- కొత్త విధానం పేరుతో హంగామా
- అధికారుల అయోమయం
- సింగిల్ కాంట్రాక్టర్ విధానం కోసం మంత్రి ఒత్తిడి
- పాత విధానమే మంచిదని పలువురి అభిప్రాయం
- అమల్లో లోపాలను సరిదిద్దితే సర్కారుకు మంచి పేరు
ఇసుక తుఫాన్ ..3
రాష్ట్రంలో ఇసుక తికమక కొనసాగుతున్నది. కొత్త విధానం తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నం ముందుకు సాగడం లేదు. అధ్యయనం పేరుతో అధికారులు చేస్తున్న హంగామా తప్ప ఇప్పటి వరకూ ఏకాభిప్రాయానికి రాలేదు. ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధంగా సింగిల్ కాంట్రాక్టర్ విధానాన్ని తీసుకురావాలని ఖమ్మం జిల్లా మంత్రి చేస్తున్న ప్రయత్నం కూడా వివాదాస్పదంగా మారింది. మైనింగ్ శాఖ సీఎం వద్ద ఉండటంతో అధికారులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇసుక లోడింగ్, రవాణా విధానంలో మాఫియా పాత్ర గురించి ఇప్పటికే వివరాలు సేకరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 లో కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు పరిశ్రమలు వాణిజ్యం (మైనింగ్) శాఖ జీవో నంబర్ 38 జారీ చేసింది. దీనికి అనుగుణంగా జీవో నంబర్ 3 ద్వారా నిబంధనలను రూపొందించింది. ఈ విధానంలో భాగంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్ పర్సన్ గా జిల్లా ఇసుక కమిటీ పనిచేస్తుంది. గనులు, భూగర్భ జలాలు, రెవిన్యూ, నీటిపారుదల శాఖ, టీజీఎండీసీ పీఓతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ పీఓ లు కూడా సభ్యులగా ఉంటారు. ముందుగా జాయింట్ ఇనస్పెక్షన్ కమిటీ ఇసుక రీచ్ లను గుర్తించి జిల్లా ఇసుక కమిటీ ముందు పెడుతుంది. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో గుర్తించిన ఇసుక రీచ్ లను సిఫారసు చేసి పర్యావరణం తదితర అనుమతులను తీసుకోవడానికి టీజీఎండీసీకి పంపుతారు. అనుమతులు వచ్చిన ఇసుక రీచ్ ల నిర్వహణ బాధ్యతలను టీజీఎండీసీకి అప్పగించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సహకార సంఘాల ద్వారాను, మైదాన ప్రాంతాల్లో టెండర్ విధానం ద్వారాను టీజీఎండీసీ ఇసుక డంపింగ్, లోడింగ్ పనులను అప్పగిస్తున్నది. ఆన్ లైన్ విధానం ద్వారా ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి.

దేశంలోనే బెస్ట్ పాలసీ..
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక విధానానికి దేశంలోనే అత్యుత్తమమైనదిగా పేరుంది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ విధానాన్ని అధ్యయనం చేసి అక్కడ కూడా అమలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో అమల్లోకి వచ్చిన ‘వాల్టా’ చట్టంలో కూడా ఇసుక తవ్వకాలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయడంతో ఇది కూడా కొంత వరకూ ఉపయోగపడింది. ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమేరాలు అమర్చడం, ఇసుక లారీలకు జీపీఎస్ అమర్చడం వంటి నిబంధనలు కూడా తెలంగాణ ఇసుక పాలసీలో ఉన్నాయి.
గణనీయంగా పెరిగిన ఆదాయం..
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీతో ప్రభుత్వ ఖజానాకు గణనీయంగా ఆదాయం పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో స్పష్టమైన విధానం లేక పోవడంతో ప్రభుత్వ ఆదాయం నామ మాత్రంగానే ఉంది. ఇదే కాలంలో ఇసుక మాఫియా అప్పటి కాంగ్రెస్ నేతల అండదండలతో చెలరేగి పోయింది. తెలంగాణ రాష్ట్రం కొత్త విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే రూ. 600 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రాగా ఐదేండ్ల కాలంలో అంచెలంచెలుగా పెరుగుతూ రూ. 1,200 కోట్లకు పెరిగింది.
గులాబీ మాఫియాతో చెడ్డపేరు..

