A place where you need to follow for what happening in world cup

ఖమ్మంలో పొంగులేటి సునామీ..

0 12,772

Ponguleti 1

  • కాంగ్రెస్ లో చేరడం లాంఛనమే
  • హస్తం క్యాడర్ లో కొత్త జోష్
  • బీఆర్ఎస్ నేతల్లో గుబులు

ప్రశ్నించే వాడు, అన్యాయాన్ని ఎదిరించే వాడు ప్రజల దృష్టిలో ఎప్పుడు హీరోగానే కనిపిస్తాడు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాడు. అసంతృప్తి ధిక్కార స్వరంగా మారి చివరికి తిరుగుబాటుగా రూపాంతరం చెంది అది పొంగులేటి రూపంలో పాలకుల కంటికి నిద్ర లేకుండా చేస్తున్నది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఆరు నెలలుగా అందరినీ అయోమయానికి గురిచేసిన ఖమ్మం జిల్లా నేత చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపగా బీఆర్ఎస్ వ్యతిరేకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొంగులేటి ప్రభావం కేలం ఖమ్మం జిల్లాకే పరిమితం కాకుంగా ఇతర జిల్లాలకు కూడా వ్యాపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పొంగులేటి బీజీపీలో చేరతారని కొంత కాలం ఉధృతంగానే ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఆలోచనా ధోరణి ఎవరికీ అంతుపట్టలేదు.

కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ బలమైన జిల్లాగా పేరున్న ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఉన్నది. ఇటువంటి జిల్లాలో బీజేపీ బలపడటం కష్టమేనని పొంగులేటి భావించారు. ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ లో చేరాలంటే ఒత్తిడి తెచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ లో ఇప్పటికే రేణుకా చౌదరి, మల్లు భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతలు ఉండగా పొంగులేటి రాకను వీరు జీర్ణించుకుంటారో లేదో అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంది. అయితే పార్టీ క్యాడర్ కు దూరమవుతూ ప్రజల ఆదరణ కోల్పోయిన రేణుకా చౌదరికి కానీ, మధిర నియోజకవర్గానికే పరిమితమైన భట్టికి కానీ జిల్లాలోని క్యాడర్ ను ముందుకు నడిపించి అన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేసే శక్తి లేక పోవడంతో మరొక నేత రావాలని అందరూ ఆశించారు. రాహుల్ టీమ్ ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో కూడా కాంగ్రెస్ అగ్రనేతలకు ఇదే విషయం స్పష్టమయింది. నేరుగా ఢిల్లీ వర్గాలే రంగంలోకి దిగి పొంగులేటితో చర్చలు జరిపినట్టు తెలిసింది.

పది నియోజకవర్గాల్లోనూ పట్టు…
ఖమ్మం జిల్లాలోని ఉన్న పది అసెంబ్లీ సిగ్మెంట్లలోనూ పొంగులేటికి బలం ఉండటం విశేషం. జిల్లా రాజకీయాలను గతంలో శాసించిన జలగం వెంగళరావు, తుమ్మల నాగేశ్వరరావు తర్వాత ఆ స్థాయి నాయకుడిగా పొంగులేటి ఎదగడం వెనుక ఆయన చేసిన నిరంతర కృ‌షి ఉన్నది. తన రాజకీయ గురువైన తుమ్మలను కిందకి నెట్టి ప్రజాదరణలో నెంబర్ వన్ గా పొంగులేటి ఎదగడం ఏండ్ల తరబడి రాజకీయాలు చేస్తున్న కమ్యూనిస్టులకు కూడా అంతుపట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బలం నామమాత్రంగానే ఉన్నది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖమ్మం లోక్ సభకు పోటీ చేసిన పొంగులేటి విజయం సాధించడమే కాక మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను గెలిపించుకుని సంచనలం సృష్టించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కనీసం ఎమ్మల్సీ పదవి కూడా ఇవ్వకుండా అవమానించడమే కాక కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి విజయం సాధించినపువ్వాడ అజయ్ కి మంత్రి పదవి ఇవ్వడం పొంగులేటి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ముఖ్యమంత్రి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వక పోవడంతో అసమ్మతి నేతగా కొనసాగారు. బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్న తర్వాత తన క్యాడర్ ని కాపాడుకోవడానికి గత ఆరె నెలలుగా అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.

ఏడు అసెంబ్లీ సీట్లపై గురి…
ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వీటిలో మధిరలో భట్టి విక్రమార్క, భద్రాచలంలో పొదెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొంగులేటి అనుచరుడిగా ఉన్న సత్తుపల్లి నేత మట్టా దయానంద్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో తన వర్గానికి చెందిన నేతలకు టిక్కెట్లు ఇప్పించుకోవాలని పొంగులేటి టార్గెట్ గా పెట్టుకున్నారు. వీటిలో ఒకటి రెండు తగ్గినా తన అనుచరులు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో పొంగులేటి చెప్పారు. పొంగులేటి మాత్రం ఎక్కడ పోటీ చేసేదీ స్పష్టత రాలేదు. కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలు మాత్రమే జనరల్ స్థానాలు కావడంతో మూడింటిలో ఒక చోట పోటీచేసే అవకాశం ఉన్నది. కొత్తగూడెంలో ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది.

కొండూరి రమేష్ బాబు,
సీనియర్ జర్నలిస్టు
మొబైల్.. 8332995398

Leave A Reply

Your email address will not be published.