A place where you need to follow for what happening in world cup

రైతుబంధు, ఆసరా పెన్షన్ దారులు ఓట్లు వేస్తే కాంగ్రెస్ గల్లంతె…

ఐటి శాఖ మంత్రి తారక రామారావు

సంక్షేమ శాఖ మంత్రి, హోం శాఖ మంత్రులతో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభం
వెల్గటూర్: రైతుబంధు తీసుకుంటున్న రైతులు, ఆసరా పెన్షన్ పొందుతున్న వారు బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ గల్లంతు అవుతుందని ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. మంగళవారం ధర్మపురిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీతో కలిసి యాభై పడకలతో నిర్మించిన “మాత శిశు” ఆసుపత్రి, పైలాన్ తో పాటుగా గ్రామంలో గల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెల్గటూర్ లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన “ప్రగతి నివేదన సభ”లో ఐటి శాఖ మంత్రి తారక రామారావు మాట్లాడుతూ అభివృద్దిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. దేశంలో లేని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని అభివర్ణించారు. వర్షాకాలంలో ధర్మపురి పట్టణంలోని పలు వార్డులు గోదావరి నీటితో మునిగిపోతున్నందున అక్కడ కరకట్టలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రాంత యువతకు వ్యవసాయ విద్యనందిస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్దికి, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు మున్సిపల్ శాఖ ద్వారా 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తలపున గోదావరి ఉన్న ఇక్కడి ప్రాంత వాసులు తాగు, సాగునీటికి చాలా ఇబ్బందులు పడే వారని అన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ధర్మపురి నియోజకవర్గానికి తాను వచ్చినప్పుడు ధర్మపురి చిన్న గ్రామంగా ఉండేదని అన్నారు. ఆ సమయంలోనే ధర్మపురిని మున్సిపాలిటీ చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ధర్మపురి గ్రామం అభివృద్ధి కోసం రూ. 247 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలే నా “బలం”, ” బలగం”, నా “ఆశ”, నా “శ్వాస” అని “నా జీవితం ప్రజల కోసమే అంకితమని” అన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో కోటి 25 లక్షల మంది భక్తులు ఇక్కడ పుణ్య స్థానాలు ఆచరించారని, ప్రస్తుతం అక్కడి పరిసర ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రముఖ దేవాలయమైన లక్ష్మీనారసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.100 కోట్లు, అక్కపెల్లి చెరువు అభివృద్ధి కోసం రూ.72 లక్షలు ఖర్చు చేసినట్లు వివరించారు.

ధర్మపురి గ్రామం మధ్యలో మురికి కుంటగా ఉన్న “చింతామణి” చెరువును సుందరమైన సరస్సుగా తీర్చిదిద్దానని తెలిపారు. తెలంగాణ రాకముందు ధర్మపురి నియోజకవర్గంలో 40 వేల ఎకరాల వ్యవసాయ భూమి సాగవడమే కష్టంగా ఉండేదని, ఇప్పుడు లక్ష 26 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పై ఆధారపడి చాలీచాలని పంటలు పండించిన మన ప్రాంత రైతులు, కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో లింక్ కెనాల్లు , వరద కాలువల ద్వారా వస్తున్న నీటితో పూర్తిస్థాయి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మపురిలో “ఐటిఐ కళాశాల, ఎస్టిఓ ఆఫీస్ ను మంజూరు చేయాలని ఐటి శాఖ మంత్రి తారక రామారావును కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట్ల వెంకటేష్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్మన్ దావ వసంత, ధర్మపురి మున్సిపల్ చైర్మెన్ సంగి సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.