A place where you need to follow for what happening in world cup

రోడ్ టెర్రరిస్ట్..

  • ఒప్పందం చేసుకుని రెండేండ్లయినా పనులు ప్రారంభించని ఘనుడు
  • గోతులు పెరగాలని వేచి చూస్తున్న గు‘లాబీ‘ కాంట్రాక్టర్
  • కాంట్రాక్టు రద్దు చేయక పోగా ఎస్టిమేట్లు పెంచిన అధికారులు
  • తాత్కాలిక మరమ్మత్తుల పేరుతో గుంతల్లో మట్టి
  • పది మంది మృతి చెందినా స్పందించని అధికారులు
  • ముడుపుల మత్తులో తరిస్తున్న వైనం

కాంట్రాక్టర్ కు రాజకీయ అండ ఉంటే అధికార గణం అడుగులకు మడుగులొత్తడం సహజమే. కానీ కాంట్రాక్టరే రాజకీయ నాయకుడై అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవతరిస్తే..అతనికి పాదాక్రాంతమై సేవలు చేసుకుని తరించే భాగ్యం తప్ప వేరేముంటుంది? అధికారిక పర్సంటేజిలు తీసుకునే రోడ్లు భవనాలు, నీటిపారుదల శాఖల్లో రాజభక్తి మరీ ఎక్కువనేది అందరికీ తెలిసిన విషయమే. ఏజెన్సీ ప్రాంతంలోని ఒక రోడ్డును కల్పతరువుగా మార్చుకుని పదిమంది ప్రయాణీకుల మృతికి కారకుడైనా చర్యలు తీసుకోక పోగా మరింత లాభం చేకూరుస్తున్న అధికారుల తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రభుత్వం మారి వంద రోజులు గడచినా వారు మౌనం వహిస్తున్నారంటే వారి బొక్కసాలు ఏ మేరకు నిండాయో స్పష్టమవుతున్నది. కాంట్రాక్టర్ ధన దాహానికి, అధికారుల అలసత్వానికి ప్రత్యక్ష తార్కాణంగా నిలిచిన ఒక రహదారిపై ప్రత్యేక కథనం..

భద్రాచలం నుంచి చత్తీస్ గఢ్ లోని భూపాలపట్నం కలిపే రహదారిలో ములుగు జిల్లా ఏకన్నగూడెం నుంచి జగన్నాథపురం వరకూ 50 కిలోమీటర్ల బీటీ రోడ్డు పునర్నిర్మాణానికి రెండేండ్ల క్రితం టెండర్లు పిలవగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే (ఇప్పుడు మాజీ) పనిని దక్కించుకున్నారు. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను ఒక సంవత్సర కాలం కనీసం ప్రారంభించలేదు. ఇసుక లారీల తాకిడితో రోడ్డు గోతులు పడి మరింత అధ్వాన్నంగా మారింది. ఎధిర వెంకటాపురం మధ్య పడిన గోతులతో అనేక ప్రమాదాలు జరిగి వివిధ సంఘటనల్లో పది మందికి పైగా మృత్యువాత పడ్డారు.

సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్ కి అప్పగించిన పనులను రద్దు చేసి మరో కాంట్రాక్టర్ కు అప్పగించాల్సిన రోడ్లు భవనాల శాఖ అధికారులు మౌనం వహించారు. ప్రజలు ఆందోళనకు దిగినా పట్టించుకోలేదు. రోడ్డు గోతులు పడడాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్న గులాబీ కాంట్రాక్టర్ ఎస్టిమేట్ ను పెంచుకోవడం మరింత వివాదాస్పదమైంది. రామచంద్రాపురం వద్ద కేవలం రెండు మూడు కిలోమీటర్ల పనిని మాత్రమే గత సంవత్సరం చేసి మిగిలిన పనిని వదలివేశాడు. వెంకటాపురం నుంచి జగన్నాథపురం వరకూ దాదాపు 15 కిలోమీటర్ల బీటీ రోడ్డును గత సంవత్సరం వేయగా వేసిన మూడు నెలలకే అది ఎక్కడికక్కడ లేచి పోయి గుంటలు పడింది. రహదారి విషయంలో ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా కాంట్రాక్టర్ ఇటీవల కొంత దూరం రోడ్డును తవ్వి గుంటల్లో మట్టి పోశాడు. దీనితో దుమ్ము లేచి ముందు వెళ్ళే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది.

రోడ్డు రాక్షసుడి అవినీతి చరిత్ర..

ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణలో రోడ్లు, భవనాలు, నీటిపారుదల పనులు చేస్తున్న గులాబీ కాంట్రాక్టర్ చరిత్ర చూస్తే అవినీతి అధ్యాయాలు వెలుగులోకి వస్తున్నాయి. పనులు చేయకుండానే బిల్లులు ఎత్తిన ఉదంతాలు కూడా ఉన్నాయి. వరంగల్ జిల్లాలో గతంలో రోడ్డు వేయకుండానే రూ. నాలుగు కోట్లు బిల్లు తీసుకున్న సంఘటనలో రోడ్లు భవనాల శాఖకు చెందిన ఒక ఎగ్జికూటివ్ ఇంజనీర్, ఒక డిప్యూటీ ఎగ్జికూటివ్ ఇంజనీర్ సస్పెండ్ అయ్యారు. మరో అవినీతి వ్యవహారంలో గులాబీ కాంట్రాక్టర్ కు సహాయ పడిన ఏటూరునాగారం ప్రాంతానికి చెందిన ఒక డిప్యూటి ఎగ్జకూటివ్ ఇంజనీర్ సస్పెండ్ అయ్యారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని గత ఐదారు సంవత్సరాలుగా పనులు సగం మాత్రమే చేయడం, నాసిరకం పనులు చేసి బిల్లులు తీసుకోవడం పరిపాటిగా మారిందని కొందరు అధికారులే అంటున్నారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎవరు ఏ పనులు చేయాలో శాసించిన ఒక దార్కార్ నేతతో జతకట్టిన గులాబీ కాంట్రాక్టర్ అంచెలంచెలుగా ఎదుగుతూ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు. అతని సహాయంతో తాలిపేరు ప్రాజెక్టు మరమ్మత్తు పనులను చేజిక్కించుకుని నాసిరకం పనులు చేశాడనే విమర్శలు వచ్చాయి. కొన్ని పనులు చేయకుండానే బిల్లులు ఎత్తడం, పనులు పూర్తి కాకుండానే బ్యాంకు గ్యారంటీ వెనక్కి తీసుకోవడం వెనుక ఏఈఈ స్థాయి నుంచి ఎస్ఈ స్థాయి వరకూ అధికారుల పాత్రం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

ఏజెన్సీ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గులాబీ కాంట్రాక్టర్ చేస్తున్న ఆగడాలను అరికట్టి అతని కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సదరు కాంట్రాక్టర్ కి సహకరించి అక్రమాల్లో పాల్పంచుకున్న ఇంజనీర్లపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరాలని రెండు జిల్లాల వారు సమాయత్తమవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.