యాదగిరి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం రేవంత్ దంపతులు
పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడి, కొండా సురేఖ
భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీ ఏర్పాట్లు
తీర్థప్రసాదాలు ఇచ్చి పండితుల వేద ఆశీర్వాదం
పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడి, కొండా సురేఖ
భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీ ఏర్పాట్లు
తీర్థప్రసాదాలు ఇచ్చి పండితుల వేద ఆశీర్వాదం
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు పూజల్లో పాల్గొన్నారు. తొలిసారిగా సీఎం హోదాలో యాదగిరిగుట్టకు వొచ్చిన రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు పూజలో పాల్గొన్న రేవంత్ రెడ్డి సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితుల వేదాశీర్వచాలు తీసుకున్నారు. వారికి వేద పండితులు ప్రత్యేక తీర్థప్రసాదాలు అందించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన తొలి రోజు వేడుకలో సీఎం రేవత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పూజల్లో పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి 11 రోజులపాటు జరుగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టకు వస్తున్న వేళ భారీగా కాంగ్రెస్ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు తోపులాట జరిగింది. కొందరు కాంగ్రెస్ నేతలను గుడి వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. పోలీసుల తీరుకు నిరసనగా వారంతా ధర్నా చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి సర్దిచెప్పడంతో వారంతా శాంతించి ఆందోళన విరమించారు. ఇక యాదగిరిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కాంగ్రెస్ సర్కారు వొచ్చిన తర్వాత జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో ఆ పార్టీ నాయకులు కూడా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తొలి రోజు స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ తో పాటు సీనియర్ మంత్రులు వేడుకల్లో పాల్గొని భద్రాచలం వెళ్లారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కొండపైన దేవస్థానం అధికారులు ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనాలను నిలిపివేసారు. కొండపైకి వచ్చే భక్తుల వాహనాలను అనుమతించలేదని స్పష్టం చేశారు. సీఎం, మంత్రుల పర్యటన తర్వాత యధావిధిగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. 11 రోజులపాటు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు 21న జరిగే శృంగార డోలోత్సవంతో ముగియనున్నాయి. ప్రధాన ఆలయ ఉద్ఘాతన తర్వాత రెండోసారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మాడ వీధుల్లో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులపాటు స్వామి వారికి నిత్య మొక్కు, కళ్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడిరచారు.
కాగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు.స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. పదివేల మంది కూర్చునేలా ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఆలయ అధికారులు సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న తిరు కళ్యాణ మహోత్సవం, 19న స్వామి వారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 13 నుంచి స్వామి వారి అలంకార సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 15 నుంచి సంగీత సాహిత్య మహాసభలు జరగ నున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులపాటు ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత మొక్కు కళ్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం వంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు.