- ఏజెన్సీ ఇసుక రీచ్ లను వేలం వేస్తున్న దళారి
- సీజన్ ప్రారంభం కావడంతో కాంట్రాక్టర్ల హల్ చల్
- సొసైటీ లొంగక పోతే కొత్తది నమోదు చేయిస్తా..
- నేను చెప్పిందే అధికారులు చేస్తారు..
- ఆదివాసీలను బెదిరిస్తున్న వైనం
ఏజెన్సీ ప్రాంత ఇసుక రీచ్ లపై బినామీ కాంట్రాక్టర్ల పెత్తనం కొనసాగుతున్నది. ఇసుక రీచ్ లను తానే మంజూరు చేయించానంటూ వాటిని వేలానికి పెట్టిన ఒక దళారీ కేవలం లక్ష లోపు క్యూబిక్ మీటర్ల రీచ్ ను రూ. 50 లక్షలకు వేలం వేస్తున్న వైనంపై ఆదివాసీలు సైతం విస్మయానికి గురవుతున్నారు. ఇసుక సీజన్ ప్రారంభం కావడంతో దళారీ ఆగడాలతో ఆదివాసీ గ్రామాలు అట్టుడుకుతున్నాయి. ‘పీసా’ చట్టం ప్రకారం ఆదివాసీ సహకార సంఘాలకు ఇసుక రీచ్ లను కేటాయించి చేతులు దులుపుకుంటున్న అధికార యంత్రాంగం బినామీల అగడాలను అరికట్టలేక పోతున్నది.
కొందరు అవినీతి అధికారుల ‘సహకారం’ తోనే బినామీలు రెచ్చిపోతున్నారు. ఇసుక రీచ్ మంజూరీ కోసం మైనింగ్, భూగర్భ జలాలు, రెవిన్యూ, ఐటీడీఏ, సహకార శాఖల అధికారులకు లక్షలాది రూపాయలు ముడుపుల రూపంలో చెల్లించి రీచ్ మంజూరు చేయించానని ప్రచారం చేసుకుంటున్న దళారీ రూ. 50 లక్షలకు అమ్ముతానని చెప్తున్నాడు. ఇప్పటికే ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు కాంట్రాక్టర్లను వెంకటాపురం ప్రాంతానికి తీసుకు వచ్చి ఇసుక రీచ్ లను చూపించడం, బేర సారాలకు దిగడం జరుగుతున్నది. ఇదంతా చూసి ఆదివాసీలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.
ఆరు రీచ్ లు రూ. మూడు కోట్లు…
గత సంవత్సరం వెంకటాపురం మండలంలోని సూరవీడు కాలనీ, రామానుజపురం, ఎదిర, బోదాపురం, ఆలుబాక,వీరభద్రవరం, అంకన్నగూడెం ఇసుక రీచ్ లను ఈ ప్రాంతానికి చెందిన ఒక దళారీ కోదాడ ప్రాంతానికి చెందిన మరొక దళారీతో కలసి రూ. మూడు కోట్ల రూపాయలకు అమ్ముకోవడం సంచలనం కలిగించింది. జిల్లా కేంద్రానికి చెందిన ఒక అధికార పార్టీ నాయకుడి పేరు చెప్పి కింది స్థాయి అధికారుల వద్ద పనులను చక్క దిద్దు కోవడం జరిగింది. తమకు అడ్డు తిరిగిన ఆదివాసీలను కూడా బెదిరించే స్థాయికి వీరు చేరుకోవడంతో ఒక దశలో రామానుజపురం గ్రామం వద్ద ఆదివాసీలు దేహశుద్ధి కూడా చేశారు. కోదాడ ప్రాంత దళారీ మావోయిస్టుల పేరుతో భారీగా నిధులు వసూలు చేయడంతో చివరికి వారు జారీ చేసిన హెచ్చరిక లేఖతో ఈ ప్రాంతం నుంచి పరారయ్యాడు. ఆదివాసీల మధ్య గొడవలు సృష్టించడంతో గ్రామాల్లో తీవ్ర అశాంతి నెలకొంటున్నది. తరచుగా ఆదివాసీలు పోలీసు స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు.
నిబంధలకు విరుద్ధంగా టిప్పర్లతో ఇసుక రవాణా చేయడం, ఓవర్ లోడింగ్ సీరియల్ పేరుతో ప్రతి లారీకి రూ. 5,000వసూలు చేయడం, వే బిల్లులు లేకుండా జీరో వ్యపారం చేయడం వంటి పనుల ద్వారా రూ. కోట్లు లాభం పొందవచ్చని దళారులే కాంట్రాక్టర్లకు ముందుగా చెప్పడంతో వీరి మాటలు నమ్మి రీచ్ లను భారీ మొత్తాలకు కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు గత సంవత్సరం భారీగా నష్ట పోయారు. జిల్లా కలెక్టర్ కొరడా ఝుళిపించడంతో అటు దళారులు, ఇటు బినామీలు ఖంగుతిన్నారు. అయినప్పటికీ ఈ సంవత్సరం మళ్ళీ రంగంలోకి దిగి రీచ్ లను అమ్ముతున్నారు.
వీరభద్రవరంపై కలెక్టర్ ఫోకస్ అవసరం…
దళారీ ఆగడాలకు వీరభద్రవరం గ్రామ ఆదివాసీలు తీవ్ర అలజడికి లోనవుతున్నారు. ఈ గ్రామంలో పీసా చట్టం ప్రకారం ఒకే ఆవాసం (హేబిటేషన్) ఉన్నది. 150 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తుండగా వీరిలో 98 మంది మహిళలతో ఆంజనేయ మహిళా ఇసుక సొపైటీ గతంలో నమోదైంది. 2021 సంవత్సరంలో ఒక ఇసుక రీచ్ మంజూరు కాగా అప్పటి అధ్యక్షురాలు తన మాట వినడం లేదంటూ అధికారుల సహకారంతో ఆమెను పదవీచ్యుతురాల్ని చేయించిన దళారీ కొత్త కమిటీని ఎన్నుకునే టట్లు చక్రం తిప్పాడు. ఈ రీచ్ ను రూ. 50 లక్షలకు అమ్ముకున్నాడు. అదే దళారీ ఇప్పుడు కొత్త రీచ్ ని మంజూరు చేయించానంటూ మళ్ళీ అమ్మకానికి పెట్టాడు. సొసైటీ కార్యవర్గం అడ్డం తిరగడంతో కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆంజనేయ సొసైటీలోనే సభ్యత్వం కావాలని తిరుగుతున్న కొందరు గ్రామస్తులను ములుగు తీసుకు వెళ్ళి 23 మందితో తెల్లకాగితాలపై సంతకాలు చేయించి మరొక సొసైటీని నమోదు చేయించాడు. ఒక జిల్లా అధికారికి భారీగా ముడుపులు చెల్లించానంటూ ప్రచారం మొదలు పెట్టాడు.
దళారీ ఫీజిబిలిటీ సర్టిఫీకెట్ జారీ చేయించడమే కాక కనక దుర్గ మహిళా ఇసుక క్వారీ మాక్స్ సొసైటీ పేరుతో రెండవ సంఘాన్ని నమోదు చేయించాడు. అధికారులు గ్రామానికి రాకుండా కనీసం సమావేశం కూడా పెట్టకుండా ఈ సొసైటీని నమోదు చేశారు. 1995 మాక్స్ చట్టం మరియు సొసైటీ నిబంధనావళి ప్రకారం 60 రోజల్లోగా సభ్యత్వం పూర్తి చేసి జనరల్ బాడీ ఏర్పాటు చేసి అడహాక్ కమిటీ స్థానంలో పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకోవాలసి ఉండగా ఇప్పటి వరకూ ఎటువంటి సమావేశం ఏర్పాటు చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రమోటర్లే అడ్డం తిరుగుతున్నారు. తమకు 98 మంది సభ్యులున్న ఆంజనేయ సొసైటీలో సభ్యత్వాలు ఇస్తే బోనస్ రూపంలో లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు.
నిబంధలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కొత్త సొసైటీని రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరుతున్నారు. వీరభద్రవరం గ్రామానికి చెందిన వీఆర్ఏ మరొక అక్రమానికి తెరలేపాడు. పాత సొసైటీలో సభ్యత్వం ఇప్పిస్తానంటూ మరొక 23 మందితో మూడవ సొసైటీని జూన్ నెలలో నమోదు చేయించాడు. నిబంధలకు విరుద్దంగా ఈ సొసైటీ ప్రమోటర్లలో గిరిజనేతరులు కూడా సంతకం పెట్టారు. దీనికి కూడా ఒక అధికారి సహకారం లభించింది. ముత్యాలమ్మ పేరుతో నమోదైన ఈ సొసైటీకి కూడా నిబంధనల ప్రకారం సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు. పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకోలేదు. ఈ గ్రామంలో మూడు సొసైటీలు ఉన్న విషయం ప్రమోటర్లతో సహా గ్రామస్థులకే తెలియక పోవడం విశేషం. కొన్ని సంతకాలను దళారులే ఫోర్జరీ చేశారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని బోగస్ సొసైటీలను రద్ద చేయించాలని వారు కోరుతున్నారు.
కొండూరి రమేష్ బాబు