A place where you need to follow for what happening in world cup

మరో కాంతార..
కాపాడే బెర్మే ఎవరు?

  • కదంబుల రాజ్యంలో దైవిక భూమి
  •  కాంగ్రెస్ రాజ్యంలో గోదావరి
  • నాడు ఈశ్వరుని పూదోట 
  • నేడు భద్రాచలం ప్రాంతం
  • నాడు సుగంధ ద్రవ్యాల కోసం
  • నేడు ఇసుక కోసం

అది ఎనిమిదవ శతాబ్ధ కాలం. ఒక వైపు కదంబుల రాజ్యం. మరో వైపు అటవీ ప్రాంతంలోని దైవిక భూమి కాంతార. మిరియాలు, యాలకులు, సుగంధ ద్రవ్యాలు పండించి జీవనం సాగించే ఆదివాసీ ప్రాంతం. దీనిలో ఈశ్వరుని పూదోట ఎంతో పవిత్రమైనది. శివుని గణాలతో పాటూ  ఆదివాసీల పూర్వీకుల ఆత్మలు సంచరించే ఆ  ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ‘బెర్మే’ పోరాటం చేశాడు. శివుని పూదోట కోసం దండయాత్రలు చేసిన భాంగ్రా రాజులందరూ మరణించారు. ఇది ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార చాప్టర్ 1’ కథ.. ఆదివాసీ రాజ్యంపై కన్నేసిన వారికి, వారి సంపదపై దండయాత్రలు చేసే వారికి ఈ కథను అన్వయించవచ్చు. 

సీన్ తిరగేస్తే ..

తెలంగాణ లోని భద్రాచలం ఆదివాసీ ప్రాంతం. అడవుల మధ్య గల గలా పారుతున్న గోదావరి నది. నదిలో నిక్షిప్తమై ఉన్న విలువైన ఇసుక.. దీనిపై కాంగ్రెస్ రాజుల కన్ను పడింది. ఖజానా నింపుకోవడానికి ఈ ఇసుకను తరలించడమే వారి లక్ష్యం. రాజుల తాబేదార్లు, గుత్తపెట్టుబడి దారులు ఇసుక కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి గోదావరి నదిని కొల్లగొట్టే పనిలో పడ్డారు. పర్యావరణ, జీవన విధ్వంసానికి పాల్పడుతూ స్వైర విహారం చేస్తున్నారు. హైదరాబాద్ లోని సంపన్నుల గృహ నిర్మాణం కోసం భద్రాచలం ఇసుక కావాలి. వారి నాగరిక జీవనం కోసం ఏజెన్సీ ప్రాంతం నాశనమవ్వాలి. పేరుకు ఆదివాసీలకే ఇసుక రీచ్ లను అప్పగించామని చేస్తున్న ప్రచారం. ఈ ప్రచారంలో నిజమెంతే నిగ్గు తేలాలి. 

రాజ్యాంగం..చట్టం..

నాటి కదంబుల రాజ్యంలో రాజు చెప్పిందే వేదం. కాంతారను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దండయాత్రలు చేయడం, రాజులను ఎదిరించడానికి ‘బెర్మే’ వంటి నాయకుడు పుట్టడం.. ఇదంతా చరిత్ర.. కానీ ఆధునిక నాగరిక రాజ్యాన్ని ప్రజాస్వామిక బద్దంగా పాలించడానికి ఒక రాజ్యంగం రాసుకున్నాము. దీని ప్రకారం పాలన జరగాలి. ఇక ఆదివాసీ ప్రాంతం విషయానికి వస్తే భారత దేశంలోని తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యుల్ లో చేర్చారు. ఈ ప్రాంతంలో ఆదివాసీల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి.

