A place where you need to follow for what happening in world cup

నిబంధనలు పక్కన పెట్టి.. ఆదివాసుల పొట్టకొట్టి…

  • ఇసుక రీచ్ ల కేటాయింపుల్లో రెడ్ టేపిజం
  • ‘పీసా’ నిబంధలకు వక్రభాష్యం
  • అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు
  • మంత్రి సీతక్క చెప్పినా వినని వైనం
  • పొంగులేటి చెప్తేనే ఫైల్ కదలిక

సహజ న్యాయ సూత్రాలకు, ప్రభుత్వ నిబంధలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఒక ఉన్నతాధికారి తీరు వివాదాస్పదమవుతున్నది. ఆదివాసీ సహకార సంఘాలకు దక్కాల్సిన ఏజెన్సీ ఇసుక రీచ్ ల తుది కేటాయింపుల విషయంలో ఆ అధికారి గత ఆరు నెలలుగా చేస్తున్న జాప్యంతో ఆదివాసులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దక్కాల్సిన ఫలాలు చేజారిపోతున్నాయి. పర్యావరణ అనుమతులతో సహా అన్ని అనుమతులు పొంది జిల్లా ఇసుక కమిటీ తీర్మానం కూడా పూర్తి చేసుకున్న ములుగు జిల్లాలోని ఇసుక రీచ్ ల తుది అనుమతుల ఫైల్ పై ఉన్నతాధికారి సంతకం విషయంలో గత నాలుగైదు రోజులుగా హైడ్రామా నడుస్తున్నది. ఆదివాసీ సహకార సంఘాలు తమకు జరుగుతున్న అన్యాయం గురించి మంత్రి సీతక్క దృష్టికి తీసుకు వెళ్ళడంతో రెండు రోజుల క్రితం మంత్రి ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఫైళ్ళు క్లియర్ చేయమని చెప్పారు. అయినా ఫలితం శూన్యం. ఇదే అంశంపై ఉన్నతాధికారితో ఫోన్ లో మాట్లడాలని ప్రయత్నం చేసిన భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావుకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అత్యంత సన్నిహితుడైన భద్రాచలం ఎమ్మెల్యే త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల పొంగులేటితో కలసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలసి వచ్చారు. ఎమ్మెల్యే ఏ పార్టీ వారైనా అధికారిక నంబర్ కు ఫోన్ చేస్తే ప్రొటోకాల్ ప్రకారం మాట్లాడవలసిన అవసరం ఉన్నది. అయినా ములుగు జిల్లా అధికారి పెడచెవిన పెట్టారు.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్..

అన్ని అనుమతులు వచ్చిన ఏజెన్సీ ఇసుక రీచ్ ల ఫైళ్ళను వెంటనే క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఖజానాతో పాటు ఆదివాసీ కుటుంబాలకు ఆదాయం వచ్చే ఏజెన్సీ ఇసుక రీచ్ ల ఫైళ్ళు ములుగు, భద్రాద్రి జిల్లాల్లో పెండింగ్ లో ఉన్నాయి. మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఏర్పడటంతో లారీ ఇసుకను రూ. 90 వేలకు అమ్ముతున్నారు. ఈ పరిస్థితిపై తెలంగాణ ఖనిజాభివృద్థి సంస్థ ఇటీవల ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా ఇచ్చింది. ములుగు జిల్లాలో 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10 ఇసుక రీచ్ లకు పర్యావరణ అనుమతులు వచ్చి 10 నెలలు గడుస్తున్నది. మరో రెండు నెలల్లో వీటి కాలపరిమితులు ముగుస్తున్నాయి.

ఇక్కడ ‘ఇలా’..

