- అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి
- ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బృందం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులు వారికి అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించి పర్యటన విజయవంతం అయ్యేలా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. శనివారం నాడు సాయంత్రం భద్రాచలం మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐటీడీఏ పీవో ప్రతిక్ జైన్, ఎస్పీ రోహిత్ రాజ్ మరియు జిల్లా అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం లో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర క్యాబినెట్ మంత్రులతో కలిసి భద్రాచలం పర్యటించనున్నారని తెలిపారు.
ముందుగా సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని, మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొంటారని, తదుపరి, అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారని, తదుపరి భోజన అనంతరం, మణుగూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారనితెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేసిన హెలిపాడ్ ఏర్పాట్లు, భద్రత ఏర్పాట్లు, క్షుణ్ణంగా ఎస్పీ తనిఖీ చేయాలన్నారు. హేలిపాడ్ వద్ద అంబులెన్స్, డాక్టర్లు, ఫైర్ ఇంజన్, మొదలగు అత్యవసర ఏర్పాట్లుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ రవీంద్రనాథ్, డి ఆర్ డి ఓ విద్యాచందన, డీఎస్‌ఓ రుక్మిణి, భద్రాచలం ఆర్టీవో కే దామోదర్ రావు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు , ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్ వైద్యశాఖ ప్రోగ్రామ్ అధికారి రవిబాబు , మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.