representative picture

అడవి, భూమి, ఖనిజాలు, ఇతర ప్రకృతి వనరులపై ఆదివాసులకు ప్రత్యేక హక్కులు కల్పించారు.  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన షెడ్యూల్డు ప్రాంతాలకు పంచాయితీరాజ్ విస్తరణ (పీసా) చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఇసుక సహా చిన్నతరహా ఖనిజాలు ఆదివాసీలకే దక్కాల్సి ఉంది. గ్రామసభల ద్వారా ఇసుకను ఆదివాసీ సహకార సంఘాలకు పూర్తిగా అప్పగించాల్సి ఉంది. కానీ ఇక్కడే పాలకులు తమ కుటిల నీతిని ప్రదర్శించారు. ఇసుకను ఆదివాసీల సంపదగా చెప్పకుండా కేవలం ప్రభుత్వ సంపదగా అన్వయించుకున్నారు. 

యజమానులు కూలీలుగా 

సేవకులు యజమానులుగా

ఆదివాసీలకు దక్కాల్సిన ఇసుకను ప్రభుత్వమే బహిరంగ మార్కెట్ లో అమ్ముకూంటూ ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది. ఆదివాసీ సహకార సంఘాలకు కేవలం  కూలి పనులను అప్పగించింది. యజమానులు కూలీలుగానూ, సేవకులైన పాలకులు  యజమానులుగానూ చలామణి అవుతున్న వింత సాంప్రదాయం ఇసుక విషయంలో కొనసాగుతున్నది. ఇసుకను గోదావరి నుంచి తీసి డంపింగ్ యార్డు వరకూ తరలించే ఆదివాసీ సంఘాలకు క్యూబిక్ మీటర్ కు రూ. 220 కేటాయిస్తుండగా వీటిలో రూ. 180 ఆదివాసేతర  బినామీ కాంట్రాక్టర్లకు పోతోంది.

representative picture

ఇక మిగిలిన 40 రూపాయలు మాత్రమే ఆదివాసులు పంచుకోవాలి. రూ. 600 దక్కాల్సిన ఆదివాసీలకు రూ. 40 మాత్రమే దక్కడం పాలకుల దమననీతికి అద్దం పడుతోంది. అంటే ఆదివాసీల సంపదపై ప్రభుత్వం వ్యాపారం చేస్తోంది. లారీలకు పట్టాలు కట్టుకోవడం, ఇసుక డంప్ లకు కాపలా కాయడం వంటి కూలి పనులు చేసుకుంటున్న ఆదివాసీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి రావడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అణచివేయడానికి కాంట్రాక్టర్ల ద్వారా సామదాన దండోపాయాలను ప్రభుత్వం ప్రయోగిస్తోంది. 

చెలరేగిపోతున్న బినామీలు..

ప్రభుత్వ అండదండలతో బినామీ కాంట్రాక్టర్లు చెలరేగిపోతున్నారు. ఓవర్ లోడింగ్, లారీల వద్ద అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారు. అడపా దడపా నకిలీ వేబిల్లులు సృష్టిస్తూ ప్రభుత్వ  ఖజానాను కొల్లగొడుతున్నారు. ఇసుక తవ్వకాల్ని ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగించామని చెప్తున్న ప్రభుత్వం బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థను కాపాడుకుంటూ వస్తున్నది. బినామీ కాంట్రాక్టర్లు అధికార పార్టీ నేతలకు భారీగా ముడుపులు చెల్లించుకోవడమే దీనికి కారణమని చెప్పవచ్చు. 

‘బెర్మే’ ఎప్పడు వస్తాడు?

దేవభూమి కాంతారను కాపాడినట్లే గోదావరిని, ఆదివాసులను కాపాడడానికి మరో ‘బెర్మే’ రావాలని ఆదివాసులు ఎదురుచూస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం తమ సంపద పూర్తిగా తమకే దక్కాలని కోరుకుంటున్నారు. నివురు కప్పిన నిప్పులా ఉన్న ఆదివాసులు ఎప్పడో రాజ్యాన్ని ప్రశ్నించే రోజు వస్తుంది.

Leave A Reply

Your email address will not be published.