A place where you need to follow for what happening in world cup

షాడోలు..

  • ఖమ్మం లోక్ సభ బరిలో వారసులు
  • ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యుల ప్రయత్నం
  • స్వయం ప్రకాశక శక్తి లేకున్నా పదవీ వ్యామోహం
  • ప్రజలు తమను మోస్తారనే ఆశ
  • కాంగ్రెస్ పార్టీకి ధీటైన అభ్యర్థి కొరత

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ టిక్కెట్ కోసం ముగ్గురు నేతల కుటుంబ సభ్యులు పోటీ పడడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకాలం భర్త, తండ్రి, సోదరుడి చాటున ఉంటూ వ్యపార లావాదేవీలు, ఎన్నికల ఖర్చులు చూసుకున్న నేతల వారసులు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలను కోవడం విశేషం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి బరిలో ఉన్నారనే వార్తను జిల్లా వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రముఖ నేతల మరణం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేయడం గత సాంప్రదాయం. సానుభూతితో ఓట్లు పడతాయనే భావనతో పాటు దివంగత నేత చేసిన సేవలకు గుర్తింపుగా వారి వంశంలో ఒకరు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే అభిప్రాయం ఉండేది.

దీనికి భిన్నంగా ఒకే కుటుంబంలో పలువురు రాజకీయాల్లోకి రావడం, ఒకే పార్టీలోనో మరొక పార్టీలోనో పదవులు దక్కించుకోవడం నేటి ట్రెండ్ గా మారిపోయింది. ఖమ్మం లోక్ సభ బరి నుంచి మాజీ ఎంపీ రేణుకా చౌదరిని తప్పించడం కోసం ఆమెకు రాజ్యసభ సీటు కేటాయించి అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు జిల్లా ప్రజలకు అథిష్ఠానం ఎంతో మేలు చేసిందని చెప్పవచ్చు. లోక్ సభకు పోటీచేయడానికి ధీటైన అభ్యర్థి లేక పోవడంతో బయటి నేతలను ఇక్కడి నుంచి బరిలోకి దింపే ఆలోచన కూడా పార్టీకి ఉంది. అయినప్పటికీ స్థానిక నేతల వారసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పడు అనూహ్యంగా తెరపైకి వచ్చిన షాడోల సంగతి తేలాల్సి ఉంది.

త్యాగాల గడ్డలో స్వార్థ రాజకీయాలు..


నిస్వార్థపరులైన పలువురు నేతల త్యాగాల పునాదులపై నిలబడిన ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం స్వార్థ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. సర్థార్ జమలాపురం కేశవరావు, బొమ్మకంటి సత్యనారాయణరావు వంటి ఉద్ధండులైన కాంగ్రెస్ నేతలు, సర్వదేవభట్ల రామనాథం, పర్సా సత్యనారాయణ, బోడేపూడి వెంకటేశ్వరరావు వంటి కమ్యూనిస్టు నేతలు తమ వారసుల కోసం ఏనాడూ వెంపర్లాడ లేదు. వారసత్వ రాజకీయాలు జలగం కుటుంబంతో మొదలయ్యాయి. జలగం వారసులను మొదట ప్రజలు ఆదరించినా కొంత కాలం తర్వాత వారు మసిబారి పోయారు. సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు ‘సన్ స్ట్రోక్’ తోనే పరాజయం పాలయ్యారు.

మల్లు అనంతరాములు వారసులుగా..

వీడీఓ ఉద్యోగాన్ని వదలి కాంగ్రెస్ పార్టీలో చేరిన దివంగత మల్లు అనంతరాములు అంచెలంచెలుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకూ ఎదిగారు. నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఈశాన్య రాష్ట్రాల ఇన్ ఛార్జిగా పనిచేశారు. 1989 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి చెన్నారెడ్డి తర్వాత కాబోయో ముఖ్యమంత్రిగా మల్లు అనంతరాములును ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ సమయంలోనే ఆయన ఆకస్మికంగా మరణించారు. అనంతరాములు మరణం తర్వాత రాజకీయ వారసులుగా ఆయన సోదరులు మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్క తెరంగేట్రం చేశారు.

అనంతరాములు పెద్ద కుమారుడు మల్లు రమేష్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా రంగప్రవేశం చేసినా ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆయన అనారోగ్యంతో మరణించగా మరొక కుమారుడు మల్లు శివ క్రైస్తవ మత ప్రచారకుడిగా స్థిరపడ్డారు. మల్లు రవి నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మల్లు భట్టి విక్రమార్క రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2004 లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్లు భట్టి విక్రమార్క 2009 లో మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు.

లోక్ సభ సీటుకోసం నందిని హంగామా..