ఇసుక పాలసీ మంచిదైనప్పటికీ రాజకీయ జోక్యంతో ఇసుక మాఫియా చెలరేగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. జీరో వ్యాపారం, ఓవర్ లోడింగ్, నకిలీ వేబిల్లుల దందాతో ప్రభుత్వ ఖజానాకు కొంత మేరకు గండి కొట్టారు. అధికార యంత్రాంగం కూడా గులాబీ నేతలకు దాసోహం కావడంతో వారి అకృత్యాలు పెరిగిపోయాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ళ గ్రామ దళితులపై జరిపిన దాష్ఠీకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఓటమికి ఇసుక వ్యాపారం కూడా కారణమని రుజువైంది.
ఏజెన్సీలో బినామీ కాంట్రాక్టర్లు..
ఏజెన్సీ ప్రాంతంలో అమల్లో ఉన్న ‘పీసా’ చట్టం ప్రకారం ఇసుక రీచ్ లను ఆదివాసీ సహకార సంఘాలకు కేటాయించవలసి ఉంది. గ్రామసభల ద్వారా అర్హత కలిగిన సహకార సంఘాలను ఎంపిక చేస్తారు. చట్ట ప్రకారం ఇసుక డంపింగ్, లోడింగ్ పనులతో పాటు మినరల్ డీలర్ లైసెన్సులను ఆదివాసీ సహకార సంఘాలకే అప్పగించినప్పటికీ వారి వద్ద పెట్టుబడి లేక పోవడంతో గిరిజనేతర బినామీ కాంట్రాక్టర్లు రంగ ప్రవేశం చేశారు. తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థలో అవినీతి పరులైన అధికారుల సహకారం బినామీ కాంట్రాక్టర్లకు లభించడంతో వారి ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. ఐటీడీఏలు, ట్రైకార్ హకారంతో బ్యాంకు రుణాలు ఇప్పించి ఆదివాసీ సహకార సంఘాలకు సాధికారిత కల్పించాల్సిన అధికార యంత్రాంగం కూడా మాఫియా చేతుల్లో పావులుగా మారిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థ కొనసాగుతున్నది. అక్రమ రవాణా, జీరో వ్యాపారం, ఓవర్ లోడింగ్ తో మాఫియా చెలరేగిపోతున్నది. ఇసుక మాఫియాకు అధికార పార్టీకి చెందిన కొందరు నేతల మద్దతు లభించడంతో కొత్త ప్రభుత్వం కూడా అప్రతిష్ట పాలయింది. సాక్షాత్తూ ఒక మంత్రి వర్యుడు తన అనుచరులకు ఇసుక రీచ్ లను కట్టబెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

సింగిల్ కాంట్రాక్టర్ విధానంతో అపఖ్యాతి పాలయిన ఏపీ ప్రభుత్వం..
రాష్ట్రంలో మాఫియాగా మారిన చిన్న కాంట్రాక్టర్లను తీసివేసి ఇసుక రవాణా సింగిల్ కాంట్రాక్టర్ కి అప్పగించాలని ఒక మంత్రి చేస్తున్న ప్రయత్నానికి పలు వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది అమలు చేస్తే ఇసుక రవాణాపై ఆధార పడిన 50,000 ఇసుక లారీల యజమానులు తీవ్రంగా నష్టపోతారు. ఏపీలో జగన్ అమలు చేసిన సింగల్ కాంట్రాక్టర్ విధానం చెడ్డపేరు తెచ్చింది. కాంట్రాక్టర్ కోట్లాది రూపాయలు సంపాదించుకుని ప్రభుత్వానికి చెల్లించవలసిన సొమ్ము చెల్లించక పోవడం కూడా వివాదంగా మారింది. చివరికి న్యాయస్థానాలు కూడా మొట్టికాయలు వేశాయి.
ప్రభుత్వానికి సూచన..
ఏజెన్సీ ప్రాంతంలో బినామీ కాంట్రాక్టర్ల వ్యవస్థను తీసివేసి నేరుగా ఆదివాసీ సహకార సంఘాలే ఐటీడీఏ ల పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు లోడింగ్ పనులు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. మైదాన ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న టెండర్ విధానం మంచి ఫలితాలనే ఇచ్చింది. అక్రమ రవాణా, ఓవర్ లోడింగ్, జీరో వ్యాపారం అరికట్ట వలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఈ దిశగా కొత్త విధానం అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి.