A place where you need to follow for what happening in world cup

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

పట్టు వస్త్రాల సమర్పించిన  సీఎం దంపతులు…
ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న సీఎం దంపతులు, రాష్ట్ర పలువురు మంత్రులు…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయములో నిత్యారాధనల అనంతరము శ్రీ విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధన కార్యక్రమములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చక బృందం, పారాయణీకులు ఈ వేడుకలను అత్యంత వైభవముగా నిర్వహించారు.

ఈ వేడుకలలో సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి కుటుంబ సమేతముగా విచ్చేసి  శ్రీ స్వామి వారికి పట్టువస్త్రములు సమర్పించి బ్రహ్మోత్సవములలో మొదటి కార్యక్రమమైన స్వస్తివాచనము దీపప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమములో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దేవాదాయ, అటవీశాఖ మంత్రి  కొండాసురేఖ, రోడ్లుభవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి,  భారీనీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం,  తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, జెడ్.పి. చైర్మన్ సందీప్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె.జెండగె, దేవాదాయ శాఖ అడిషనల్ కమీషనరు కె.జ్యోతి, ఇతర రాజకీయ స్ధానిక ప్రముఖులు విచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్ధానము తరపున వేదపండితులచే చతుర్వేదములతో వేదఆశీర్వచనము నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎమ్.రామకృష్ణారావు, ఆలయ అధికారులు శ్రీ స్వామి వారి చిత్రపటమును, తీర్ధ ప్రసాదములు అందజేశారు.

స్వస్తివాచనము
బ్రహ్మోత్సవ ప్రారంభమున స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినో బృహస్పతిః దధాతు అంటూ వేదమంత్ర పఠనముతో ఆయా అధిష్ఠాన దేవతా గణములను సాదరముగా అర్చించుటే ఈ స్వస్తివాచన వేడుక. పరమాత్మ స్వరూప గుణ విభవాదులను స్వస్తివాచనములుగా మంగళ వాచకముగా, సకలలోక కళ్యాణమునకై ఈ వేడుక అత్యంత వైభవముగా నిర్వహించారు.

శ్రీ విష్వక్సేన ఆరాధన…
లోకములకు శుభములు కలగాలని, ఉత్సవములు నిర్విఘ్నముగా కొనసాగాలని, పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా వేదమంత్రములు పఠిస్తూ శ్రీ విష్వక్సేన ఆరాధన నిర్వహించెదరు. ఈ వేడుక బ్రహ్మోత్సవముల యందు నిర్వహించు ప్రతీ వేడుక నిర్విఘ్నముగా కొనసాగి లోకములకు భగవత్ అనుగ్రహము కలుగునని శాస్త్రోక్తము.

రక్షాబంధనము…
సర్వకళ్యాణ జనకం, ఆయురారోగ్య ప్రదాయకం. సకల సంపత్ కరం మొదలగు ఎన్నో ఫలితములను కలిగించు విశిష్టమైన వేడుక ఈ రక్షాబంధన వేడుక. వివిధ మంత్రములతో రక్షాబంధనములకు ఆరాధనలు గావించి వాటిని భగవానుడికి అమ్మవారికి అలంకరించి తదుపరి భక్తకోటి ధరించుట ఈ వేడుక ప్రత్యేకత. ఈ రక్షాబంధనములు ధరించిన భూత, ప్రేత, పిశాచాది బాధలు తొలగి సర్వశుభములు కలుగునని ఆర్యోక్తి. సాయంకాల కార్యక్రమములు సాయంకాలము నిత్యారాధనల అనంతరము శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలలో భాగంగా సాయంత్రం గం. 6.30 ని||లకు మృత్సంగ్రహణము, అంక కార్యక్రమములను ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, అర్చ పారాయణీకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా నిర్వహిస్తారు.

మృత్సంగ్రహణము, అంకురారోపణ ప్రత్యేకత..
బ్రహ్మోత్సవములలో ఉత్సవాభ్యుదయ సూచకంగా ఈ వేడుకని భూమాతను పూజించి, పుట్టమన్ను సేకరించడమే మృత్సంగ్రహణం.  ఈ సేకరించిన మట్టిని, తొమ్మిది పాలికలలో ఉంచి వాటిలో నవధాన్యములు పోసి అంకురార్పణ గావించి ప్రతినిత్యం నీళ్ళతో, క్షీరధారలతో వీటిని తడుపుతారు. పాలికలలో మొలకలు దేశ సస్యశ్యామలమునకు, సుభిక్షమునకు సూచకమని శాస్త్రోక్తము.

Leave A Reply

Your email address will not be published.