ఖమ్మం లోక్ సభ సీటు కోసం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ప్రయత్నాలు ప్రారంభించారు. మధిర నియోజకవర్గంలో అడపా దడపా పర్యటించడం, ఎన్నికల సమయంలో లావాదేవీలు చూసుకోవడం మినహా ప్రజాదరణ పొందిన నాయకురాలిగా ఆమె ఎదగలేదు. లోక్ సభ సీటుకోసం పొంగులేటి సోదరుడు ప్రసాదర రెడ్డి, తుమ్మల తనయుడు యుగంధర్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు రావడంతో నందిని కూడా రంగంలోని దిగారు. టిక్కెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి 300 పైగా కార్ల ర్యాలీతో ఆమె హైదరాబాద్ వెళ్ళడం జిల్లా వాసులకు ఆశ్చర్యం కలిగించింది. మధిర నియోజకవర్గం మినహా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో మల్లు భట్టి విక్రమార్కకు పెద్దగా ఆదరణ లేదు. నందిని అభ్యర్థిత్వంపై భట్టి విక్రమార్క ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. భట్టికి తెలియకుండా నందిని టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారని ఎవరూ అనుకోవడం లేదు. జనరల్ నియోజకవర్గంలో రిజర్వ్ డ్ అభ్యర్థినికి టిక్కెట్ ఇవ్వక పోవచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకే కుటుంబంలో మూడవ వ్యక్తికి పదవులు కట్టబెడతారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తున్నది.

పుట్టిన రోజు పేరుతో యుగంధర్ హడావుడి..

ఖమ్మం లోక్ సభ టిక్కెట్ ను తుమ్మల కుమారుడు యుగంధర్ కూడా ఆశిస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా తనకు టిక్కెట్ వస్తుందనే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం ప్రత్యక్ష రాజకీయాల్లో లేక పోయినా తండ్రి తుమ్మల పోటీ చేసినప్పడు పోల్ మేనేజిమెంట్, ఆర్థిక లావాదేవీలు చూసుకోవకడంలో అనుభవం గడించారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మం నగరమంతా అభిమానుల పేరుతో కటౌట్లు, ఫ్లెక్సీలతో యుగంధర్ చేసిన హంగామా అంతా ఇంతాకాదు. పుట్టిన రోజు పేరుతో దాదాపు రూ. 50 లక్షలు ఖర్చుపెట్టడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఆయన పెట్టిన ఖర్చుతొ బడి, గుడి లేదా ఒక వైద్యశాలను నిర్మించే అవకాశం ఉందని నగర ప్రజలు వ్యాఖ్యానించారు. యుగంధర్ అభ్యర్థిత్వంపై తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి కామెంట్ చేయలేదు. మౌనం అర్థ అంగీకారంగానే అందరూ భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే యుగంధర్ నిరంతర పర్యటనలు చేస్తున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకునే తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు అత్యంత సంపన్నుడైన నేతగా ఏ విధంగా ఎదిగారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పొంగులేటి ప్రసాదరెడ్డి ధీమా..

పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి ఖమ్మం లోక్ సభ సీటు రేసులో ముందంజలో ఉన్నట్టు తెలిసింది. అంగబలం, అర్థబలం కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరుంది. ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాలకు ఆయన ఇన్ ఛార్జిగా కూడా ఉన్నారు. కానీ ఆయన సోదరుడు ప్రసాదరెడ్డికి నేరుగా ప్రజలతో సంబంధం లేదు. వ్యాపార లావాదేవీలు, పోల్ మేనేజిమెంటు పనులను సోదరుడి తరపున చూసుకోవడమే ఆయనకున్న ప్రధాన అర్హత. లోక్ సభ ఎన్నికలకు దాదాపు రూ. 100 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్న తరుణంలో పొంగులేటితో పోటీ పడటం ప్రత్యర్థులకు కష్టమేననే వాదన వినిపిస్తున్నది. ఇతరులకు టిక్కెట్ ఇస్తే డబ్బు ఖర్చు పెట్టి గెలిపించాల్సిన అవసరం పొంగులేటికి ఉండదని ఆయన అనుయాయులు అంటున్నారు. రాజకీయానికి వ్యాపారానికి మధ్య గీతను చెరిపేసిన నేతలు ఎన్నికల కోసం పెట్టే పెట్టుబడిని కూడా వ్యాపారంగానే భావిస్తున్నారు. పొంగులేటి సహా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు కూడా దీనికి అతీతులు కారు.

కొండూరి రమేష్ బాబు,
సీనియర్ జర్నలిస్టు

Leave A Reply

Your email address will not be published.