల ఎంపికపై నివేదికను సిద్ధం చేస్తుంది. 7 తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాతే కాంగ్రెస్‌ తరపున అభ్యర్థుల జాబితా ప్రకటన వెలువడనుంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో ఏం జరుగుతుందో తనకు కూడా తెలియదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చెప్పడం విశేషం.

అయితే ఈసారి బీసీలకు పెద్ద పీట వేయబోతున్నామని ఆయన చెబుతున్నారు. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సభ్యులు ఆదివారం గాంధీభవన్‌లో తమ తమ అభిప్రాయాలతో అభ్యర్థుల పేర్లతో నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లకు ముందు టిక్‌ను ఉంచారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ 1006 దరఖాస్తులను పరిశీలించింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విధివిధానాలను ఈ సమావేశంలో చర్చించారు. నియోజకవర్గాల వారీగా ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో జాబితాను రెడీ చేశారు. నియోజకవర్గాల వారీగా అర్జీలను వేర్వేరుగా పరిశీలించారు. అలాగే బీసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల సంఖ్యను కూడా నియోజకవర్గాల వారీగా వేరు చేసి పరిశీలించారు. దరఖాస్తుదారుడి పేరు? ఎప్పటి నుంచి పార్టీలో ఉంటున్నారు? ఏ హోదాలో ఉన్నారు? పుట్టిన తేదీ, కులం, ఉప కులాలు వివిధ రకాల సమాచారంతో కూడిన 500పేజీల ఈ బుక్‌లెట్‌ను పీఈసీ సభ్యులకు అందజేశారు.

ఈ వివరాల ఆధారంగా ఒక్కో నియోజకవర్గానికి రెండు, లేక మూడు పేర్లు సూచిస్తూ వెయ్యి మంది నుంచి రెండు మూడు వందల మందికి కుదించి జాబితా సిద్ధం చేశారు.ఇప్పటికే 35 నుంచి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చిందని సమాచారం. మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ (పీఈసీ) ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పీఈసీ సభ్యులతో ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై ఆ సీల్డ్‌ కవర్‌ను పరిశీలిస్తుంది. వాళ్ల నుంచి ఆయా అభ్యర్థుల ఎంపికకు గల కారణాలను స్క్రీనింగ్‌ కమిటీ అడిగి తెలుసుకోనుంది. పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో బలం ఎంత ఉంది? అభ్యర్థితో పార్టీకి కలిసి వచ్చే అదనపు అంశాలపై కాంగ్రెస్ సర్వే చేయనుంది.అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీలు కార్యదర్శులు, సీనియర్‌ నాయకులు పోటీ చేయనున్న వివాదరహిత నియోజకవర్గాల్లో సింగిల్‌ నేమ్‌తో ఉండే 40కి పైగా నియోజక వర్గాల అభ్యర్థులను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్థాయిలోనే ఎంపిక అవుతారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన నియోజకవర్గాల దరఖాస్తులను మరింత లోతైన అధ్యయనం చేసి ఎంపిక చేస్తారని పేర్కొంటున్నాయి. సర్వేలతోపాటు సామాజిక, రాజకీయ పరిస్థితులు స్థానిక సమీకరణాలు ఇలా అన్ని కోణాల్లో పరిశీలన చేసి లాబీయింగ్‌కు తావు లేకుండా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నేతలు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.