- అన్నారం బ్యారేజీలో ఇసుక పంట
- ఖజానా నింపడానికి పూడిక
- లైడార్ డ్రోన్ సర్వేతో హడావుడి
- 2.49 కోట్ల క్యూబిక్ మీటర్ల లక్ష్యంతో అధికారుల పరుగులు
- మరమ్మత్తుల్లో జాప్యంతో రైతుల ఆగ్రహం
- నీరు నింపక పోవడంతో ఎడారిగా మారిన కాళేశ్వరం బ్యారేజీలు
ఇసుక తుఫాన్ 4
సాంకేతిక సమస్యలతో నిరుపయోగంగా మారిన కాళేశ్వరం బ్యారేజీల్లో ఇసుక పంట పండించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుగా అన్నారం బ్యారేజీ వెనుక భాగంలోని గోదావరి, మానేరు నదులపై రూ. 1,300 కోట్లు విలువ చేసే 2.49 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. బ్యారేజీలకు మరమ్మత్తులు చేయకుండా నీరు నింపవద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన నేపధ్యంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల గేట్లు ఎత్తివేశారు. ఫలితంగా ఈ రెండు బ్యారేజీలు ఎడారిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ లోపాలు, లీకేజీల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. 
జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ విచారణ జరుగుతూనే ఉన్నది. బ్యారేజీలు నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ మరమ్మత్తు పనులు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా బ్యారీజీల వైఫల్యంలో తమ పాత్ర ఏమీ లేదని ఎల్ అండ్ టీ వాదిస్తున్నది. విచారణ కమిషన్ నివేదిక వస్తేనే కానీ అసలు విషయం బయట పడే అవకాశం లేదు. అప్పటి వరకూ వేచి చూసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బ్యారేజీల మరమ్మత్తులో జరుగుతున్న జాప్యంతో ఏడు జిల్లాల్లోని ఆయకట్టు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు బ్యారేజీల్లో పూడిక పేరుతో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపట్టడం ద్వారా రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

నాడు బీఆర్ఎస్..నేడు కాంగ్రెస్..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పూడిక పేరుతో భారీగా ఇసుక తవ్వకాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని కొనసాగించడం పట్ల తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. బ్యారీజీల నిర్మాణం ప్రారంభం కాక ముందే మేడిగడ్డ, అన్నారం బ్యారీజీల వెనుక భాగంలో 5.35 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 35 ఇసుక బ్లాక్ ల ద్వారా రూ. 3,600 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఇసుక తవ్వకాలు జరిగాయి.

ఈ రీచ్ లను దక్కించుకున్న కొందరు గులాబీ కాంట్రాక్టర్లు అక్రమ రవాణా ద్వారా వందల కోట్లు సంపాదించారనే విమర్శలు వచ్చాయి. పర్యావరణ అనుమతులు లేకుండా పూడిక పేరుతో ఇసుక తవ్వుకునే వెసులుబాటు ఉండటంతో దొడ్డి దారిన ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. నిర్మాణంలో లేని బ్యారేజీల పూడిక ప్రహసనంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు నివేదిక తయారు చేయాలని ఆదేశించింది. భూకంప ప్రభావ ప్రాంతంలో కట్టిన బ్యారీజీల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలకు ఇసుక తవ్వకాలు కూడా కారణమనే వాదన కూడా వినిపిస్తున్న నేపధ్యంలో సరైన అధ్యయనం లేకుండా ప్రస్తుత ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు సన్నాహాలు చేయడాన్ని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కూడా తప్పు పడుతున్నారు.
నీటిలోని ఇసుకను తీయడానికి యత్నం..
అన్నారం బ్యారేజీ వెనుక భాగంలోని గోదావరి, మానేరు నదులపై డ్రెడ్జింగ్ ద్వారా నీటిలోని ఇసుకను తీయడం ద్వారా రాష్ట్ర ఖజానాను నింపుకోవడానికి గత ప్రభుత్వం విఫలయత్నం చేసింది. సాధారణంగా సముద్రంలోనూ, ఎప్పుడూ నీరు ఉండే కోస్తా ప్రాంతంలోనూ డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా ఇసుకను తవ్వుతారు. తెలంగాణలో అటువంటి ప్రయత్నం గతంలో జరగలేదు. గులాబీ అధికారిగా పేరు తెచ్చుకున్న నాటి ఖనిజాభివృద్థి సంస్థ ఎండీ ప్రభుత్వ ఆదాయం పెంచుతానంటూ ఇటువంటి ప్రయత్నం చేశారు. లైడార్ సర్వే ద్వారా 2.54 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయవచ్చని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడి చేశారు. నీటి పారుదల శాఖ అధికారులే స్వయంగా దీనిని వ్యతిరేకించారు. లైడార్ సర్వే ద్వారా నీటి కింది ఇసుకను అంచనా వేయలేమని వారు తేల్చి చెప్పారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే చేస్తేనే ఖచ్చితంగా ఇసుక మేటలను అంచనా వేయవచ్చని వారు తెలిపారు. హైడ్రోగ్రాఫిక్ పరికరాలు అందుబాటులో లేక పోవడంతో ఈ ప్రతిపాదనకు స్వస్తి చెప్పారు.
(తరువాయి రేపు..)