ములుగు జిల్లాలో ఇసుక రీచ్ ల ఫైళ్ళను నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన ఉన్నతాధికారి ఇద్దరు మంత్రుల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ విషయం వారి దృష్టికి వెళ్ళడంతో ఫైళ్ళు వెంటనే క్లియర్ చేయాలని చెప్పారు.రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నదని తెలిసిన మంత్రి సీతక్క ఉన్నతాధికారికి పలుమార్లు ఫోన్ చేసి ఆదివాసీ సహకార సంఘాల ఇసుక కేటాయింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి ఫోన్ చేసిన తర్వాత ముందుగా మంగపేట మండలంలోని రెండు ఫైళ్ళపైన, వాజేడు మండలంలోని భీమారం ఫైల్ పైన ఉన్నతాధికారి సంతకం పెట్టారు. మరో మంత్రి ఫోన్ చేయడంతో మంగపేట మండలంలోని రాజుపేట, వెంకటాపురం మడలంలోని సూరవీడు కాలనీ, రామానుజపురం, రామచంద్రాపురం ఫైళ్ళపై సంతకాలు పెట్టారు. అన్ని అనుమతులు వచ్చిన తమ ఫైళ్ళను కూడా క్లియర్ చేయాలని వెంకటాపురం మండలం లోని ముత్తారం, వీరభద్రవరం, సుబ్రహ్మణ్య కాలనీ, పూజారిగూడెం, అంకన్నగూడెం గ్రామాల ఆదివాసీలు ఉన్నతాధికారిని కోరారు. మంత్రులు ఫోన్ చేసిన ఫైళ్ళపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఉన్నతాధికారి మిగిలిన ఫైళ్ళ విషయంలో సాంకేతిక కారణాలను వెతకడం మొదలు పెట్టారు.

పీసా నిబంధనల ప్రకారం గ్రామసభలు జరగలేదంటూ మైనింగ్ అధికారికి చెప్పారు. పీసా గ్రామసభల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభత్వం జారీ చేసిన జీవో నంబర్ 66, జీవో నంబర్ 54 ప్రకారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ గ్రామసభలను నిర్వహించి నివేదికలు పంపినా ఉన్నతాధికారి వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ప్రతీక్ జైన్ కు సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా పేరుంది. గ్రామ సభల విషయంలో కనీసం ఆయన అభిప్రాయం కూడా ఉన్నతాధికారి తీసుకోలేదు. ఆదివాసీల సమూహం లేదా గుంపు (హేబిటేషన్) కు పీసా చట్టం ప్రకారం గ్రామ పంచాయితీ స్థాయి ఉన్నది. హేబిటేషన్ క్లస్టర్లు లేదా సమూహాల పరిథిలోనే గ్రామసభలను నిర్వహిస్తూ వచ్చారు. ఇక్కడి పరిథిలోనే కోరం పరిగణిస్తారు. కానీ ఉన్నతాధికారి పంచాయితీ పరిథిని తీసుకుని ఓటర్లలో సగం మంది ఉంటేనే గ్రామ సభ చెల్లుతుందని మైనింగ్ అధికారికి చెప్పారు. రెండు జీవో ల కాపీలను మైనింగ్ అధికారి అందచేసినా ఉన్నతాధికారి వినలేదు. ఆదివాసీ సంఘాలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నా ఉన్నతాధికారి సమస్యను పరిష్కరించకుండా రెండు రోజులు వరుసగా మంగపేట పర్యటనకు వెళ్ళిపోయారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ములుగులోని తన కార్యాలయానికి వచ్చారు.

అక్కడ ‘అలా’..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి మరో విధంగా ఉంది. గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న ఆదివాసీ సహకార సంఘాలకు చెందిన 10 ఇసుక ఫైళ్ళపై ఈ నెల 14 న కలెక్టర్ సంతకం పెట్టారు. మంత్రి పొంగులేటి ఆదేశం మేరకు కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో 3 ప్రకారం ఏజెన్సీ ఇసుక రీచ్ ల కేటాయింపులకు గ్రామసభల సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 10 ఇసుక రీచ్ లకు సంబంధించి గ్రామసభల సమావేశాలు జరగలేదు. గ్రామసభలు నిర్వహించకుండా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిపై హై కోర్టును ఆశ్రయించాలని ఆదివాసీ సంఘాలు నిర్ణయించాయి.

Leave A Reply

Your email address will not be published.