వెయ్యి స్తంభాల ఆలయ మండపం పునరుద్ధరణ ఓ చాలెంజింగ్ టాస్క్
ఎన్ని సమస్యలు ఎదురైనా స్థపతులు కష్టించి పూర్తిచేశారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
వేయి స్తంభాల ఆలయంలోని కల్యాణమండపం జాతికి అంకితం
వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 8 : దేశ చరిత్రలో కాకతీయుల పాలన ఒక స్వర్ణయుగం వంటిదని, అలాంటి కాకతీయుల కళావైభవానికి వేయి స్తంభాల దేవాలయం ఓ మచ్చుతునక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ ఆలయంలోని వేయిస్తంభాల మండపాన్ని పునరుద్ధరించామని కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆలయంలో శివునికి మందిరాన్నిజాతికి అంకితం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏఎస్‌ఐ అధికారులకు చాలా పరిమితులున్నాయని ఆ కారణంగా వేయిస్తంభాల మండపం పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. ప్రాచీన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాకతీయుల పాలనలో వ్యవసాయం మొదలుకుని.. కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతివృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత నేటికీ కూడా రీసెర్చ్ టాపిక్ అని అన్నారు.1163లో కాకతీయ పాలకుడైన రుద్రదేవుడు వేయిస్తంభాల ఆలయాన్ని అద్భుతంంగా నిర్మించారని కొనియాడారు. అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు 72 ఏళ్లు పట్టిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని తెలిపారు. 1324-25లో తుగ్లక్ సైన్యం దాడిలో ఈ మందిరం కొంతమేర ధ్వంసమైందని, దీంతో పాటు ఈ మందిరంలో ఉన్న సూర్య, వాసుదేవ విగ్రహాలను తుగ్లక్ సైన్యం తీసుకెళ్లిందని చెప్పారు. మధ్యయుగ కాలంనాటి ఈ గుడి.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఇక్కడున్న మండపంలో గ్రామ సభలు, నాట్య కార్యక్రమాలు నిర్వహించుకునేవారని తెలిపారు.
132 స్తంభాలున్న కల్యాణ మండపం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు 2006లో దీన్ని కూల్చేశారని, తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు.ఈ వెయ్యిస్తంభాల గుడి.. 40 ఏళ్ల క్రితం పూర్తిగా శిథిలమైందని, ఆ తర్వాత 2006 నుంచి దీనిని పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైనా.. అది నత్త నడకన సాగిందన్నారు.వాస్తవానికి.. వేయి స్తంభాల మండపం పునరుద్ధరణ ఓ చాలెంజింగ్ టాస్క్ గా మారిందని కిషన్ రెడ్డి అన్నారు. కూలిన స్తంభాలకు మార్కింగ్ చేయడం.. వాటి డాక్యుమెంటేషన్ చేయడం.. అవి ఎక్కడెక్కడ ఉండేవో ఫొటోలు తీసుకోవడం.. పురావస్తు శాఖ కు సవాల్ గా మారిందని చెప్పారు.దీనికితోడు యూపీఏ హయాంలో.. ఏ ఎస్‌ఐకి ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం నిధులు ఇవ్వలేదని, దీంతో పనులు నిలిచిపోయాయని చెప్పారు. మోదీ పగ్గాలు చేపట్టాక ఏఎస్‌ఐకి నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆలయ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న కళాకారులను తీసుకువచ్చి డాక్యుమెంటేషన్ ఆధారంగా ఈ వేయిస్తంభాల గుడిని పునరుద్ధరణ ప్రక్రియ పూర్తిచేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. నంది విగ్రహం జీవం పోసుకున్నట్లుగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. స్థపతులు అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఈ మహత్కార్యంలో భాగస్వాములై పనిచేశారని కొనియాడారు. ధ్వంసమైన పిల్లర్ల స్థానంలో.. బ్లాక్ గ్రానైట్ తో అచ్చం పాతవాటిలా ఉండే స్తంభాలను వీరు తయారుచేశారన్నారు.
మధ్యలో ఉన్న నంది విగ్రహం కూడా విదేశీయుల దురాక్రమణలో ధ్వసంమైతే.. దాన్ని కూడా అక్కడే అందంగా పునరుద్ధరించిన స్థపతులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
2006 నుంచి 2021 వరకు 50% పనులు పూర్తయితే.. కేవలం ఈ రెండు సంవత్సరాల్లోనే మిగిలిన 50% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ మహత్కార్యంలో భాగస్వాములైనవారిని సన్మానించుకున్నామని తెలిపారు. పని దాదాపుగా పూర్తయింది.. మిగిలిన చిన్నాచితకా పనులను కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. మహాశివుని ఆశీస్సులతో భారతదేశం త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందనే విశ్వాసం తనకుందని, మోదీ నాయకత్వంలో.. భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు.. శివుని ఆశీస్సులు మనపై ఉంటాయనే నమ్మకం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో.. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రొఫెసర్ పాండురంగారావు , బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా రెడ్డి, ఏఎస్‌ఐ అధికారులు పాల్గొన్నారు.
రామప్ప ఆలయంలో పూజలు
ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కాకతీయుల కట్టడం రామప్ప దేవాలయాన్ని శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు కేంద్ర మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.
సమ్మక్క సారలమ్మ కేంద్రీయ యూనివర్సిటీ ప్రారంభం
ములుగులో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం లాంచనంగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విశ్వవిద్యాలంలో తరగతులు ప్రారంభిస్తామన్నారు. .సమ్మక్క సారక్క యూనివర్సిటికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నోడల్ గా ఉంటుందన్నారు.. మహిళ దినోత్సవ సందర్బంగా సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన వర్సిటీ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.. పూర్తి స్థాయిలో భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే యూనివర్సిటీ శాశ్వత భవన నిర్మాణం చేపడుతామన్నారు.. దీనికి ఎటువంటి నిధుల కొరత లేదన్నారు కిషన్ రెడ్డి . ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.900 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.. ఎన్నికల అనంతరం శాశ్వత భవన నిర్మాణలకు ప్రధాని మోదీ తో భూమి పూజ చేయిస్తామని చెప్పారు.