మళ్లీ బాలికలదే హవా
నిర్మల్ ఫస్ట్..వికారాబాద్ లాస్ట్
టెన్త్ ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో మొత్తంగా 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది. మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. టెన్త్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.05 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
సిద్ధిపేట 98.65 శాతంతో రెండో స్థానంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలురు కంటే 3.81 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇక ప్రైవేట్ విద్యార్ధుల్లో 49.73 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. వీరిలో బాలురు 47.40 శాతం, బాలికలు 54.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్‌లో కూడా బాలురు కంటే బాలికలు 6.74 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. వీటికి 5,08,385 విద్యార్థులు హాజరయ్యారు.
వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఇకపోతే టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మే 16వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్‌కు రూ. 500, రీవెరిఫికేషన్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.